పటాన్చెరు/పటాన్చెరు రూరల్, జూలై 9: సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గల్లంతైన 8 కుటుంబాలకు తీవ్ర నిరసనల మధ్య పరిశ్రమ యాజమాన్యంతో కలిసి అధికారులు రూ. 15 లక్షల చొప్పున పరిహారం అందించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం ఐలా భవన్ వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లో బుధవారం గల్లంతైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సంగారెడ్డి ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి కలిసి పరిశ్రమ ప్రతినిధులతో ఒక్కో కుటుంబానికి రూ. 15 లక్షల పరిహారం ఇచ్చేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. రూ. 15లక్షలు ఎలా ఇస్తారని బాధిత కుటుంబీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇస్తే రూ. కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని, లేదంటే మిస్సైన కుటుంబ సభ్యుడిని అప్పగించాలని డిమాండ్ చేశారు.
ఇప్పుడు రూ. 15లక్షల చెక్ ఇస్తామని, మరో మూడు నెలల తర్వాత మిగతా రూ. 85లక్షలు చెల్లిస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. నిబంధనల ప్రకారం డెత్ సర్టిఫికెట్ మిస్సింగ్ కేసుల్లో ఇవ్వడం కుదరదని కంపెనీ ప్రతినిధి చెప్పారు. మిస్సింగ్ కేసు నమోదైన తర్వాత ఏడేండ్లకు డెత్ డిక్ల్లేర్ చేస్తారని వివరించడంతో బాధిత కుటుంబాల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఏడేండ్ల దాక ఎవరుంటారో.. ఎవరు పోతారో చెప్పలేమని, రూ. కోటి చెల్లించే ఇష్టం లేకనే ఇలా ప్రకటిస్తున్నారని వారు నిరసనలు వ్యక్తం చేశారు. రూ. కోటి పరిహారం ఇప్పుడే ఇవ్వాలని, లేదంటే మా కుటుంబీకులు జీవించి ఉన్నట్టుగానైనా, లేదంటే శవంగానైనా చూపించాలని డిమాండ్ చేశారు.
గల్లంతైన వారి ఆనవాళ్లు లభించలేదని, కాబట్టి రూ. 15లక్షలు తీసుకోవాలని, మిగిలిన డబ్బులు తప్పక ఇస్తామని కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చారు. దీంతో మీ డబ్బులు మాకొద్దు.. మా వాళ్ల డెడ్‌బాడీలైనా ఇవ్వండంటూ బాధితులు ఆందోళనకు దిగారు. లేదంటే గవర్నమెంట్ కానీ, కంపెనీ కానీ మూడు నెలల తరువాత రూ. కోటి మొత్తం చెల్లిస్తామని లిఖితపూర్వకంగా రాసివ్వాలని అడిగారు. పరిస్థితి విషమిస్తున్నదని గ్రహించిన కంపెనీ సీఈవో, ఇతర ప్రతినిధులు అక్కడినుంచి జారుకుని, బిల్డింగ్ పైనున్న ఐలా సమావేశ మందిరంలో పోలీసులతో పాటు వెళ్లి కూర్చున్నారు. అధికారులతో మాట్లాడిన కంపెనీ ప్రతినిధులు లెటర్ ఇచ్చేందుకు అంగీకరించారు.
రూ. 15 లక్షలు ప్రస్తుతం పరిహారంగా చెల్లిస్తున్నామని, మరో మూడు నెలల్లో అన్ని విచారణలు పూర్తి చేసుకున్న తర్వాత ప్రభుత్వం ఇచ్చే నివేదికను బట్టి మిగులు రూ. 85లక్షల పరిహారం చెల్లిస్తామ పరిశ్రమ ప్రతినిధులు ఒక లెటర్ అధికారుల సమక్షంలో రాసి ఇచ్చారు. ఈ విషయాన్ని ఒక్కో కుటుంబాన్ని సమావేశ మందిరంలోకి పిలిచి అధికారులు, కంపెనీ ప్రతినిధులు బాధిత కుటుంబాల అభ్యంతరాల నడుమ రూ. 15లక్షల చొప్పున చెక్కులు అందించారు. దారి ఖర్చులకు రూ. 10వేలు అందజేశారు. డీఎన్ఏ టెస్టులకోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నదని, దాంట్లో మీరిచ్చిన డీఎన్ఏ నమూనా సరిపోతే ఆ బాడీని అప్పగిస్తామని, అప్పుడు డెత్ సర్టిఫికెట్ కూడా సులభంగా మంజూరు అవుతుందని అధికారులు తెలిపారు.
రూ. కోటి నష్టపరిహారం కోసం ఆందోళన వద్దని బాధిత కుటుంబాలకు సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. బాధితులకు రూ. 15లక్షల చెక్కులు ఇచ్చిన తర్వా త ఆయన ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. గల్లంతైన కార్మికుల, స్టాఫ్ మృతదేహాల కోసం మరికొన్ని రోజులు వెతికిస్తామని తెలిపారు. ఆనవాళ్లు దొరికిన, డీఎన్ఏ మ్యాచ్ అయిన వారి డెత్ డిక్లేర్ చేస్తామన్నారు. ఇప్పటికీ 70 నమూనాలు డీఎన్ఏకు పంపిస్తే 67 మ్యాచ్ కాలేదన్నారు.
మరో 3 మంగళవారం రోజు, మరో 2 బుధవారం మానవ ఆనవాళ్లు దొరికాయన్నారు. వాటిలో ఏవైనా మ్యాచ్ అయితే తప్పకుండా డెత్ ప్రకటించి వాటిని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెలిపారు. రెస్కూ బృందాలు 120మందితో నిరంతరం వెతుకుతూనే ఉన్నాయని, హెల్ప్ డెస్క్ కొనసాగుతుందని అదనపు కలెక్టర్ వివరించారు. ఎవరైనా శవం దొరికే వరకు ఉంటామంటే ఉండనిస్తామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహా, కలెక్టర్ ఇచ్చిన హామీ మేరకు అందరికీ న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
తమ కుమారులకు తమ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు చేసుకునే భాగ్యం లేకుండా చేశావు దేవుడా అంటూ బాధితులు కన్నీరు పెట్టుకున్నారు. ఆచూకీ లభించని కార్మికుల్లో అన్నివర్గాలకు చెందిన వారు ఉన్నారు. బీహారు, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రవేశ్తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కార్మికులు సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతిచెందారు. జూన్ 30న ఉదయం ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిన సమాచారం తెలుసుకుని పలు రాష్ర్టాల నుంచి కార్మికుల కుటుంబసభ్యులు పటాన్చెరు చేరుకున్నారు.
పటాన్చెరు ఏరియా దవాఖానతో పాటు పాశమైలారం ఫ్యాక్టరీ వద్దకు వచ్చారు. తమ కుటుంబసభ్యుల జాడ తెలుస్తుందని వారంతా పది రోజులుగా పడిగాపులు కాచారు. చివరికి అధికారులు 8 మంది కార్మికుల జాడ లభించడం లేదని, మీరు మీ ఊరికి పోవాలని కబురు చెప్పారు. దీంతో పలువురు కుటుంబ సభ్యులు తమ కుమారుల చివరి చూపు చూడకుండా చేశావు దేవుడా అంటూ కన్నీరు పెట్టుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కదిలించాయి.