వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అవసరం లేదు.. రైతులంతా 10 హెచ్‌పీ మోటర్లు వాడాలంటూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై రైతాంగం భగ్గుమంటున్నది. స్వరాష్టంలో, సీఎం కేసీఆర్ నాయకత్వంలో 24 గంటల కరెంట్ సరఫరాను చూసి ఓర్వలేక ఇష్టమొచ్చినట్లు ప్రకటనలు చేస్తున్నారని మండి పడుతున్నది. కుట్రల కాంగ్రెస్‌కు ముకుతాడు వేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో బాధలు పెట్టిన కాంగ్రెస్ తమకు వద్దని, బీఆర్ఎస్ పార్టీకే తమ మద్దతు అని తేల్చి చెబుతున్నది.భూసమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో భూములకు సంబంధించిన కొట్లాటలు, కేసులకు చెక్ పడింది. ఎవరి భూమి వారి పేరుపై నిక్షిప్తమై ఉండడంతో రైతులంతా భరోసాతో ఉన్నారు. అలాంటి పారదర్శక పోర్టల్‌ను తాము అధికారంలోకి వస్తే దానిని రద్దు చేసి భూమాత పోర్టల్ తీసుకొచ్చి మళ్లీ పాత పద్ధతే అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సిద్దిపేట టౌన్, నవంబర్ 23: వ్యవసాయ బాయి మోటర్లు మోకానిక్‌గా గత 40 ఏండ్ల నుంచి పనిచేస్తున్నా. గతంలో కాంగ్రెస్ పాలన చూశా.. రైతుల కష్టాలను ఎవరూ పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వ్యవసాయం పండుగలా మారింది. కాంగ్రెస్ 50 ఏండ్లలో రైతన్నలు నిద్రలేని రాత్రులు గడిపారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. పోతుందో తెలియని పరిస్థితులు. కరెంట్ వచ్చినా లోవోల్టేజీ సమస్యతో బాయి మోటర్లు కాలిపోతుండేవి. రైతుల గోస చూసి రాత్రి సమయంలో కూడా మోటర్లను రిపేరు చేసేవాళ్లం. తెలంగాణలో ప్రస్తుతం రైతులు అందరు 5 హెచ్‌పీ మోటర్లనే వినియోగిస్తున్నారు. కొంతమంది రైతులు 7 హెచ్‌పీ వాడుతున్నారు. కాంగ్రెసోళ్లు వ్యవసాయంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ సరిపోతుందని చెప్పడం సరికాదు. మూడు గంటల కరెంట్‌కు 10 హెచ్‌పీ మోటరు బిగించుకున్నా దండుగే.. ట్రాన్స్ఫార్మపై భారం పడి పేలిపోతాయి. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత నాణ్యమైన విద్యుత్‌ను 24 గంటలు సరఫరా చేయిస్తున్నారు. లోవోల్టేజీ సమస్యకు చెక్ పడింది.
సిద్దిపేట అర్బన్, నవంబర్ 23: రైతును రాజు చేసిన సీఎం కేసీఆర్ మనకు అండగా ఉన్నాడు. వేరే పార్టీల మాటలు నమ్మొద్దు. రైతు కష్టాలు తెలిసిన కేసీఆర్ మాత్రమే రైతులకు సాయం చేస్తాడు. కాంగ్రెస్‌ను నమ్మితే మళ్లీ దళారీ రాజ్యమే వస్తుంది. రైతులకు మూడు గంటలు మాత్రమే విద్యుత్ ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్ నేతలను నమ్మితే రైతులను నట్టేట ముంచుతారు. ఎవుసం చేసే వాడికి ఎన్ని గంటలు కరెంట్ కావాలి.. ఎన్ని హెచ్‌పీల మోటర్ కావాలి అని తెలుస్తది. ఎవుసం తెలియని రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ వాళ్లకు రైతుల బాధలు తెలియవు. రైతుబంధు రాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు వేస్తే అడ్డు రాని.. ఎన్నికల కోడ్ రైతుబంధుకు మాత్రమే ఎందుకు. రైతులు బీఆర్ఎస్కు దూరం చేయాలని కుట్రలో భాగమే రైతుబంధును ఆపడం. ఏ రైతన్నా 10 హెచ్‌పీ మోటర్ పెట్టుకుంటారా.. అది రేవంత్‌రెడ్డి అజ్ఞానం. ఆయనకు ఏమన్నా ఎవుసం తెలుసా. రైతులు కాంగ్రెస్ కుట్రలను అడ్డుకోవాలి.
