సదాశివపేట,అక్టోబర్ 8: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కొల్కూర్ గ్రామం లో బైక్‌ల దహనం మిస్టరీగా మారింది. 15 రోజుల్లో గ్రామంలో 8 బైక్‌లను తగులబెట్టారు. అసలు బైక్‌లు ఎవరు తగులబెడుతున్నారో ఎవరికీ అంతుపట్టడం లేదు. రాత్రివేళల్లో దుండగులు బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటిస్తుండడంతో లక్షలు వెచ్చించి కొన్న బైక్‌లు బుగ్గిపాలవుతున్నాయి. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురుతున్నారు. ఒకే రోజు రెండు బైక్‌లు తగులబెట్టారు.
ఇప్పటి వరకు రాయల్ ఎన్ఫీల్డ్, పల్సర్, యూనికాన్, ఫ్యాషన్, షైన్ బైక్‌లకు దుండగులు దహనం చేశారు. వారం రోజుల నుంచి గ్రామస్తులు నిద్ర లేకుండా బైక్‌లకు కాపలా కాస్తున్నారు. పోలీసులు సైతం గ్రామ యువకులతో కలిసి పహారా కాస్తున్నారు. ఎవరూ భయాందోళనకు గురికావొద్దని పోలీసులు వివరిస్తున్నారు. నిందితులను పట్టుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. పోలీసులు గ్రామంలోని ప్రధాన వీధుల్లో 14 సీసీ కెమెరాలు ఏర్పా టు చేశారు.
కొందరు గ్రామస్తులు వారి ఇం టి వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. సీఐ మహేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ఆవశ్యకతపై అవగాహన కల్పించడంతో 20మందికిపైగా గ్రామస్తులు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు అమర్చుకున్నారు. కాగా, ఈ ఘటనలపై సదాశివపేట సీఐ మహేశ్‌గౌడ్ స్పందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పది మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న ట్లు తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని, గ్రామంలో నిఘా కొనసాగుతున్నదన్నారు. గ్రామంలో 14 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు.