గజ్వేల్, జనవరి 11: సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ శనివారం కన్నీటి సంద్రంగా మారింది. హైదరాబాద్‌లోని ముషీరాబాద్ ఇందిరానగర్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు గ్యార ధనుశ్(20), గ్యార లోహిత్ (17), బన్సీలాల్‌పేటకు చెందిన చీకట్ల దినేశ్వర్ (17), అత్తాపూర్‌కు చెందిన సాహిల్ దీపక్ సుతార్ (19), ఖైరతాబాద్‌లోని చింతలబస్తీకి చెందిన ఉప్పల జతిన్ (17) ప్రాజెక్టులో నీట మునిగి మృతిచెందడం బాధిత కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. సంక్రాంతి సెలవులు రావడంతో సరదాగా స్నేహితులంతా ఆనందంగా గడిపేందుకు శనివారం తెల్లవారుజామునే ఇండ్ల నుంచి బయలుదేరి ఒక్కొక్కరుగా ఏడుగురు స్నేహితులు కలుసుకొని స్కూటీలపై కొండపోచమ్మ సాగర్‌ను చూసేందుకు వచ్చారు.
స్కూటీలపై వస్తుండగానే సరదాగా సెల్ఫీ వీడియోలు తీసుకుంటూ ఆనందంగా ప్రాజెక్టు వద్దకు చేరుకున్న వారంతా నీళ్లలో ఆడేందుకు దిగారు. కాసేపు ప్రాజెక్టులో ఆడుకొని సెల్ఫీలు, వీడియోలు తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు ప్రాజెక్టులో పడి ఐదుగురు యువకులు గల్లంతై మృతిచెందగా, మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. సురక్షితంగా బయటపడిన యువకులు డయల్ 100కు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం రాత్రి అయ్యే వరకు ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి.
తమ కుమారులు మృతి చెందినట్లు సమాచారం తెలియడంతో గుండెలు బాదుకుంటూ తల్లిదండ్రులు కొండపోచమ్మ సాగర్ వద్దకు చేరుకున్నారు. మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు ధనుష్, లోహిత్ మృత్యువాత పడడంతో ఆ తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలింది. కష్టపడుతూ కుమారులను పోషించుకుంటున్నమంటూ తల్లిదండ్రులు నర్సింగరావు, జయంతి రోదనలు అక్కడి వారిని కంటతడి పెట్టించాయి. పెద్ద కుమారుగు ధనుశ్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా, చిన్న కుమారుడు లోహిత్ డిప్ల్లొ్లమా చదువుకుంటున్నాడు.
ఇక సాహిల్ దీపక్ సుతార్ తండ్రి లేకపోవడంతో అన్నీతానై తల్లి అనిత వంటపని చేసుకుంటూ కుమారుడిని డిప్ల్లొమా చదివిస్తున్నది. చీకట్ల దినేశ్వర్ డిప్ల్లొమా చదువుతుండగా, తండ్రి కిషన్ కారు డ్రైవర్‌గా, జతిన్ డిగ్రీ చదువుతుండగా తండ్రి కోటేశ్వర్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. చేతికందిన కుమారులు విగత జీవులుగా మారడంతో కుటుంబీకులు రోదనలు మిన్నంటాయి. మృతదేహాలను చూసేందుకు స్నేహితులు, కాలనీవాసులు ప్రాజెక్టు వద్దకు భారీగా చేరుకుని విలపించారు.
కొండపోచమ్మ ప్రాజెక్టు పైకి వెళ్ల్లేందుకు ఏర్పాటు చేసిన రెండు గేట్ల వద్ద సిబ్బంది లేకపోవడంతో సెలవు రోజుల్లో వచ్చే యువకులు నేరుగా ప్రాజెక్టు లోపలికి వెళ్లి నీటిలో సెల్ఫీలు తీసుకుంటూ గడుపుతున్నారు. ప్రాజెక్టు వద్ద పర్యవేక్షణ సిబ్బంది లేకపోవడంతో గంటల తరబడి యువతీయువకులు ప్రమాదకర ప్రాంతానికి చేరుకొని ఫొటోలు దిగుతున్నారు. ప్రాజెక్టు వద్దకు వచ్చే వారిపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నదని స్థానికులు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో రెండు గేట్ల వద్ద పోలీస్ బందోబస్తు ఉండేది. అనుమతి తీసుకొని మాత్రమే సందర్శకులు వెళ్లేవారు. చూసేందుకు వెళ్లిన వారిని అక్కడి సిబ్బంది పర్యవేక్షించేవారు. ముషీరాబాద్‌కు చెందిన ఐదుగురు యువకులు ప్రాజెక్టులో అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పడి మృతిచెందినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
కొండపోచమ్మ సాగర్ వద్ద సెక్యూరిటీ లేకపోవడం, పెట్రోలింగ్ చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణమని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. యువకుల మృతికి నైతిక బాధ్యత ప్రభుత్వం వహించాలని, గతంలోని కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టు చుట్టూ పోలీసులు భద్రత కాసేవారని, ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ నిర్వహిస్తూ సందర్శనకు వచ్చే వారిని అప్రమత్తం చేశారన్నారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియో అందించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను సీఎం స్వయంగా పరామర్శించి ఎక్స్‌గ్రేషియో అందించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.
– వంటేరు ప్రతాప్‌రెడ్డి