పటాన్చెరు, ఆగస్టు 30: పటాన్చెరు, రామచంద్రాపురం, భారతీనగర్ జీహెచ్ఎంసీ డివిజన్లలో 500 డబుల్ బెడ్రూం ఇండ్లను బుధవారం పటాన్చెరు పట్టణంలోని ఎంపీపీ హాలులో పేదలకు కేటాయించారు. ముగ్గురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, సంగారెడ్డి కలెక్టర్ శరత్ స్వయంగా ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. 9,900 అప్లికేషన్లు రావడంతో విచారించిన ప్రత్యేక బృందాలు 4,132 మందిని అర్హులుగా తేల్చాయి. వీరిలో ఐదువందల మందిని పారదర్శకంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీతో పేదల కలను నిజం చేస్తున్న సీఎం కేసీఆర్‌కు వారు రుణపడి ఉంటారన్నారు. కొల్లూర్ రెవెన్యూ గ్రామం కావడంతో అక్కడ నుంచి 79 మందిని ఎంపిక చేశామన్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుల సమక్షంలో లబ్ధిదారులంతా త్వరలోనే గృహప్రవేశాలు చేయిస్తామన్నారు.
పటాన్చెరు, ఆగస్టు 30: బుధవారం పటాన్‌చెరులోని ఎంపీపీ సమావేశ మందిరం వేదికగా పటాన్చెరు, రామచంద్రాపురం, భారతీనగర్ డివిజన్లలో నివసిస్తున్న పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను పారదర్శకంగా కంప్యూటర్ తీసిన డ్రాలో ఎంపిక చేశారు. కొల్లూర్‌లోని ప్లాట్లకు ఎంపికైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, కలెక్టర్ శరత్‌కుమార్ ఫోన్ చేసి డబుల్ బెడ్రూం ఇండ్లు అందజేస్తున్నామని తెలిపారు. ఇండ్లు దక్కించుకున్న మహిళలు ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, కలెక్టర్ శరత్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపికైన మహిళలకు ఎమ్మెల్యే స్వయంగా ఫోన్ చేసి మీకు డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చిందని తెలుపడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
మూడో విడత 500 మందికి..
పటాన్‌చెరులోని మూడు జీహెచ్ఎంసీ డివిజన్లకు మూడో విడతగా 500ల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయి. కంప్యూటర్ తీసిన ఈ డ్రాలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే, కలెక్టర్ ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. పటాన్‌చెరులోని మూడు డివిజన్లకు 9,900 అప్లికేషన్లు వచ్చాయి. ప్రత్యేక బృందాలు విచారించి అర్హులుగా 4,132 మందిని తేల్చారు. వీరిలోంచి 500 మందిని డ్రా ద్వారా ఎంపిక చేశారు. ఈ డ్రాలో ఇండ్లకు ఎంపికైన వారిని ఎమ్మెల్యే, కలెక్టర్ ఫోన్ చేసి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డబుల్ బెడ్రూం అనే కలను నిజం చేస్తున్న సీఎం కేసీఆర్‌కు లబ్ధిదారుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని ఆయా ప్రాంతాల్లో నివాసముంటున్న నిరుపేదలు, సొంతిల్లు లేక అద్దెకుంటున్న సామాన్యుల సొంతింటి కలను నిజం చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మరో 2000 డబుల్ బెడ్రూం ఇండ్లు పటాన్చెరు డివిజన్లకు వస్తున్నాయన్నారు.
