రామాయంపేట, ఫిబ్రవరి 5: ప్రతి గ్రామంలో వైకుంఠధామాన్ని నిర్మించాలని భావించిన సీఎం కేసీఆర్ ఆ దిశగా ఆలోచనలు చేశారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద వైకుంఠ ధామాలు నిర్మించారు. దీంతో ఈజీఎస్‌లో భాగంగా మొదట ఒక్కో శ్మశాన వాటికకు రూ.10 లక్షలు కేటాయించారు. అవి సరిపోకపోవడంతో మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం రూ.12.50 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తున్నది. దీంతో ప్రతి మారుమూల తండాలు, గ్రామాలు, పల్లెల్లో వైకుంఠధామాలు నిర్మిస్తున్నారు.
ఈజీఎస్ నిధులతో నిర్మాణం
ఈజీఎస్ నిధుల ద్వారా రామాయంపేట మండలంలో దామరచెర్వు, కాట్రియాల, అక్కన్నపేట, పర్వతాపూర్ గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణాలను రూ.10 లక్షలతోనే పూర్తిచేశారు. మిగతా 11 పంచాయతీల్లో రూ.12.50 లక్షలతో గ్రామాల్లోని వైకుంఠధామాలు నిర్మించారు. మృతి చెందిన వ్యక్తిని పూడ్చినా, ఖననం చేసినా వారి ఆచారం ప్రకారం శ్మశాన వాటిక వద్దే స్నానాలు చేసేలా స్నాన వాటికలు ఏర్పాటుచేశారు. ఖననం చేయడానికి ప్లాట్‌ఫాంతో పాటు స్నానాల గదులు, మరుగుదొడ్లు, బోరు బావులు ఏర్పాటు చేశారు. స్నానాల అనంతరం మహిళలు బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక గదులు నిర్మించారు. పిండాలు పెట్టుకోవడానికి ప్రత్యేక ప్లాట్‌ఫాంలు నిర్మించారు.
వైకుంఠధామాలన్నీ పూర్తి చేశాం
మండల వ్యాప్తంగా 15 పంచాయతీల్లో 4 పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున, 11 పంచాయతీల్లో రూ.12.50 లక్షలతో వైకుంఠధామాలన్నీ పూర్తిచేశాం. కొన్నింట్లో దహన సంస్కారాలు కూడా ఆయా గ్రామాల సర్పంచ్‌లు చేయిస్తున్నారు. సీఎం కేసీఆర్ అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేశాం. మండలంలో రూ.కోటి 77 లక్షల 50వేల నిధులతో 15 వైకుంఠధామాలు పూర్తి చేశాం. – ఉమాదేవి, ఎంపీడీవో, రామాయంపేట
దహన సంస్కారాలు ప్రారంభించాం
రామాయంపేట మండలంలోని రాయిలాపూర్ గ్రామంలో వైకుంఠధామాన్ని సకల సౌలత్‌లతో నిర్మించి, ప్రారంభించాం. దీంతో గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఈ శ్మశాన వాటికలోనే దహన సంస్కారాలు చేయాలని గ్రామస్తులు, కుల సంఘాల సమక్షంలో తీర్మానించాం. కులమతాలకు అతీతంగా అందరూ వైకుంఠధామాన్ని వినియోగించుకుంటున్నారు. దహన సంస్కారాల కోసం ఇబ్బందులు తప్పాయి.
– భూమగారి నర్సాగౌడ్, సర్పంచ్, రాయిలాపూర్
ఉపాధిహామీలో నిర్మించాం
రామాయంపేట మండల వ్యాప్తంగా 15 వైకుంఠధామాలను అన్ని హంగులతో నిర్మించాం. అం దులో సకల సౌకర్యాలు కల్పిం చాం. వైకుంఠధామంలో స్నానాల గదులు, మహిళల కోసం ప్రత్యేకంగా వాష్‌రూంలు, బట్టలు మార్చుకునేందుకు గదులు నిర్మించాం. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో శ్మశాన వాటికల నిర్మాణం పూర్తయి, దహన సంస్కారాలను కూడా చేస్తున్నారు.
– శంకర్, ఏపీవో, రామాయంపేట