సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 4: సంగారెడ్డి జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా, సజావుగా జరిగేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం ధాన్యం కొనుగోళ్లపై మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో వరి సాగు బాగా పెరిగిందన్నా రు. సుమారు 1.70 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశార న్నారు. 3.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉన్నట్టు అంచనా ఉన్నదన్నారు. ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నదని, అందుకనుగుణంగా జిల్లాలో 247 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఏ గ్రామానికి ఆగ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ఎత్తైన ప్రదేశంలో కేంద్రాలు ఉండేలా చూడాలన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా జరిగేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడా రైతులకు ఇబ్బందులు లేకుండా, అందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల పర్యవేక్షణకు నియోజకవర్గానికి ఒక సీనియర్ అధికారిని నియమించాలని కలెక్టర్‌కు సూచించారు. ఎమ్మెల్యేలు, ప్యాక్స్ చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. నిర్ణీత తేమ శాతం మేరకు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చేలా చూడాలన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో అన్నీ సమకూర్చాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, తేమ యంత్రాలు, టార్ఫాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, అవసరమైనవన్నీ అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,060 మద్దతు ధర ఉన్నదన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు తరలించిన ధాన్యాన్ని మిల్లర్లు వెంటనే దించుకోవాలని, కేంద్రాల్లో, మిల్లుల్లో అవసరం మేర కూలీలను ఏర్పాటు చేసుకుని లోడింగ్, అన్ లోడింగ్ పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి జిల్లాలోకి ధాన్యం రాకుండా నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలన్నింటిపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని మంత్రి సూచించారు. అదనపు కలెక్టర్, ఆర్డీవోలు, డీఆర్డీవో, డీసీవో పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, కలెక్టర్ శరత్, రాష్ట్ర హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.