పటాన్చెరు, డిసెంబర్ 28: రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌లోని జియాగూడ మార్కెట్‌కు తీసుకెళ్తున్న 246 గొర్రెలు, మేకలను ఎత్తుకెళ్లిన ఘటన రెండు రోజుల క్రితం పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముత్తంగి ఓఆర్ఆర్ జాతీయ రహదారిపై జరిగింది. పటాన్చెరు సీఐ వేణుగోపాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 26న రాత్రి రాజస్థాన్ రాష్ట్రం నుంచి హైదరాబాద్‌లోని జియాగూడ మార్కెట్‌కు 246 గొర్రెలు, మేకలు తీసుకొస్తున్న వాహనాన్ని పోలీసులమని చెప్పి దుండగులు ఆపారు.
లోడ్‌ను తీసుకొస్తున్న డ్రైవర్ ఆయూబ్‌ఖాన్‌ను, మరో వ్యక్తిని చితకొట్టారు. వారిని భయబ్రాంతులకు గురిచేశారు. విచారణ చేయాలని చెప్పి గొర్రెలు, మేకలను రెండు డీసీఎంలు, ఒక టెంపోలో నింపుకొన్నారు. ఉదయం విచారణ చేసి, పంపిస్తామని చెప్పి ముత్తంగి ఓఆర్ఆర్ నుంచి మాయమైపోయారు. ఈ ఘటనపై డ్రైవర్ ఆయూబ్, మరో వ్యక్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.