
సామాజిక వెనుకబాటు పారదోలాలి
విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తేవాలి
ప్రొఫెసర్ కంచె ఐలయ్య, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
రామచంద్రాపురం, జనవరి 26 : బహుజనులందరికీ ఇంగ్లిష్ మాట్లాడడం వచ్చినప్పుడే దేశం బాగుపడుతుందని, సామాజిక వెనుకబాటును పారాదోలినప్పుడే సమాజంలో బహుజనులకు సమూచిత గౌరవం దక్కుతుందని ప్రొఫెసర్ కంచె ఐలయ్య, మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి జ్యోతిరావుఫూలే కాలనీలో అమృత సత్తయ్య కొల్లూరీ ఎడ్యుకేషనల్ సొసైటీ(ఆస్క్)ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ నేటి తరానికి బహుజన యోధుల చరిత్రను నేర్పించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రశ్నిం చే తత్వాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. ప్రతి అంశంపై సమకాలిన రీసెర్చ్ జరుగాలన్నారు. ఆస్క్ ఎడ్యుకేషన్ లాంటి సొసైటీలు సమాజంలో ఇంకా రావాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. అంతకు ముందు ప్రొఫెసర్ కంచె ఐలయ్య మాట్లాడుతూ ఆస్క్ సొసైటీలో ఉచితంగా ఫిలాసాఫికల్, ఇంగ్లిష్ భాషపై ట్రైనింగ్ ఇస్తారన్నారు. ఉన్నత చదువులు చదివి ఇంగ్లిష్ మాట్లాడేందుకు ఇబ్బంది పడే విద్యార్థులు ఆస్క్లో చేరి ట్రైనింగ్ తీసుకోవాలని సూచించారు. కరోనా తర్వాత యాక్టివ్ క్లాసులు ప్రారంభమవుతాయని, అప్పటివరకు ఆన్లైన్లో బోధనలు జరుగుతాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు పేద విద్యార్థులందరూ ఆస్క్ సొసైటీలో చేరొచ్చన్నారు. అనంతరం సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య, సీనియర్ జర్నలిస్ట్ పాశంయాదగిరి, ఆస్క్ సొసైటీ అధ్యక్షుడు కొల్లూరీ సత్తయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు ఎస్ సింహాద్రి, అడపా సత్యనారాయణ, పీఎల్ విశ్వేశ్వర్, కే శ్రీనివాసులు, ఆస్క్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రధానకార్యదర్శి, కౌన్సిలర్ భరత్‌కుమార్, సంయుక్త కార్యదర్శి సత్యనారాయణరాజు, కోశాధికారి సౌజన్య, మెంబర్లు కుమార్‌గౌడ్, అనంతయ్య, అకడమిక్ కోఆర్డినేటర్ బృందం డాక్టర్ సుదర్శన్, పాలికొండ మణికంఠ, బీఎస్పీ నేత బాలయ్య తదితరులు పాల్గొన్నారు.