కాంగ్రెస్ హయాంలో ఎక్కువగా మోటర్లు కాలిపోతుండే. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ రైతాంగానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయిస్తున్నారు. దీంతో మోటర్లు కాలిపోవడం తగ్గింది. అప్పట్లో లోవోల్టేజీ విద్యుత్ వల్ల బోరుబావుల్లో నీరు అడుగంటి మోటర్లు పాడయ్యేవి.24గంటల విద్యుత్‌తో రైతులంతా సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారు.10హెచ్‌పీ మోటర్లు వాడాల్సిన అవసరం లేదు. నేను చాలామంది బోరుబావుల్లో మోటర్లు దించాను. కానీ ఎక్కడ కూడా 10హెచ్‌పీ మోటర్లు వాడలేదు. 10హెచ్‌పీ మోటర్ల వల్ల చాలా కష్టమయితది. ఎక్కువగా కాలిపోతుంటాయి. సమస్యలు ఎక్కువ. ఈ ప్రాంతంలోని బోరుబావుల్లో నీళ్లు ఎక్కువగా ఉండడం వల్ల తక్కువ హెచ్‌పీ మోటర్లు సరిపోతున్నాయి. -మహేందర్, మోటర్ మెకానిక్, గజ్వేల్ అర్బన్
కాంగ్రెస్ పాలనలో సక్రమంగా విద్యుత్ సరఫరా లేక మోటర్లు కాలిపోయేవి. ఎక్కువ శాతం డబ్బులు మోటర్ల మరమ్మతులకే ఖర్చుచేసేది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ సబ్స్టేషన్లు ఎక్కువ ఏర్పాటు చేసి 24 గంటలు కరెంట్ ఇస్తుర్రు. ఇప్పుడ మోటర్లు ఎక్కువ కాలడం లేదు. అప్పటి ఖర్చులు కూడా తగ్గాయి. ఎవుసం గురించి తెలిసినోళ్లు పాలిస్తే రైతులకు ఢోకాఉండదు కానీ ఎవుసం తెల్వనోళ్లకు రాజ్యం అప్పగిస్తే మళ్లీ కష్టాలు వస్తాయి. అప్పుడు 24 గంటల కరెంట్ ఇవ్వమని ధర్నాలు, రాస్తారోకోలు చేశాం. అయినా రైతులను అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఎవుసం తెలిసిన సీఎం కేసీఆర్ సారు రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాడు. -మాడుపు బాపురెడ్డి, రైతు, లక్ష్మీపూర్, బెజ్జంకి
కాంగ్రెస్ వాళ్లు ఎప్పుడు ఏం మాట్లాడుతారో వాళ్లకు కూడా అర్థం కాదు. ఎవడన్నా 10 హెచ్‌పీ మోటరు పెట్టి ఎవుసం చేస్తడా.. ఎప్పడన్నా ఎవుసం చేసిన మొఖమైతే తెలుస్తది. ఎన్ని హెచ్‌పీల మోటర్లు వాడుతరని. నాకు కూడా రెండు ఎకరాల పొలం ఉంది. కానీ ఏ రైతు కూడా 10 హెచ్‌పీ మోటరు వాడరు. వాళ్లు ఓట్ల కోసం ఏదైనా చెప్తరు. వీళ్లు ఇట్లా మాట్లాడుతుండ్రంటే ఖచ్చితంగా అధికారంలోకి వస్తే మూడు గంటలు కరెంట్ మాత్రమే ఇస్తరు ఇది పక్కా. వీళ్లను గెలిపిస్తే నిండా మునుగుడే. ఇంత మంచి గవర్నమెంట్‌ను వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయం.
