సిద్దిపేట, జనవరి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామాలు, పట్టణాల్లో ప్రజాపాలన పేరిట వారం రోజుల పాటు ఆరు గ్యారెంటీలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల్లో ప్రధానంగా మహాలక్ష్మి పథకం కింద రూ. 2,500 ఆర్థిక సహాయం, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డులకు విరివిగా దరఖాస్తులు వచ్చాయి. రూ. 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలు ఉన్నాయి. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో గత నెల 28 నుంచి ఈ నెల 6వ తేదీ వరకు ప్రజల నుంచి 10,33,543 దరఖాస్తులు స్వీకరించారు. వీటన్నింటిని ఆన్లైన్లో నమోదు చేయడానికి మొత్తం వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఆపరేటర్లతో పాటు కొంతమంది ప్రైవేట్ ఆపరేటర్లు కలుపుకొని మొత్తం 1,766 మందికి ఆన్లైన్ బాధ్యతలు అప్పగించింది.
వీరంతా రోజూ ఒక్కొక్కరు 50 నుంచి 60 దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. స్వీకరించిన అన్ని దరఖాస్తులను ఈనెల 17లోపు ఆన్లైన్లో పొందుపర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ విధంగానే జిల్లా స్థాయిలో ఏర్పాట్లు చేశారు. డేటా ఆపరేటర్లకు సైతం శిక్షణ ఇచ్చారు. కానీ నిర్దేశించిన సమయానికి డేటా ఎంట్రీ పూర్తి అవుతుందనే నమ్మకం లేదని కొంతమంది డేటాఎంట్రీ ఆపరేటర్లు బాహాటంగానే చెబుతున్నారు. జిల్లాల కలెక్టర్లు రోజు వారీగా సమీక్షిస్తున్నారు. ఆపరేటర్ ఏమాత్రం అజాగ్రత్తగా నమోదు చేసినా లబ్ధిదారుడు నష్టపోవాల్సిందే. దీనికి తోడు సర్వర్ సమస్య కూడా తోడవుతుంది. పదే పదే లాగిన్ చేయాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి. ఆధార్ నంబర్ నమోదు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకోకుండా చేస్తే లబ్ధిదారులకు నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మరో సమస్య కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. దీనిని అదునుగా భావించి సైబర్ నేరగాళ్లు చొరబడే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రతిదీ జాగ్రత్తగా చేయాలంటే నిర్దేశించిన గడువులోగా డేటా ఎంట్రీ కావడం అసాధ్యమే అని చెప్పాలి.
ప్రజాపాలనలో భాగంగా ప్రతి వంద మందికి ఒకటి చొప్పున గ్రామాల్లో కౌంట ర్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి వారం రోజుల పాటు దరఖాస్తులు స్వీకరించారు. స్వీకరించిన దరఖాస్తులను ఈనెల 17లోపు డేటా ఎంట్రీ చేసేలా జిల్లాల్లో ఆపరేటర్లకు బాధ్యతలు అప్పగించారు. సిద్దిపేట జిల్లాలో 684 మంది, మెదక్ జిల్లాలో 480 మంది, సంగారెడ్డి జిల్లాలో 602 మంది మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,766 మంది వివిధ శాఖల్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లతో పాటుగా మరికొంది మంది ప్రైవేట్ ఆపరేటర్లు ఉన్నారు. వీరందరికీ శిక్షణ ఇచ్చి ఆన్లైన్ నమోదు ప్రక్రియను ముమ్మరం చేశారు. ప్రతి ఆపరేటర్ రోజుకు 50 నుంచి 60 దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంది. 27 అంశాలను పథకాల వారీగా ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఒక దరఖాస్తుకు రూ. 5 చొప్పున, ప్రైవేట్ ఆపరేటర్‌కు రూ. 15 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నగదు చెల్లిస్తుంది.
నిర్దేశించిన సంఖ్యకు అదనంగా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయడానికి వీలు లేదు. సిద్దిపేట జిల్లాలో మొత్తం 3,76,387 దరఖాస్తులు రాగా. వీటిలో ఐదు గ్యారెంటీలకు 3,19,261, ఇతర విభాగాలకు సంబంధించినవి 57,126 వచ్చాయి. వీటిని ఆన్లైన్ ప్రక్రియను 684 మంది ఆపరేటర్లతో చేపడుతున్నారు. మెదక్ జిల్లాలో 2,73,389 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 2,23,357 దరఖాస్తులు ఆరు గ్యారెంటీలవి కాగా ఇతర సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు 50,032 వచ్చాయి. వీటిని ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి జిల్లాలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న 480 మంది కంప్యూటర్ ఆపరేటర్లకు బాధ్యతలు అప్పగించి ఆన్లైన్ నమోదు ప్రక్రియను చేపట్టారు. సంగారెడ్డి జిల్లాలో 3,83,767 దరఖాస్తులు స్వీకరించారు. వీటిలో రేషన్ కార్డులకు 58,599 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. వీటన్నింటిని ఆన్లైన్ నమోదు చేయడానికి 602 డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఏర్పాటు చేసి ఆన్లైన్ ప్రక్రియను ముమ్మరం చేశారు.