ప్రభుత్వ వైద్యసేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సర్కారు కృషి చేస్తున్నది. పీహెచ్‌సీల్లో సైతం కార్పొరేట్ స్థాయి వైద్యసౌకర్యాలు కల్పిస్తుండడంతో సర్కారు దవాఖానలపై రోజురోజుకూ ప్రజలకు నమ్మకం పెరుగుతున్నది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి 108 వాహనాల్లో సమీపంలోని దవాఖానలకు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 108 వాహనాలు 15 ఉండగా, వీటిలో తొమ్మిదిటికి కాలం చెల్లిపోవడంతో ప్రభుత్వం కొత్తగా 11 అంబులెన్స్‌లు మంజూరు చేసింది. కొత్తగా కోహీర్, ఝరాసంఘం మండలాలకూ ఒక్కొక్కటి కేటాయించింది. మాతా, శిశు మరణాలను తగ్గించేందుకు ప్రవేశపెట్టిన 102 వాహనాలు సైతం శిథిలావస్థకు చేరుకోవడంతో 15 అమ్మఒడి వాహనాలను అందజేసింది. ప్రమాదం, సాధారణ పరిస్థితుల్లో మృతి చెందిన పార్థివ దేహాల అంతిమయాత్ర కోసం ఒక వాహనం కేటాయించింది. మొత్తం కొత్తగా 27 వెహికిల్స్ అందుబాటులోకి రావడంతో ఆపత్కాలంలో క్షతగాత్రులు, ప్రసవాల సమయంలో గర్భిణులు, బాలింతల ప్రాణాలకు సర్కారు మరింత భరోసా కల్పించింది.
– సంగారెడ్డి, ఆగస్టు 28
సంగారెడ్డి, ఆగస్టు 28: ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందేలా దవాఖానలను బలోపేతం చేస్తున్న విషయం తెలిసిందే. మండలకేంద్రాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పల్లెల్లో ఆరోగ్య ఉపకేంద్రాలు, జిల్లా దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పించి కార్పొరేటుకు దీటుగా సేవలందిస్తున్నది. అంతేకాకుండా అత్యవసర సేవలు అందించేందుకు అంబులెన్స్‌లను సైతం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఎక్కడ ప్రమాదం జరిగినా 108 వాహనాలు క్షణాల్లో అక్కడికి చేరుకుని ప్రథమ చికిత్సలు అందిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాకు కొత్తగా 27 వాహనాలను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 108 వాహనాలు 11, అమ్మఒడి 15, ఒక పార్థివ వాహనం జిల్లాకు కేటాయించిన వాటిలో ఉన్నాయి. ఇంతకుముందు జిల్లాలో అత్యవసర సేవలకు వినియోగించిన వాహనాలకు కాలంచెల్లడంతో ప్రభుత్వం కొత్త వాహనాలను కేటాయించింది. సంగారెడ్డి జిల్లాలోని కోహీర్, ఝరాసంగం మండలాలకు కొత్తగా 108 వాహనాలు అత్యవసర సేవలు అందించనున్నాయి. కొత్తగా కేటాయించిన వాహనాలతో ప్రజలకు మరింత వేగంగా వైద్యసేవలు అందించేందుకు అంబులెన్సులు పనిచేయనున్నాయి.
వందల సంఖ్యలో క్షతగాత్రులకు సేవలు
ఆపత్కాలంలో ప్రజలు, బాధితుల ప్రాణాలు కాపాడేందుకు అత్యవసర వాహనాలు విస్తృత సేవలు అందిస్తున్నాయి. ముఖ్యంగా ప్రమాదం జరిగిన సమాచారం అందగానే క్షణాల్లో ఘటన ప్రాంతాలకు 108 వాహనాలు చేరుకుని బాధితులకు ప్రథమ చికిత్సలు చేసి మెరుగైన వైద్యసేవలకు దవాఖానలకు చేర్చుతున్నాయి. ఒక్కొక్క వాహనం నెల రోజుల్లో 130 నుంచి 150 మంది క్షతగాత్రులు, రోగులను దవాఖానలకు తీసుకెళ్లి ప్రాణాలను కాపాడుతున్నాయి. అలాగే 102 వాహనాలు సైతం ప్రతినెలా 350నుంచి 100 మంది గర్భిణులు, బాలింతలను వైద్యశాలలకు తీసుకొచ్చి మళ్లీ వారి ఇండ్లకు సురక్షితంగా చేర్చుతున్నాయి. గతంలో అంబులెన్సులకు సమాచారం ఇచ్చేందుకు కాల్‌సెంటర్‌కు ఫోన్ చేస్తే అది హైదరాబాద్ కాల్‌సెంటర్‌కు వెళ్లేది, అక్కడి నుంచి దగ్గరలోని అంబులెన్సుకు సమాచారాన్ని చేరవేయడంతో డ్రైవర్ వాహనాన్ని తీసుకొని ఘటనా స్థలానికి చేరుకోవడానికి చాలా సమయం పట్టేది. ఈ జాప్యాన్ని నివారించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుని అత్యవసర వాహనాలన్నింటికీ జీపీఎస్ సిస్టంను ఏర్పాటు చేసి ట్యాబ్‌లను అందుబాటులోని తెచ్చింది. దీంతో 108 వాహనానికి కాల్ చేసిన వ్యక్తితోపాటు ప్రాంతంలోని అంబులెన్స్ డ్రైవర్‌కు లింక్ వెళ్తుంది. దీంతో కాల్ వచ్చిన 10 సెకండ్లలోనే వాహనం బయలుదేరి కాల్ చేసిన వ్యక్తికి అంబులెన్స్ వచ్చే సమయాన్ని ఎప్పటికపుడు చేరవేస్తుంది.
సేవలు మరింత వేగవంతం
సంగారెడ్డి జిల్లాకు 108,102 నూతన వాహనాలు కేటాయించడంతో సేవల్లో మరింత వేగం పెరగనున్నది. జిల్లాలో ప్రస్తుతం 108 వాహనాలు 15, అమ్మఒడి వాహనాలు 15, ఒక పార్థివ వాహనం సేవలు అందిస్తున్నాయి. ఈ వాహనాలు మరమ్మతులకు చేరుకోవడంతో ప్రభుత్వం నూతన వాహనాలను కేటాయించింది. ప్రభుత్వం కేటాయించిన వాహనాల్లో 108 వాహనాలు 11, అమ్మఒడి వాహనాలు 15, ఒక పార్థివ వాహనాలను కేటాయించింది. అలాగే కొత్తగా కోహీర్, ఝరాసంఘం మండలాలకు 108 వాహనాలు అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొందిచిన వాహనాలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.
– వసంత్, మూడు జిల్లాల ప్రోగ్రాం మేనేజర్