– లెంకల రాములు, రైతు, పొన్నాల, సిద్దిపేట అర్బన్ మండలం
కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడు కరెంట్ వస్తదో ఎప్పుడు పోతదో తెల్వక ఎన్నో గోసలు పడ్డం. ఏనాడు కంటి నిండా నిద్ర కూడా పోలేదు. కరెంట్ కోసం రాత్రంతా జాగారం చేసేటోళ్లం. ఎంతో మంది రైతులు విద్యుత్‌షాక్‌తో ప్రాణాలు వదిలిండ్రు. ఇప్పుడు రాత్రి పూట బాయిలకాడికి వెళ్లే బాధలు లేవు. 24గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం వల్ల ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు మోటర్లు ఆన్‌చేసి పంటలకు నీరు అందిస్తున్నాం. మూడు గంటల కరెంట్‌తో కష్టాలు మాకొద్దు కాంగ్రెసోడి పాలన మాకొద్దు.
– సొప్పరి సాయిలు, రైతు, మాచాన్పల్లి
సిద్దిపేట కమాన్, నవంబర్ 23: కాంగ్రెసోళ్ల మాటలు ఇటుంటే.. రైతులకు తలమీద మోయలేని భారం పెట్టాలని చూస్తునట్టుంది. 10 హెచ్‌పీ మోటరు వాడాలని చెప్తున్నరు. అది సాధ్యమైతదా.. కాదా కూడా తెల్వదు వాళ్లకు.. ఇక్కడ అంతా 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ, ఆఖరుకు 7 హెచ్‌పీ వాడుతారు. 10 హెచ్‌పీ అంటే దానికి సఫరేట్ కేబుల్, పైపులు, స్టార్టర్లు ఇలా బిగించుకోవాల్సి ఉంటది. 80 వేల నుంచి లక్ష వరకు ఖర్చుచేసి మోటరు కొనాల్సి ఉంటుంది. ఒక్కో సారి ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ పడితే మోటరు లేదా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతది. మరమ్మతులకు కూడా ఖర్చు ఎక్కువే. రైతులంతా ఇప్పుడున్న మోటర్లతోనే సంతోషంగా ఎవుసం చేసుకుంటున్నారు. 24 గంటలు కరెంట్ వస్తుండడంతో వరి పంట, కూరగాయ పంటలు సాగు చేసుకుంటున్నారు. నడుస్తున్న మోటర్లు తీసేసి 10 హెచ్‌పీ మోటార్లు పెట్టాలని చెప్పడం చూస్తుంటే.. అప్పట్లో (గత కాంగ్రెస్ పాలనలో) రైతులు పడ్డ
కష్టాలను మళ్లీ తేవాలని చూస్తుంది. ఏండ్లుగా మోటరు మెకానిక్‌గా పని చేస్తున్నా. ఎవరూ 10 హెచ్‌పీ మోటర్లు వాడనే వాడరు. నా దగ్గరకు మరమ్మత్తులకు వచ్చేవన్నీ 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ వస్తాయి. కాంగ్రెసోళ్లు చెప్పే మాటలను ఎవరూ నమ్మరు. సాఫీగా సాగుతున్న వ్యవసాయాన్ని రైతులు ఆగం చేసుకోరు.
