చేర్యాల, మే 23: అసలే ఎండాకాలం… కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. దీంతో మందుబాబులు దూప తీర్చుకోవడానికి బీర్లు తెగ తాగేస్తుండంతో డిమాండ్ పెరిగింది. సిద్దిపేట జిల్లాలో 93 మద్యం షాపులు, 15 బార్లు ఉన్నాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో జిల్లాలో 3,46,659 కేసుల బీర్ల విక్రయాలు జరిగాయి. ఏప్రిల్ 1 నుంచి మే 21వ తేదీ వరకు 5,14,274 కేసుల బీర్ల విక్రయాలు జరిగినట్లు సిద్దిపేట మద్యం డిపో రికార్డులు చెబుతున్నాయి. జిల్లా మద్యం డిపో నుంచి సిరిసిల్లకు సైతం మద్యం సరఫరా అవుతున్నది.
ఏప్రిల్‌లో బీర్ల విక్రయాలు బాగా జరిగాయి. 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో వైన్ షాపుల పక్కనే ఉన్న పర్మిట్ రూమ్‌లు, బార్ల వద్ద రద్దీ నెలకొంటున్నది. యువత, కార్మికులు, ఉద్యోగులు ఎండల పేరిట చల్లని బీర్లు తెగ తాగేస్తున్నారు. దీంతో బీర్ల తయారీ కంపెనీలతో పాటు బార్లు, వైన్ షాపుల యజమానులకు కలిసివస్తున్నది. వైన్ షాప్‌లో చల్లని బీరు లేదంటే మరో షాపునకు వెళ్తున్నారు. దీంతో వైన్స్‌ల నిర్వాహకులు ఎక్కువ ఫ్రిజ్‌లు ఏర్పాటు చేసి బీర్లను కూల్ చేసి విక్రయిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో గతేడాది మేతో పోలిస్తే ఈసారి అమ్మకాలు 18.40శాతం అధికంగా ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. మరో వారం ముగిస్తే మే నెల పూర్తవుతుంది.
రోహిణీ కార్తె ఈనెల 25 నుంచి ప్రారంభం కానుండడంతో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో మరిన్ని బీర్లు అమ్ముడు అవుతాయని వైన్స్‌ల నిర్వాహకులు చెబుతున్నారు. ఇదే జరిగితే ఇప్పటి వరకు నమోదైన అత్యధిక బీరు విక్రయాల రికార్డు బ్రేక్ కావచ్చు.విస్కీ, బ్రాందీ తాగే వారు సైతం ఎండల దెబ్బకు బీరు తాగేందుకు మొగ్గు చూపుతున్నారు.ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన బీరు తాగే సంస్కృతి ,ఇప్పుడు పల్లెలకు విస్తరించింది.మండే ఎండలతో రైతులు, కూలీలు సైతం పని ముగిసిన వెంటనే బీరు తాగేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. చల్లదనం అంటూ మొదలైన అలవాటు రోజురోజుకు వ్యసనంగా మారుతుందని పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.బీర్లలో సైతం కొన్ని బ్రాండ్లకు ఎక్కువ డిమాండ్ ఉంది.వీకెండ్లో పరిస్థితి మరింత భిన్నంగా ఉంటోంది. చల్లని బీరు కోసం యువత కొన్ని కిలోమీటర్లకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు.
డీహైడ్రేషన్ ముప్పు…
చల్లని బీరు సేవించడంతో శరీరం చల్లబడుతుందని అనుకుంటే పొరపాటు పడ్డట్టేనని వైద్యులు చెబుతున్నారు.అధికంగా బీర్లు తాగడం వల్ల డీహైడ్రేషన్, లివర్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో శరీరానికి నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి సహజ పానీయాలే శ్రేయస్కరమని సూచిస్తున్నారు. ఆదాయం కోసం అమ్మకాలను ప్రభు త్వం ప్రోత్సహిస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క బీరుతో ఏమవుతుందని అనే భావనతో ప్రారంభమైన తాగుడు వ్యసనానికి దారి తీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. మద్యాన్ని నియంత్రిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఊరూరా మద్యాన్ని ఏరులై పారిస్తున్నదని మహిళలు విమర్శిస్తున్నారు. మద్యనిషేధం విధించాలని సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోని పలు గ్రామాల్లో మహిళలు నిరసనలు చేపట్టారు.