సిటీబ్యూరో, జనవరి 1 (నమస్తే తెలంగాణ): హైదరాబా ద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకొని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప్రత్యేక చర్యలు చేపట్టింది. క్షత గాత్రులకు క్షణాల్లో వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ట్రామా కేర్సెంటర్లు ఎంతో మెరుగైన సేవలు అందిస్తున్నాయి. ఓఆర్ఆర్పై ప్రతి రోజూ సుమారు 1.30 లక్షలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. 2016 వరకు ఓఆర్ఆర్ ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉంటే గడిచిన 5-6 ఏండ్లుగా ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి.
2016లో 110 మరణాలు నమోదుగా 2021లో మాత్రం 50లోపు నమోదు కాగా, 2022లో 38, ఏడాది మొత్తంలో 1098 ప్రమాద సంఘటనలు జరగడంతో వెంటనే అంబులెన్స్‌లు ఓఆర్ఆర్పైకి చేరుకొని అత్యవసర చికిత్స అందించాయి. దీని ఫలితంగానే ఓఆర్ఆర్ ప్రమాదాలు జరుగుతున్నా, గోల్డెన్ అవర్‌లో అత్యవసర వైద్య చికిత్సను అందించడం వల్ల మృతుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ అధికారులు తెలిపారు. ఓఆర్ఆర్ ప్రారంభమైన మొదట్లో ఓఆర్ఆర్పై వాహనాల వేగం గంటకు 120 కి.మీ ఉండగా, ప్రస్తుతం గంటకు మొదటి రెండు వరుసల్లో 100 కి.మీ, తర్వాత రెండు వరుసల్లో 80 కి.మీ వేగంతో వెళ్లేలా చేశారు. అదేవిధంగా పోలీసులతో కలిసి వేగ నియంత్రణ కోసం స్పీడ్ గన్లను ఏర్పాటు చేశారు. దీంతో ప్రమాదాలు తగ్గుముఖం పడుతున్నాయి.
ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడేందుకు ట్రామాకేర్ సెంటర్లు
ఔటర్ రింగు రోడ్డుపై ట్రాఫిక్ గణనీయంగా పెరిగింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా 24 గంటల పాటు వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. దీంతో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఓఆర్ఆర్ చుట్టూ మొత్తం 19 ఇంటర్‌చేంజ్‌లు ఉండగా, 16 చోట్ల ట్రామ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రమాద సమయంలో అత్యవసర వైద్య సేవలను అందిస్తున్నారు. మొత్తం 16 ట్రామాకేర్ సెంటర్లతో పాటు 10 అంబులెన్స్‌లు (అడ్వాన్డ్ లైఫ్ ససోర్టు) ఓఆర్ఆర్ మీదే అందుబాటులో ఉండి, ప్రమాదం జరిగిందని సమాచారం వచ్చిన 5-10 నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించేలా అంబులెన్స్‌లోనే అత్యాధునిక వైద్య సేవలను అందిస్తున్నామని తెలిపారు. వైద్య సేవలను అందించడంలో అపోలో, యశోద దవాఖానలు సహకారం అందిస్తున్నాయి. ట్రామా కేర్ సెంటర్లో పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారని, అత్యవసరమైతే టెలీ మెడిసిన్ సదుపాయం ఉందని తెలిపారు.