మెదక్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేస్తోంది. అంతేకాదు కమిటీలు వేసి అర్హులను గుర్తించేందుకు సర్వేను ప్రారంభించింది. కానీ అసలైన లబ్ధిదారులు ఎక్కడ ఉన్నారో కానీ సొంతిళ్లు ఉన్న వారు, రాజకీయ పార్టీల నాయకులు ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకున్న విషయం సర్వేలో వెలుగు చూడడం విశేషం. ఒక వైపు ఇందిరమ్మ ఇండ్ల సర్వే జరుగుతుండగానే మరో వైపు రాజకీయ నాయకులు ఇండ్ల కోసం పైరవీలు చేస్తున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల సర్వే మెదక్ జిల్లాలో చివరి దశకు చేరుకోవడంతో రాజకీయ, ధన బలం ఉన్న వారు ఇంటి నిర్మా ణం కోసం ప్రభుత్వం మంజూరు చేసే రూ.5 లక్షల కోసం కక్కుర్తి పడుతున్నారు. సర్వేకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. కానీ జిల్లా వ్యాప్తంగా సర్వే చేస్తున్న సిబ్బంది యాప్లో పొందుపర్చే అంశాలకు ఇబ్బందులు పడుతున్నారు.
మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు79 శాతం సర్వే చేశారు. మరో 20 శాతం పూర్తి చేసేందుకు ఈ నెల 12 వరకు చివరి గడువు. సర్వేకు వెళ్లిన అధికారులకు ఇండ్ల దగ్గరకు వెళ్లగా ఆ సమయంలో ఇండ్ల వద్ద లబ్ధిదారులు లేకపోవడం, మరో పక్క ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడంతో ఇండ్ల్లకు తాళాలు వేసి ఉండడంతో వివరాల సేకరణకు ఇబ్బందులు ఎదురవుతున్నా యి. దరఖాస్తు ఫారంలో ఇంటి కోసం టిక్ చేసిన వారి వివరాలు యాప్లో చూపకపోవడం, టిక్ కొట్టని వారివి చూపకపోవడంతో సర్వే చేస్తున్న సిబ్బం ది తల పట్టుకుంటున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తీసుకువచ్చింది. దీంతో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించగా మెదక్ జిల్లాలో ఇండ్లు లేని లబ్ధిదారుల నుంచి 1.91 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అర్హులైన లబ్ధిదారులను గుర్తించడానికి సర్వే చేపట్టగా ఇప్పటి వరకు 79 శాతం పూర్తయ్యింది. వంద శాతం సర్వే పూర్తి చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ క్షేత్ర స్థాయిలో జరుగుతున్న సర్వేను పరిశీలిస్తున్నారు. సర్వే పూర్తి కాగానే వెంటనే యాప్లో నమోదు చేయాలని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అధికారులు గ్రామాలకు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు.
మెదక్ జిల్లాలో కొనసాగుతున్న సర్వే సిబ్బంది ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా లబ్ధిదారుల వివరాలను నమోదు చేసుకోవాలి. అయితే ఒక్కో ఇంటి వద్ద 15 నుంచి 25 నిమిషాల సమయం పడుతోంది. లబ్ధిదారుడి పేరు, ఆధా ర్ ఐడీ, సంవత్సర ఆదాయం, సొంత స్థలం ఉందా.. గతంలో ఇల్లు మంజూరైందా.. ఇలా 35 ప్రశ్నలను సిబ్బంది రాబట్టి యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. యాప్లో ఏఐ టెక్నాలజీ ఉపయోగించి లబ్ధిదారుడి ముఖాన్ని, ఇల్లు నిర్మించుకునే భౌగోళిక అక్షాంశాలు, రేఖాంశాల వివరాలు నమోదు చేయడం, ఇండ్ల నిర్మాణ ప్రగతిని సైతం ఏఐ ఆధారంగా ఫొటోలు తీయడంతో ఎన్నో ఆటంకాలు ఏర్పడ్డాయి. మెదక్ జిల్లాలోని మెదక్, హవేళీఘనపూర్, కొల్చారం, టేక్మాల్, అల్లాదుర్గం తదితర మండలాల నుంచి ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు కూడా ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కలెక్టర్ వలస వెళ్లిన వారి వివరాలను సైతం యాప్లో నమోదు చేయాలని అధికారులకు సూచించడంతో ఏంచేయాలో తెలియక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.
మెదక్ జిల్లా వ్యాప్తంగా 79 శాతం ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తయింది. సంక్రాంతిలోగా మరో 20 శాతం సర్వే పూర్తి చేస్తాం. సర్వేకు వెళ్లిన అధికారులు, సిబ్బంది ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయరాదు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి వివరాలను సైతం యాప్లో నమోదు చేయాలి.
-మాణిక్యం, గృహ నిర్మాణ శాఖ పీడీ, మెదక్ జిల్లా
4