– బుచ్చి బాబు, మోటారు మెకానిక్, సిద్దిపేట
కాంగ్రెసోళ్లు వస్తే మళ్లీ పటేల్, పట్వారీ వ్యవస్థ తెస్తామంటున్నారు. వీఆర్వోలు మళ్లీ వస్తే రైతులకు కష్టాలు మొదలైనట్లే. గతంలో వీఆర్వోల దగ్గరికి పోతే భూ రికార్డుల కోసం ముప్పు తిప్పలు పెట్టి ఇబ్బందులకు గురి చేశారు. నేడు బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ రైతులకు ఎంతో మేలు చేస్తుంది. రికార్డులన్నీ ఆన్లైన్లో భద్రంగా ఉంటున్నాయి. రైతులే స్వయంగా తహసీల్ కార్యాలయానికి వెళ్లి వేలుముద్ర వేస్తే తప్పా వేరే వారి పేరిట భూమి మారడం సాధ్యం కాదు. ఇంతటి పకడ్బందీ వ్యవస్థను తెచ్చిన సీఎం కేసీఆర్‌ను కాదని మళ్లీ కాంగ్రెసోళ్లను అధికారం అప్పగిస్తే కష్టాలు తప్పవు.
– కట్కూరి రామచంద్రం, రైతు, దుబ్బాక
ధరణి ఉంటేనే భూములకు రక్షణ ఉంటుంది. ధరణి రావడం రైతులకు చాలా సంతోషం. ధరణి లేనప్పుడు పట్వారీలు వాళ్ల ఇష్టం వచ్చిన లెక్క ఒకరి భూమిని మరో వ్యక్తిమీద ఎక్కించారు. అప్పుడు లంచాలు ఇస్తేనే పనులు చేసేవారు. ఒకలకు భూమని ఎక్కించాలంటే ఇబ్బందులు అయ్యేది. మా భూమి వివరాలు కనిపించడం లేదని పట్వారీలను అడిగితే పైసలు ఇస్తేనే పాసు బుక్కలో ఎక్కించేది. అది కూడా ఏండ్లు గడుపుతుండే. ధరణి వచ్చిన తర్వాత రైతులకు ఏమీ భయం లేదు. రైతులకు ఇప్పుడే ధరణి మంచిగా ఉంది. సీఎం కేసీఆర్ సారుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.
సిద్దిపేట టౌన్, నవంబర్ 23 : కాంగ్రెస్ అధికారం కోసం ఎంతకైనా తెగిస్తుంది. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ చిచ్చపెడుతుంది. రైతులను ఆగం చేసిన పటేల్ పట్వారీ వ్యవస్థకు బీఆర్ఎస్ ముగింపు పలికింది. ఇప్పుడు మళ్లీ అధికారం కోసం కాంగ్రెస్ తిరిగి పటేల్ పట్వారీ వ్యవస్థను తెచ్చి రైతులను నిండా ముంచాలను చూస్తుంది. పట్వారీ వ్యవస్థలో రైతులు గోస పడ్డారు. అధికారులు, సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారు. వీఆర్వోలకు, ఆర్ఐలకు లంచం ఇస్తే పహాణీ, రికార్డుల్లో పేర్లను సులువుగా మర్చి పట్టాదారుడిని నిలువునా ముంచారు. అలాంటి వ్యవస్థను కాంగ్రెసోళ్లు తెస్తామంటున్నారు. రైతులారా తస్మాత్ జాగ్రత్త.. కాంగ్రెస్‌ను నమ్మొద్దు.. ధరణితో రైతుల కష్టాలన్నీ తీరాయి. పట్వారీ వ్యవస్థతో తెలంగాణ 50 ఏండ్లు వెనక్కి వెళ్లడం ఖాయం.
