నర్సాపూర్, జూలై 23 : మెదక్ జిల్లాలో 86శాతం సర్ ప్రక్రియ పూర్తయ్యిందని కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో భాగంగా గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయంలో తహసీల్దార్లు, బీఎల్వోలు, సూపర్వైజర్లతో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మరణించిన, డబుల్ నమోదైనా, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన, గైర్హాజరుగా ఉన్న ఓటర్ల వివరాలను విడివిడిగా జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. 2002 ఓటరు జాబితా నుంచి ఇప్పటి వరకు గుర్తింపు కాని ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో సేకరించాలన్నారు.
ఇప్పటికే గుర్తించిన ఓటర్ల వివరాల్లో ఉన్న వ్యత్యాసాలు, లోపాలను సరిచేసేందుకు క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. చనిపోయిన ఓటర్లు,శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లు, డబుల్ నమోదైన ఓటర్ల పేర్లను తొలిగించే ముందు క్షేత్రస్థాయిలో ధ్రువీకరణ చేయాలని, తదుపరి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బీఎల్ఏల సంతకాలు తీసుకొని మాత్రమే సంబంధిత ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో రామకృష్ణ, తహసీల్దార్ శ్రీనివాస్, బీఎల్వోలు పాల్గొన్నారు.