మెదక్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : పూర్వ మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ గురువారం మెదక్ జిల్లాలో ప్రశాంతంగా సాగింది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్లు తమ ఓటు హకును వినియోగించుకున్నారు. మెదక్ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎన్నికల పోలింగ్‌కు 22 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 21 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ కొనసాగింది. ఉదయం 10 గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గానికి 8.19 శాతం, ఉపాధ్యాయ నియోజకవర్గానికి 16.41 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 12 గంటల వరకు టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 50.04 శాతం పోలింగ్ నమోదు కాగా, గ్రాడ్యుయేట్ స్థానానికి 24.62 శాతం నమోదైంది. మధ్యాహ్నం 2గంటల వరకు టీచర్స్ స్థానానికి 77.58 శాతం పోలింగ్ కాగా, గ్రాడ్యుయేట్ స్థానానికి 43.50 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 4గంటల వరకు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 95.03 శాతం పోలింగ్ నమోదు కాగా, గ్రాడ్యుయేట్ స్థానానికి 75.26 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 1347 ఓట్లు కాగా, 1250 ఓట్లు పోలయ్యాయి. గ్రాడ్యుయేట్ స్థానానికి 12,472 ఓట్లు కాగా, 9387 ఓట్లు పోలయ్యాయని అధికారులు తెలిపారు.
పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్…
మెదక్‌లోని ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల పోలింగ్ కేంద్రాన్ని గురువారం కలెక్టర్ రాహుల్‌రాజ్ సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్, టీచర్స్ స్థానాలకు జిల్లాలో మొత్తం 43 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఎక్కడా ఓటర్లకు అసౌకర్యం కలగలేదని చెప్పారు. పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు తెలిపారు. మధ్యాహ్నం 2గంటల వరకు గ్రాడ్యుయేట్ స్థానానికి 43 శాతం పోలింగ్ నమోదు కాగా, టీచర్స్ స్థానానికి 77 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. పట్టభద్రుల ఓటర్లు జిల్లాలో ఎకువ ఉన్నందువల్ల 4.00 వరకు పోలింగ్ కేంద్రం లోపల ఉన్న వారికి ఓటు వేయడానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం నిర్దేశించిన రూట్ మ్యాప్ ద్వారా కరీంనగర్ రిసెప్షన్ సెంటర్‌కు బ్యాలెట్ బాక్స్‌లను తీసుకువెళ్లాలని అధికారులకు కలెక్టర్ రాహుల్‌రాజ్ సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, సంబంధిత సిబ్బంది ఉన్నారు.