– రాజలింగారెడ్డి, రైతు, సిద్దిపేట
ధరణి వచ్చిన తర్వాత రైతులకు మేలు జరిగింది. భూముల పంచాయితీలు ఎక్కడా కనిపించడం లేదు. ఇంతకు ముందు భూముల లెక్కలు రాసే సార్లు ఒకరి భూములు మరోవ్యక్తిమీద రాసి ఆగం చేసేటోళ్లు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. భూమి అమ్మగానే కొనుక్కున్న వాళ్ల పేరు మీదకి వెంటనే ఎక్కిస్తున్నారు. అప్పటికప్పుడు పాసుబుక్‌లో సర్వేనంబర్‌తో సహా రాసి ఇస్తున్నారు. ఇంత మంచి ధరణితో రైతులకు మేలు కలుగుతుంది. – ల్యాగల మోహన్‌రెడ్డి,
రాంపల్లి, కొండపాక మండలం
గతంలో భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సబ్ రిజిష్ర్టార్ కార్యాలయంలో రోజంతా జరిగేది. ఇప్పుడు 15 నిమిషాల్లో జరుగుతుంది. చాలా సంతోషగా ఉంది. సీఎం కేసీఆర్ సారు సులువుగా తహసీల్ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్‌తో పాటు మ్యుటేషన్ చేయిస్తుండడంతో రైతులకు కష్టాలు తప్పాయి. గతంలో భూములు కొనేది ఒకేత్తు అయితే పట్టా చేయించుకునుడు మరోఎత్తులా ఉండేది. దీంతో ఏండ్లకు, ఏండ్లు కార్యాలయాల చుట్టూ తిరిగేది. పట్టాలు కాకుండానే చనిపోయిన రైతులు కూడా ఉన్నారు. కానీ, ఇప్పుడు ఆ బాధ తప్పింది. ధరణి సేవల ద్వారా రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. ధరణి విషయంలో సీఎం కేసీఆర్ రైతేరాజు అనేలా చేశాడు. గతంలో భూముల రిజిస్ట్రేషన్ అంటే అధికారులు చుట్టూ తిరిగేది. ఇప్పుడు రైతు కోరిన రోజు అధికారులు అందుబాటులో ఉండి అప్పడికప్పుడు పారదర్శకంగా, ఎలాంటి పైరవీలు లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ధరణిని తీసేస్తే మళ్లీ పైరవీలతో రైతుల బతుకులు ఆగం అవుతాయి. ఎనకటి రోజులను తీసుకువచ్చేటట్లు కాంగ్రెస్ తీరు కనపడుతుంది. యాభై ఏండ్లు పాలించిన కాంగ్రెసోళ్లు ఎప్పుడైనా రైతుల బతకుదెరువు గురించి ఆలోచన చేయలేదు. ధరణి సేవలతో భూముల సమస్యలు పరిష్కారమయ్యాయి. ఇప్పుడు మంచిగా బతుకుతున్న రైతులను ఆగం చేసి, భూముల తగాదాలు మళ్లీ షురూ చేసేందుకు ప్రయత్నిస్తోంది. రైతులను ఆగం చేసేందుకు కాంగ్రెస్ కంకణం కట్టుకున్నట్లు ఉంది.
– జీల శ్రీనివాస్, రైతు, అక్కన్నపేట
బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి తెచ్చిన తర్వాతనే భూములకు రక్షణ కలిగింది. రైతు భూముల రక్షణకు ధరణి పోర్టల్ వజ్రాయుధం లాంటిది.గతంలో భూములకు రక్షణ లేకుండా ఉండేది. ధరణి ఎత్తివేస్తే రైతుల భూములకు రక్షణ ఉండదు. ధరణి తీసేస్తామంటున్నారంటే పైరవీకారుల రాజ్యం తీసుకువస్తామని చెప్పడమే. మా కుటుంబం హైదరాబాద్‌లో జీవనం సాగించేది. మా భూములు నా పేరిట చేయించుకునేందుకు 2007లోనే రోజుల తరబడి తిరగడమే కాకుండా రెవెన్యూ సిబ్బందికి రూ.3వేలు లంచం ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు భూమి కొనుగోలు చేసి వారు గంటలోనే రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు.ధరణి తీసేస్తే రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదు. ఇప్పటికే అన్నివర్గాలు ధరణిపై మంచి అభిప్రాయంతో ఉన్నాయి.
– జక్కుల నర్సింహులు,
రైతు సంఘం చైర్మన్, నాగపురి, చేర్యాల