రామాయంపేట,జూలై 9: మెదక్ జిల్లా రామాయంపేట బల్దియా పరిధిలోని కోమటిపల్లి తెలంగాణ మాడల్ స్కూల్లో మంగళవారం ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వివరాలు.. కోమటిపల్లిలోని తెలంగాణ మాడల్ స్కూల్ కళాశాలలో మంగళవారం ఉదయం అల్పాహారం తిని 35 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వసతి గృహం సిబ్బంది వారిని హుటాహుటిన రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. 32 మంది విద్యార్థినులకు వైద్యం అందించిన తర్వాత కోలుకోవడంతో హాస్టల్కు తరలించారు. మరో ముగ్గురు విద్యార్థినులను దవాఖానలో ఉంచి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు దవాఖానకు చేరుకుని విద్యార్థినులను పరామర్శించి ధైర్యం చెప్పారు. డీఈవో రాధాకిషన్, ఉప వైద్యాధికారి అనిల, మెదక్ ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్ రజినీకుమారి, వైద్యురాలు హరిప్రియ, ప్రదీప్, సుకేషిని దవాఖానలో విద్యార్థినులను పరామర్శించారు. ఘటనపై డీఈ వో రాధాకిషన్ స్పందించారు. విద్యార్థినులు అల్పాహారం భుజించి అస్వస్థతకు గురైన మాట వాస్తవమేనని, విద్యార్థినులకు ప్రభు త్వ దవాఖానలో మెరుగైన వైద్యం అందించినట్లు తెలిపారు. అల్పాహారంలో బల్లి పడ్డట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నామన్నారు.