సంగారెడ్డి కలెక్టరేట్, ఫిబ్రవరి 15: గుణాత్మక విద్య అందించాలంటే పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో పీఎం శ్రీ పథకం కింద 44 పాఠశాలలు ఎంపికయ్యాయని తెలిపారు. ఎంపికైన ఆయా పాఠశాలల్లో పీఎం శ్రీ పథకం కింద మంజూరైన నిధులతో క్రీడలు, నైపుణ్యాభివృద్ధికి వినియోగించాలన్నారు. సర్వశిక్షా అభియాన్, పీఎం శ్రీ పథకం నిధులతో పాఠశాలల అభివృద్ధి పనులు నాణ్యతగా జరగాలన్నారు. కిచెన్ గార్డ్మ ఫీల్డ్ విజిట్, ఎల్ఈడీ లైటింగ్, లైబ్రరీ అభివృద్ధి, మరుగుదొడ్లు, తాగునీటి వసతి, ల్యాబ్ ఏర్పాట్లు స్పోర్ట్స్ కిట్ల వంటి తదితర అభివృద్ధి పనులకు వినియోగించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డీఈవో వెంకటేశ్వర్లు, పీఆర్ ఈఈ జగదీశ్, జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ఎంఈవోలు, ఇంజనీరింగ్ అధికారులు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
డీఎస్సీ 2008 అభ్యర్థులకు పోస్టింగ్‌లు
ఇదిలా ఉండగా, శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ మాధురి డీఎస్సీ 2008 అభ్యర్థులకు పోస్టింగ్ కల్పించారు. 67 మంది అభ్యర్థులకు 2024-25 విద్యా సంవత్సరానికి గాను కాంట్రాక్టు పద్ధతిలో నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈనెల 17న సంబంధిత మండల విద్యాధికారి కార్యాలయంలో ఫిజికల్ సర్టిఫికేట్‌తో రిపోర్ట్ చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు.