రామచంద్రాపురం, డిసెంబర్ 8: ఆర్సీపురం డివిజన్లోని సాయినగర్‌కాలనీలో ఆదివారం భారీ చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి సమయంలో ఇంట్లోని వారు గాఢ నిద్రలో ఉండగా దుండగుడు మరో బెడ్రూంలోకి వెళ్లి దొంగతనానికి పాల్పడ్డాడు. సాయినగర్కాలనీకి చెందిన వేణుగోపాల్ ప్రైవేట్ ఉద్యోగి. శనివారం రాత్రి పడుకునే ముందు ఇంటి మెయిన్ డోర్ మధ్యలోని గడియపెట్టి సెంట్రల్ లాక్ వేయడం మర్చిపోయి బెడ్రూంలోకి వెళ్లి పడుకున్నాడు.
అర్ధరాత్రి దుండగుడు ఇంట్లోకి వెళ్లి కిటికీ నుంచి మెయిన్ డోర్ తెరిచి లోనికి ప్రవేశించాడు. వేణుగోపాల్ కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న గదిలోకి కాకుండా అతని తల్లిదండ్రులు ఉండే మరో బెడ్రూంలో ఎవరూ లేని విషయాన్ని గమనించి వస్తువులన్నీ తీసి చిందరవందరగా పడేశాడు.
ఆ గదిలో దొరికిన 46తులాల బంగారు ఆభరణాలు, 20తులాల వెండి, రూ.13వేలు నగదు తీసుకొని బెడ్రూంలోని అన్ని వస్తువులపై కారంపొడి చల్లి పారిపోయాడు. తెల్ల్లవారుజామున వేణుగోపాల్ వాష్రూంకి వెళ్లిన సమయంలో ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా ఉండడం గమనించి బెడ్రూంలోకి వెళ్లి చూశాడు. ఆ తర్వాత అతను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆర్సీపురం సీఐ శ్రీకర్‌బాబు, సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. క్లూస్‌టీం వచ్చి వివరాలు సేకరించారు. సీసీ ఫుటేజీని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.