పటాన్చెరు నియోజకవర్గంలో 30 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మాణం అవుతున్నాయన్నారు. కొల్లూర్, నాగులపల్లి, కర్ధనూర్, అమీన్‌ఫూర్ ప్రాంతాల్లో పనులు పూర్తి అవుతున్నాయన్నారు. పూర్తిగా పారదర్శకంగా డబుల్ బెడ్రూం ఇండ్ల డ్రాలు చేస్తున్నారని అధికారులను కొనియాడారు. ఇంటి కలను తీర్చడంలో బీఆర్ఎస్ చేస్తున్న కృషిని గుర్తించిన ప్రజలు ఆశీర్వదిస్తూ తమకు అండగా ఉంటున్నారన్నారు. లబ్ధిదారులకు త్వరలోనే గృహప్రవేశాలను ఘనంగా చేయిస్తామన్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులను ఆహ్వానిస్తామన్నారు. కొల్లూర్ రెవెన్యూ గ్రామం కావడంతో అక్కడ నుంచి 79 మందిని ఎంపిక చేశామన్నారు. మొదటి విడతలో జీహెచ్ఎంసీ పరిధిలోని ఆర్సీపురం, పటాన్చెరు, భారతీనగర్నుంచి మొత్తం 500 మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు వచ్చాయన్నారు. వారందరికీ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, సుప్రజా వెంకట్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, కార్పొరేటర్లు పుష్పా నగేశ్ యాదవ్, సింధు ఆదర్శ్‌రెడ్డి, మెట్టు కుమార్‌యాదవ్, తహసీల్దార్ భాస్కర్, డిప్యూటీ కమిషనర్ సురేశ్, శ్రీధర్‌చారి, అమీన్పూర్ వైస్ చైర్మన్ నర్సింహాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పారదర్శకంగా ఎంపికలు
కంప్యూటర్ ర్యాండమైజేషన్ విధానంతో లబ్ధిదారులను ఎంపిక చేశాం. జీహెచ్ఎంసీ పరిధిలో 9,900 దరఖాస్తులు వస్తే వాటిని ఇంటింటికీ తిరిగి విచారించి, అర్హులను గుర్తించాం. కంప్యూటర్ స్వయంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. ఈ విధానంపై ఎలాంటి అనుమానాలు ఉండవు. లబ్ధిదారులకు త్వరలో గృహ ప్రవేశాలు కల్పిస్తాం. ఇది మొదటి విడత డ్రా. ప్లాట్‌కు సంబంధించిన పత్రాలు అందజేస్తాం.
-శరత్‌కుమార్, సంగారెడ్డి కలెక్టర్
ఎమ్మెల్యే: హలో.. సుజాత నా..?
సుజాత: అవును .. మీరెవరు?
ఎమ్మెల్యే: నేను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిని మాట్లాడుతున్నానమ్మ..
సుజాత: అన్నా మీరా.. నమస్తే… చెప్పండన్నా..
ఎమ్మెల్యే: నువ్వు ఎక్కడుంటావమ్మా?
సుజాత: అన్నా నేను పటాన్చెరు శాంతినగర్‌లో ఉంటా..
ఎమ్మెల్యే: నీకో గుడ్ న్యూస్ చెబుదామని మన కలెక్టర్‌తో కలసి కాల్ చేస్తున్న..
సుజాత: చెప్పండన్నా..
ఎమ్మెల్యే: నీకు కొల్లూర్‌లోని డబుల్ బెడ్రూం ఇండ్ల డ్రాలో ఇల్లు ఎల్లింది..
సుజాత: నిజమా అన్నా.. చాలా సంతోషం.. అన్నా మీరు దేవుళ్లన్నా.. నిజంగా మీకు జీవితాంతం రుణపడి ఉంటామన్నా..
ఎమ్మెల్యే: అంతా సీఎం కేసీఆర్ సార్ ఆశీర్వాదం ఇది..
సుజాత: అవునన్నా సంతోషంతో నాకు నోరు తిరగట్లేదన్నా.. మీరు చాలా మేలు చేశారన్నా. సొంతింటి కల నిజం చేశారు..
ఎమ్మెల్యే: కొల్లూరులో రూ.70లక్షల విలువైన డబుల్ బెడ్రూం ఇల్లు నీకు అలాట్ అయ్యింది. త్వరలో పెద్దఎత్తున గృహ ప్రవేశాలు పెడతాం.
సుజాత: అన్నా సంతోషమైన వార్త జెప్పిండ్రు..
అనంతరం కలెక్టర్ శరత్ కూడా ఫోన్లో ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.