సంగారెడ్డి ఆగస్టు 19(నమస్తే తెలంగాణ): పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కరెంటు కోతలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయానికి 6 గంటలు కూడా సక్రమంగా విద్యుత్ సరఫరా చేయకపోవడంతో రైతులు కరెంటు కోసం రోడ్డెక్కుతున్నారు. అలాగే కరెంటు కోతలతో గృహ వినియోగదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ వల్లే నిరంతర విద్యుత్ సరఫరా అవుతుందని రైతులు, కార్మికులు, కుటీర పరిశ్రమల యజమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందుతున్న నాయీబ్రాహ్మణులు, రజకులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సీఎం కేసీఆర్ వల్లే తాము ఉపాధి పొందుతున్నట్లు చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 7,45,710 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతిరోజూ 12 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతుంది. ఇందులో గృహ అవసరాలకు ప్రతిరోజూ 2.5 మిలియన్ యూనిట్లు, వ్యవసాయానికి 5 మిలియన్ యూనిట్లు, పరిశ్రమలకు 4.5 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉపయోగిస్తున్నారు.
మెరుగైన విద్యుత్ కోసం రూ.1065 కోట్లు ఖర్చు
గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన విద్యుత్ రంగాన్ని సీఎం కేసీఆర్ ప్రగతిబాట పట్టించారు. విద్యుత్ రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టి విద్యుత్ సమస్యలను తొలగించారు. సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ ఆవిర్భావం తర్వాత రూ.1065.77 కోట్లు విద్యుత్ సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేశారు. రూ.73.38 కోట్లతో జిల్లాలో 15 కొత్త 220కేవీ, 132 కేవీ సబ్స్టేషన్లను నిర్మించారు. రూ.992.39 కోట్ల వ్యయంతో 33 కేవీ, 11 కేవీ సబ్స్టేషన్లు, ఎల్టీలైన్లు, పవర్ట్రాన్స్ఫార్మర్లు, డ్రిస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. దీంతో సంగారెడ్డి జిల్లాలో విద్యుత్ సరఫరా వ్యవస్థ మెరుగై వినియోగదారులకు నిరంత విద్యుత్ సరఫరా అవుతున్నది. సీఎం కేసీఆర్ వల్లే సంగారెడ్డి జిల్లాలో ప్రజలకు కరెంటు కష్టాలు తీరాయి.
వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్..
పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కరెంటు కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పొరుగునే ఉన్న బీదర్ ప్రాంతంలో వ్యవసాయానికి 12గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆరుగంటలు కూడా విద్యుత్ రావటం లేదని రైతులు వాపోతున్నారు. సంగారెడ్డి జిల్లాలో వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ సరఫరా అవుతుంది. నిరంతర విద్యుత్ సరఫరాతో రైతులు సంతోషంగా ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలో 1,01,707 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నది. కర్ణాటక తరహాలో కరెంటు కోతలు లేకపోవడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. ఉచిత విద్యుత్ సరఫరాతో జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలో 5 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా ప్రస్తుతం జిల్లాలో 7.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతున్నాయి. ప్రభుత్వం వ్యవసాయానికి ప్రతిరోజూ 5 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నది. ఉచిత విద్యుత్ సరఫరా కోసం ప్రభుత్వం ఏటా రూ.1438 కోట్లు ఖర్చు చేస్తున్నది.
Cm Kcr
గృహ అవసరాలకు నిరంతరం…
గత ప్రభుత్వాల హయాంలో సంగారెడ్డి జిల్లాలో విద్యుత్ కోతలతో గృహ వినియోగదారులు ఇబ్బందులు పడేవారు. సీఎం కేసీఆర్ వచ్చాక కరెంటు కోతలను అటకెక్కించారు. గృహాలకు ప్రభుత్వం 24గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నది. తొమ్మిదేండ్లలో విద్యుత్ కోతలు లేకుండా గృహ విద్యుత్ వినియోగదారులు సంతోషంగా ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలో 5,63,844 మంది గృహ విద్యుత్ వినియోగదారులు, 69,459 మంది కమర్షియల్ వినియోగదారులు ఉన్నారు. గృహ, కమర్షియల్ విద్యుత్ వినియోగదారులు ప్రతిరోజూ 2.5 మిలియన్ యూనిట్లు విద్యుత్ వాడుతున్నారు. నిరంత విద్యుత్ సరఫరా కోసం ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలో పెద్ద సంఖ్యలో సబ్స్టేషన్లు నిర్మించటంతోపాటు అదనపు ట్రాన్స్ఫార్మర్లు వందల సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నది. జిల్లాలో మారుమూల తండాలకు సైతం పూర్తిగా విద్యుత్ కనెక్షన్లను ప్రభుత్వం అందజేసింది. ఎస్టీలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నది. అలాగే ఎస్టీలకు 101 యూనిట్ల వరకు విద్యుత్‌ను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్నది. ఇదిలాఉంటే సంగారెడ్డి జిల్లాలోని 2200 మంది నాయీబ్రాహ్మణుల క్షౌరశాలలు(సెలూన్లు), 921 రజకుల ఇస్త్రీ దుకాణాలకు ప్రతినెలా 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం అందజేస్తున్నది.
పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా
సంగారెడ్డి జిల్లాలోని 7,297 పరిశ్రమలకు ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నది. ఫలితంగా జిల్లాలోని భారీ, మధ్యతరగతి పరిశ్రమలతోపాటు కుటీర పరిశ్రమల్లోని కార్మికులు మూడు షిఫ్టులు పనిచేస్తున్నారు. జిల్లాలోని ఔషధ కంపెనీలు, బల్క్‌డ్రగ్ ఇతర కంపెనీలు మూడు షిఫ్టులు పనిచేస్తున్నాయి. దీంతో సంగారెడ్డి జిల్లాకు చెందిన కార్మికులతోపాటు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ర్టాలకు నుంచి వచ్చి కార్మికులు మూడు షిఫ్టులు పనిచేస్తూ సంతోషంగా ఉన్నారు.
24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా ..
దేశంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. ఉమ్మడి పాలనలో లోఓల్టేజీ, కోతలు, పవర్ హాలిడేస్‌తో ప్రజలు, రైతులు అనేక కష్టాలు పడ్డారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణలతో వ్యవసాయానికే కాకుండా అన్ని రంగాలకూ నిరంతరంగా కరెంట్ సరఫరా అవుతున్నది. తెలంగాణ సరిహద్దు కర్ణాటక ప్రాంతంలో కరెంట్ కష్టాలతో ప్రజలు, రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఉమ్మడి పాలనలో తెలంగాణ రైతులు పడిన ఇబ్బందులు ఇప్పుడు అక్కడి రైతులకు ఎదురవుతున్నాయి. రైతుల సంక్షేమ కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలతో అన్ని విధాలుగా ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని కర్ణాటక ప్రాంతంలోని రైతులు కోరుకుంటున్నారు.
– సిద్దారెడ్డి, రైతు, మల్గి గ్రామం (న్యాల్కల్ మండలం)
కర్ణాటకలో పంటలకు ఆరు గంటలే..
మా పక్క ఉన్న కర్ణాటకలో వ్యవసాయానికి ఆరు గంటల కరెంటు వస్తున్నది. అది కూడా సక్రమంగా రాదు. ఆ ఆరు గంటల్లో లోడ్ ఎక్కువ అయితే మధ్యమధ్యలో కరెంటు పోతున్నది. దీంతో చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నరు. వ్యవసాయానికే కాదు. రాత్రుల్లో వాళ్ల ఇండ్ల వద్ద లైట్లు వేసేందుకు సింగల్ ఫేజ్ కూడా సరిగా ఉండడం లేదు. సీఎం కేసీఆర్ కృషి వల్ల తెలంగాణలో మాత్రమే 24గంటల కరెంటు ఉంటున్నది. రైతులతోపాటు ప్రతిఒక్కరూ సంతోషంగా ఉన్నరు.
– తుక్కప్ప రైతు, గొటిగార్‌పల్లి, కోహీర్ మండలం
విద్యుత్ కోతలు లేనేలేవు..
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ విద్యుత్ కోతలు లేకుండా చేశారు. ఇండ్లకు, వ్యవసాయానికి, పరిశ్రమలకు కోతలు లేకుండా విద్యు త్ సరఫరా అవుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. దేశంలో ఏ రాష్ట్రంలో 24గంటల విద్యుత్ సరఫరా జరగడం లేదు. పరిశ్రమలు మూడు షిఫ్టులు నడుస్తున్నాయంటే కారణం సీఎం కేసీఆర్ సారే. అందికే ఆయనని మళ్లీ గెలిపించాలి.
– ఎల్ రాజశేఖర్‌రెడ్డి, రైతు, జిన్నారం
కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలే..
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు తప్పవు. కాంగ్రెస్ హయాంలో రోజుకు 10 గంటలు కరెంట్ కోతలు ఉండేవి. కరెంట్ సమస్య లతో ప్రజలు చాలా ఇబ్బం దులు పడ్డారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే కరెంట్ సమస్యను పరిష్కరించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే. పవర్ హాలిడేలు లేవు. జనరేట ర్లు లేవు. 24 గంటలు కరెంట్ వస్తుంది. వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తాం.
– ఆగుల్ల రవికుమార్, స్టీల్ షాప్ యజమాని, ఆర్సీపురం