సంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు టీఎస్ఐపాస్ ద్వారా 186 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని, సుమారు రూ.1881 కోట్లతో పెట్టుబడితో 176 పరిశ్రమలు స్థాపించి సుమారు 11,500 మందికి ఉపాధి కల్పించినట్లు మంత్రి పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, డోజర్ కొనుగోలు చేసి పారిశుధ్య నిర్వహణ పనులకు సమర్థవంతంగా వినియోగిస్తూ, స్వచ్ఛ గ్రామాల దిశగా పయనిస్తున్నాయన్నారు.
ప్రతి గ్రామ పంచాయతీలో క్రీడా ప్రాంగణం, పల్లె ప్రకృతి వనం, నర్సరీలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. కల్యాణలక్ష్మి పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 40,716 మంది లబ్ధిదారులకు సుమారు రూ.388 కోట్లతో, షాదీ ముబారక్ పథకం కింద 11,243 మంది లబ్ధిదారులకు రూ.105 కోట్ల ఆర్థిక సాయం అందించామన్నారు. జిల్లాలో కొనసాగుతున్న ఆయా అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, కలెక్టర్ శరత్, ఎస్పీ రమణ కుమార్, టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్, డీఎసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లాలో 1808 ఎకరాల భూమిని 1127 మంది లబ్ధిదారులకు పోడు పట్టలను పంపిణీ చేశామన్నారు. 47 గిరిజన గ్రామ పంచాయతీలకు కొత్త భవనాలు మంజూరు చేసినట్లు మంత్రి మహమూద్ అలీ తెలిపారు. తండాలు, గూడాలకు రహదారి సౌకర్యం కల్పించేందుకు రూ.6 కోట్ల 38 లక్షలు మంజూరు చేసినట్లు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం మైనార్టీలకు 100 శాతం సబ్సిడీతో రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నదన్నారు. జిల్లాలో మొదటి విడత కింద 448 మంది లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
రెండో విడతలో నియోజకవర్గానికి 120 మంది చొప్పున 600 మందికి అందించామన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం కింద జిల్లాకు 5,934 ఇండ్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు రూ.213 కోట్లతో 3,498 గృహాలు పూర్తి కాగా, 3,450 ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించామన్నారు. బీసీ, ఎంబీసీ కుల వృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సహాయం కింద మొదటి విడతలో 1500 మందికి 100 శాతం సబ్సిడీ కింద రూ.15 కోట్ల గ్రాంట్, రెండో విడతలో మరో 1500 మందికి అందించినట్లు వివరించారు. గృహలక్ష్మి పథకం కింద జిల్లాకు 14,250 ఇండ్లు కేటాయించగా, ఇప్పటివరకు 5,865 మంది లబ్ధిదారులకు మంజూరు చేసినట్లు తెలిపారు.
సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 17: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో అద్భుత ప్రగతిని సాధిస్తూనే, దేశానికే దిక్సూచిగా నిలిచిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ జిల్లా ప్రజలకు జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో మంది అమరుల త్యాగ ఫలంతో నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికిందన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఎంతో కీలకమైన రోజని, సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైందని వెల్లడించారు. 60 ఏండ్ల స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళుతున్నదన్నారు. సంగారెడ్డి జిల్లా ప్రగతిని మంత్రి వివరించారు.
రైతుబంధు పథకం కింద జిల్లాలో 11 విడతల్లో 3 లక్షల 25వేల మంది రైతులకు రూ.3,557 కోట్ల 45 లక్షలను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. రైతుబీమా పథకం కింద మరణించిన 6,698 మంది రైతు కుటుంబాలకు రూ.335 కోట్లను నామినీ ఖాతాల్లో జమ చేశామన్నారు. రుణమాఫీ కింద 78 వేల 54 మంది రైతులకు రూ.460 కోట్ల 74 లక్షలను రుణమాఫీ చేసినట్లు తెలిపారు.
సింగూరు ప్రాజెక్టుపై సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు ప్రభుత్వం రూ.4,427 కోట్లను కేటాయించిందని, ఈ రెండు ఎత్తిపోతల పథకాల ద్వారా జిల్లాలో 3లక్షల 84వేల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. గొర్రెల పంపిణీ పథకంలో జిల్లాలో మొదటి విడతలో 19,203 గొర్రెల యూనిట్లను లబ్ధిదారులకు అందించామని, రెండో విడతలో ఇప్పటి వరకు1242 మంది లబ్ధిదారులకు గొర్రెలు అందించినట్లు వెల్లడించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా జిల్లాలో 943 నివాస ప్రాంతాలకు ఇంటింటికీ నల్లాతో తాగునీటిని సరఫరా చేస్తున్నట్టు పేర్కొన్నారు.
444 మంది లబ్ధిదారులకు దళితబంధు..
సంగారెడ్డి జిల్లాలో దళిత బంధు పథకం కింద జిల్లాలో మొదటి విడత కింద 444 మంది ఎస్సీ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల చొప్పున రూ.44 కోట్ల 45 లక్షలతో వివిధ లాభదాయక యూనిట్లను ఇచ్చామన్నారు. రెండో విడతగా ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 1100 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున వివిధ యూనిట్లను అందించనున్నట్లు చెప్పారు. జిల్లాలో 173 పల్లె దవాఖానలు, 19 బస్తీ దవాఖాలు ఏర్పాటు చేశామని, పటాన్చెరులో రూ.70 కోట్లతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం, రూ.34 కోట్లతో జిల్లా ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణం జరుగుతుందన్నారు.
3,912 మంది గర్భిణులకు న్యూట్రిషన్ కిట్స్ అందజేస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్య మహిళా క్లినిక్ల ద్వారా ఇప్పటివరకు 11,063 మంది మహిళలను పరీక్షించి సుమారు 8,023 మందికి చికిత్స అందించినట్లు స్పష్టం చేశారు. ఆసరా పింఛన్ల కింద జిల్లాలో లక్షా 61వేల 593 మందికి ప్రతినెలా రూ.36 కోట్ల 30లక్షలు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 5,291 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద రూ.419 కోట్ల రుణాలు అందించి, రాష్ట్రస్థాయిలో జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నదన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో 364స్వయం సహాయక సంఘాలకు రూ.34 కోట్ల 32లక్షలను బ్యాంకు లింకేజీ రుణాలు ఇప్పటికే అందించామన్నారు. తెలంగాణకు హరితహారంలో భాగంగా ఈ ఏడాది జిల్లాలో 41 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 57 లక్షల మొక్కలు నాటి రాష్ట్రస్థాయిలో జిల్లా మొదటి స్థానంలో ఉన్నదన్నారు.