హుస్నాబాద్/హుస్నాబాద్ రూరల్ : అక్టోబర్ 28 : హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ కోరారు. శనివారం హుస్నాబాద్ మండలంలోని తోటపల్లి, గాంధీనగర్, మడద, రాములపల్లి, మాలపల్లి, పొట్లపల్లి, బంజేరుపల్లి, కూచనపల్లి, పందిల్ల గ్రామాల్లో బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి ఇనుగాల పెద్దిరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో జరిగిన ప్రచారంలో సతీశ్‌కుమార్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలో తొమ్మిదేండ్లలో రూ.9వేల కోట్లతో అభివృద్ధి పనులు పూర్తిచేయడంతో పాటు సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. నియోజకవర్గంలో ఒక్కో గ్రామానికి రూ.60లక్షల నిధుల మంజూరు చేయించి డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. నియోజకవర్గ ప్రజలు మరోసారి గెలిపిస్తే గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసి వృద్ధుల పింఛన్ రూ.5వేలు, దివ్యాంగులకు పింఛన్ రూ.6వేలు, రైతుబంధు రూ.16వేలు, రూ.400లకే గ్యాస్ సిలిండర్, ప్రతి మహిళకు రూ.3వేల భృతి, వడ్డీలేని రుణాలు తీసుకుందామన్నారు.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, ఎంపీపీ లకావత్ మానస, మార్కెట్ చైర్పర్సన్ ఎడబోయిన రజనీతిరుపతిరెడ్డి, ఎన్ఎల్సీఎఫ్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వంగ వెంకట్రామ్రెడ్డి, సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అడుగడుగునా నీరా‘జనం’…
హుస్నాబాద్ మండలంలోని తొమ్మిది గ్రామా ల్లో ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి జనం నీరాజనం పలికారు. దాదాపు అన్ని గ్రామాల్లో సతీశ్‌కుమార్‌కు మహిళలు, యువత, రైతులు ఘనస్వాగతం పలికారు. మహిళలు కోలాటం ఆటలు, బతుకమ్మలు, బోనాలతో తరలివచ్చి ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌కు మద్దతుగా నిలిచారు. ‘గుర్తుల గుర్తుంచుకో రామక్క.. కారును గుర్తుంచుకో రామక్క..’ పాటకు చిందులేసి జై తెలంగాణ, జై కేసీఆర్, జై సతీశ్‌కుమార్ నినాదాలతో హోరెత్తించారు.
సతీశ్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపిద్దాం;బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి ఇనుగాల పెద్దిరెడ్డి
ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించి, కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేద్దామని, ప్రజలందరూ కారుగుర్తుకు ఓటు వేయాలని మాజీమంత్రి, ఎన్నికల ఇన్చార్జి ఇనుగాల పెద్దిరెడ్డి కోరారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 24గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఆసరా పింఛన్లు ఇవ్వడంతో పాటు కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు సాగునీటి ప్రాజెక్టులను నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్‌కే చెందుతుందన్నారు. ప్రజారంజకమైన మ్యానిఫెస్టోను ప్రకటించి మళ్లీ ప్రజల ముం దుకొస్తున్న సీఎం కేసీఆర్‌ను, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.