సంగారెడ్డి, జూలై 15: ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద బీసీ ప్రజా ప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీల మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ.. బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ధర్నాలో సంగారెడ్డి నాయకులు భిక్షపతి, రాజేందర్, పట్నం మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.