సిద్దిపేట,డిసెంబర్12(నమస్తేతెలంగాణ ప్రతినిధి) : తొలి విడత ఎన్నికలు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయకేతనం ఎగురవేశారు.బీఆర్ఎస్ పార్టీ మరోసారి తన సత్తా చాటింది. సిద్దిపేట జిల్లాలో అత్యధిక సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది. పల్లె పోరులో గులాబీజెండా రెపరెపలాడింది. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ కలిసి పోటీచేశాయి. అధికార కాంగ్రెస్ పార్టీ వేధింపులు, డబ్బులు, అన్నిటిని తట్టుకొని బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు జోష్‌లో ఉన్నారు. రెండో, మూడో విడతలో కూడా అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటామని గులాబీపార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తొలి విడతలో సిద్దిపేట జిల్లాలో 163 గ్రామ పంచాయతీలకు 16 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 147 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో బీఆర్ఎస్ బలపరిచిన 84 మంది అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. మెదక్ జిల్లాలో 160 గ్రామ పంచాయతీ ఎన్నికలకు, 16 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో 144 గ్రామాల్లో పోలింగ్ జరిగింది. మొత్తంగా ఇక్కడ 50 గ్రామాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్‌లుగా విజయం సాధించారు. సంగారెడ్డి జిల్లాలో 136 సర్పంచ్ స్థానాలకు 7 చోట్ల ఏకగ్రీవం కాగా, 129 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఈ జిల్లాలో 48 మంది బీఆర్ఎస్ సర్పంచ్‌లుగా గెలుపొందారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తంగా 182 గ్రామాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడంపై ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. కష్టకాలంలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచారని పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంలో కారు దుమ్ము లేపింది. అత్యధిక స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకొని అధికార పార్టీ ఎత్తులను చిత్తుచేసింది. గజ్వేల్ నియోజకవర్గంలో కారు జోరు ఏమాత్రం తగ్గలేదని రుజువైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలుపొంది సత్తాచాటారు. గజ్వేల్ నియోజకవర్గంలో 107 స్థానాలకు గురువారం ఎన్నికలు జరగగా, బీఆర్ఎస్ పార్టీ 55, కాంగ్రెస్ 42, బీజేపీ 04, ఇతరులు 6 స్థానాల్లో గెలిచారు. ఎన్నికల్లో గ్రామాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని తట్టుకోలేక చాలా గ్రామాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉమ్మడిగా పోటీచేశాయి.పార్టీ తరపున బరిలో నిలిచిన అభ్యర్థులు అధికార పార్టీ వేధింపులు ఎదుర్కున్నారు.
అధికార కాంగ్రెస్ కుట్రలను ఛేదించారు. గజ్వేల్ నియోజకవర్గాన్ని కేసీఆర్ అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి దేశానికి ఆదర్శంగా నిలిపారు. ఆ అభివృద్ధి పనులే బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు దోహద పడ్డాయి.అత్యధిక సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో గజ్వేల్ నియోజకవర్గంలోని గులాబీశ్రేణులు సంతోషంలో ఉన్నారు.గజ్వేల్ నియోజకవర్గంతో పాటు దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లోతొలివిడతఎన్నికలుజరిగాయి. అన్నింటా బీఆర్ఎస్ తన హవాను కొనసాగించింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలాచోట్ల కాంగ్రెస్, బీజేపీ కలిసి పోటీ చేశాయి. లోపాయికారి ఒప్పందం చేసుకొని ఒకరి ఒకరు సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకున్నారు. చాల గ్రామాల్లో బీజేపీ క్యాడర్ అంతా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపునకు కృషిచేశాయి.బీఆర్ఎస్ను ఓడించాలనే లక్ష్యంతో కొన్ని నెలలుగా జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ కలిసి పని చేస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ఆవిషయంతేటతెల్లమైంది.తొలివిడతజరిగినఎన్నికల ఫలితాలను చూస్తే బీజేపీ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి సహకరించిందోఅర్ధంఅవుతున్నది. మెదక్ జిల్లాలో కనీసం ఒక్క సర్పంచ్ కూడా గెలువలేక పోయారు. ఇక్కడ పూర్తిగా కాంగ్రెస్ అభ్యర్థులకు బీజేపీ క్యాడర్ పని చేసింది. సంగారెడ్డి జిల్లాలో కూడా అంతంత మాత్రమే గెలుచుకుంది. సిద్దిపేట జిల్లాలో కూడా అంతంత మాత్రమే ..మొత్తంగా రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలన్న లక్ష్యానికి పల్లె ప్రజలు కాంగ్రెస్, బీజేపీ గట్టి షాక్ ఇచ్చారు.
తొలి విడత జరిగిన జీపీ ఎన్నికల్లో చాలా గ్రామాల్లో బీఆర్ఎస్కు చెందిన వారే మూడు నుంచి నలుగురు అభ్యర్థులు ఒకే గ్రామంలో నిలబడడంతో పార్టీకి సీట్లు తగ్గాయి. ఒకే పార్టీకి చెందిన ముగ్గురు ఓట్లు చీల్చడంతో కాంగ్రెస్, బీజేపీలకు కలిసి వచ్చింది. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో మెజార్టీ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే అత్యధికంగా నిలబడ్డారు. దీంతో ఓట్లు చీలిపోయాయి. మెదక్ జిల్లాలోని పలు గ్రామాలు, సంగారెడ్డి జిల్లాలోనూ ఇదే పరిస్థితి అని చెప్పాలి. పార్టీ కోసం కష్ట పడ్డాం, తాము ఎన్నికల్లో నిలబడి గ్రామ సర్పంచ్‌లు ఎన్నికమవుతామని ఎవరికి వారు పోటీలో నిలవడంతో మె జార్టీ గ్రామాలు బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. గ్రామానికి ఒక్కరే నిలబడి ఉంటే ఉ మ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీలు చిత్తు చిత్తు అయ్యేవి.