సిద్దిపేట, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఈనెల 27న హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభకు సిద్దిపేట జిల్లా నుంచి దండులా కదిలి విజయవంతం చేద్దామని పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేటలోని తన క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. జనసమీకరణపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సిద్దిపేటకు 25 ఏండ్ల గులాబీ జెండా కీర్తి ఉందని, పార్టీ పెట్టి లక్ష్యాన్ని సాధించి, ఆ లక్ష్యంతో అద్భుతమైన అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిపిన పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు.
2001లో సిద్దిపేట కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆశీర్వాదం, జిల్లా ప్రజల ఆశీస్సులతో గులాబీజెండా ఎగరేసిండు మన కేసీఆర్ అని గుర్తుచేశారు. సిద్దిపేటకు అంత ఘనకీర్తి ఉందన్నారు. సిద్దిపేట వాళ్లులేని బహిరంగ సభ లేదని, ఎకడ సభ జరిగినా.. ఎకడ ఎన్నికలు జరిగినా ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు సిద్దిపేట నాయకులు పనిచేశారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమాల పురిటిగడ్డ సిద్దిపేట అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని కేసీఆర్ అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దారని హరీశ్‌రావు కొనియాడారు.
సిద్దిపేట నియోజకవర్గం నుంచి 20 వేల మందికి పైగా పార్టీ శ్రేణులు సభకు తరలివెళ్లాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు.మరో వెయ్యిమంది విద్యార్థులు, యువత పాదయాత్రగా తరలివెళ్తారని పేర్కొన్నారు. వంద ట్రాక్టర్లతో ర్యాలీగా సభకు బయలు దేరాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. భారీగా తరలివెళ్లి సిద్దిపేట కీర్తిని మరోసారి చాటాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకుడు, నంగునూరు మండలం ప్యాక్స్ చైర్మన్ మహిపాల్‌రెడ్డి వరంగల్ సభ ఖర్చులకు పార్టీకి తనవంతుగా రూ.25 వేల విరాళం ప్రకటించారని హరీశ్‌రావు చెప్పారు. మందపల్లి గ్రామస్తులు కూలి పనిచేసి తామే స్వచ్ఛందంగా సభకు వస్తామని ప్రకటించడంతో వారిని హరీశ్‌రావు అభినందించారు.
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 27న ప్రతి గ్రామంలో, మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో పార్టీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. 25 ఏండ్ల ఆవిర్భావ వేడుకలు ఒక పండుగలా నిర్వహించాలన్నారు. కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొని జెండా పండుగను విజయవంతం చేయాలని ఆయన సూచించారు.
2001లో పార్టీ ఆవిర్భావం సందర్భంగా జెండాను, కరీంనగర్ సింహగర్జన సభ సిద్దిపేట నాయకుల కరపత్రాలు, విద్యా, ఉద్యోగ సదస్సు రైతు నాగలి గుర్తుతో ఉన్న కరపత్రం, 2004లో హరీశ్‌రావు మంత్రిగా ఏడాదిలో చేసిన సిద్దిపేట అభివృద్ధిపై ముద్రించిన కరపత్రం, నాటి జ్ఞాపకాలు సిద్దిపేట నాయకులతో కలిసి నెమరు వేసుకున్నారు. సన్నాహక సమావేశంలో రాష్ట్ర నాయకులు వేలేటి రాధాకృష్ణశర్మ, కడవేర్గు రాజనర్సు, పార్టీ మండలాల అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.