సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 6: బతుకమ్మ, దసరా,దీపావళి పండుగులు సమీపిస్తున్నా వేతనాలు రాకపోవడంతో అతిథి అధ్యాపకులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అరకొర వేతనాలతో సేవలందిస్తున్న అతిథి అధ్యాపకులకు వచ్చే కనీస వేతనాలు సమయానికి అందక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. గత విద్యా సంవత్సరానికి సంబంధించిన జూన్ వేతనంతో పాటు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మొత్తం 4నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో మొత్తం 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా, ఆయా కళాశాల ల్లో మొత్తం 90 మంది అతిథి అధ్యాపకులు విధులు నిర్వహిస్తున్నారు.
సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో 34 మంది విధులు నిర్వహిస్తుండగా, పటాన్చెరు ప్రభుత్వ కళాశాలలో 19 మంది, నారాయణఖేడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 9 మంది, జోగిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో 10 మంది, జహీరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 12 మంది, సదాశివపేట ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో నలుగురు, సంగారెడ్డిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఇద్దరు అతిథి అధ్యాపకులు పని చేస్తున్నా రు. వీరంతా గత జూలై మొదటి వారంలో నియామకం అయ్యారు. అప్పటికే విధుల్లో పీజీ అధ్యాపకులకు జూన్‌కు సంబంధించిన వేతనాలు విడుదల కాలేదు. ఎన్నేండ్ల అనుభవం ఉన్నా వారు ఏటా ఇంటర్వ్యూ, డెమో ఫేస్ చేయాల్సిందే.
రెగ్యులర్ అధ్యాపకులు ఒక్కసారి పరీక్ష రాసి ఉద్యోగంలో చేరితే అతిథి అధ్యాపకులకు మాత్రం ఏటా వారి నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సిందే. పదేం డ్లు సేవలందించినా యూజీసీ నిబంధనల పేరిట సెట్, నెట్, పీహెచ్డీ అర్హతలు గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు వస్తే వారికే చాన్స్ ఇస్తున్నారు. పదేండ్లు సేవలందించినా గుర్తింపు ఉండడం లేదు. అసలు ఏ పరీక్ష రాయకుండానే త్రీమెన్ కమిటీ ద్వారా ఒక్కసారి ఎంపికైన కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఏటా రెన్యువల్ చేస్తారు. కానీ, అతిథి అధ్యాపకులను ఏటా త్రీమెన్ కమిటీ ద్వారా నియమిస్తూ అంగట్లో సరుకులా మార్చిన పరిస్థితులు నెలకొన్నాయని వాపోతున్నారు.
ఎప్పుడో వచ్చే వేతనాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.అతిథి అధ్యాపకులు నెలకు రూ.42 వేలు, డిగ్రీ అతిథి అధ్యాపకులు నెలకు రూ.50వేల వేతనం చెల్లిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదు. తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలుగా భావిస్తున్న అతిథి అధ్యాపకులు రోడ్డెక్కేందుకు జంకుతున్నారు. ప్రజా పాల న ప్రభుత్వానికి కనికరం వస్తుందనే ఆశతో ఇప్పటికే రాష్ట్ర మంత్రులందరికీ వినతి పత్రాలు అందజేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో లో ఇచ్చిన మాట మేరకు అతిథి అధ్యాపకులు రూ. 50వేల వేతనంతో పాటు కన్సాలిడేట్ వేతనాలను ఇవ్వాలని, రెగ్యులర్ అధ్యాపకులు వచ్చే వరకు తమ ఉద్యోగాలను రెన్యువల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఒక తాత్కాలిక ఉద్యోగి స్థానంలో మరొక తాత్కాలిక ఉద్యోగిని నియమించరాదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని అతిథి అధ్యాపకులు మండిపడుతున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు తాత్కాలికులైన కాంట్రాక్ట్ అధ్యాపకులు బదిలీపై వచ్చినా అతిథి అధ్యాపకులను ఇంటికి పంపించడం సరికాదంటున్నారు. ఇప్పటికే ఏడాదికి కనీసం ఆరు నెలల పూర్తి వేతనం కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూలై మాసంలో తిరిగి విధుల్లో ఇంట ర్వ్యూ ద్వారా నియామకం చేస్తే ప్రస్తుత అక్టోబర్‌లో దసరా సెలవుల కారణంగా సగం వేతనం వస్తుందని, డిసెంబర్, ఏప్రిల్ నెలలో జరిగే సెమిస్టర్ పరీక్షలకు వేతనాలుండవు, మే, జూన్ నెలలు ఖాళీ ఉండడంతో పాటు జనవరిలోనూ సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చే సెలవుల కారణంగా ఆ నెల కూడా సగం వేతనమే వస్తుందని పేర్కొంటున్నారు.
ఎప్పుడు ఉద్యోగం పోతుందో అనే భయం గుప్పిట్లో కాలం వెల్లదీస్తున్నారు. ఇటీవల జరిగిన నియామకాల్లోనూ అదే జరిగింది. 10 ఏండ్లుగా పనిచేసిన అనేక మంది డిస్టర్బ్ అయ్యారు. పీరియడ్‌కు రూ.100 నుంచి సేవలందించిన అతిథి అధ్యాపకులు, అనేక పోరాటాల తరువాత ప్రస్తుతం పీరియడ్‌కు రూ.390, నెలకు గరిష్టంగా 72 గంటలకు మాత్రమే పరిమితి ఉన్నది.