Siddipeta | తొగుట, ఆగస్టు 01: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోనీ వివిధ గ్రామాలలో 5 సంవత్సరాల లోపు పిల్లలను ప్రీ ప్రైమరీ పేరుతో ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకోవడం ఆపాలనీ కోరుతూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో మండల విద్యా శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ నాయకురాలు, సీఐటీయూ తొగుట మండల కన్వీనర్ ఎ వసంత మాట్లాడుతూ.. ఐసిడిఎస్ అంగన్వాడీ సెంటర్ పరిధిలో ప్రభుత్వ నిబంధన ప్రకారం పౌష్టికకారం అందించడం కొరకు ఐసిడిఎస్ ఏర్పడిందనీ తెలిపారు. ఐదు సంవత్సరాల వరకు పిల్లలను అంగన్వాడీలోనే కొనసాగించాలని, పౌష్టికాహారాన్నీ అందించాలని నిబంధన ఉన్నదనీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రీప్రైమరీ పేరుతో ప్రభుత్వ పాఠశాలలో నమోదు చేయడం సరైంది కాదన్నారు. ప్రస్తుతం మండల పరిధిలోని వివిధ గ్రామాలలో 5 సంవత్సరాల లోపు చిన్నపిల్లలను ప్రీ ప్రైమరీ పేరుతో ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకోవడం వలన అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వలన చిన్న పిల్లలలో పౌష్టికాహార లోపం పెరుగుతుందని, అంగన్వాడి ఉద్యోగులకు, ఐసిడిఎస్ సేవలకు భద్రత లేకుండా పోతుందన్నారు. కావున పై విషయాలను పరిశీలన చేసి 5 సంవత్సరాల లోపు పల్లలను అంగన్వాడీ కేంద్రాలలోనే కొనసాగే విధంగా సహకరించగలరని అధికారులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు రజిత, రాణి, భారతమ్మ, విజయ, పద్మ, భాగ్య, రేణుక, విజయ తదితరులు పాల్గొన్నారు.