చేర్యాల, మార్చి 24: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రానికి సమీపంలో రాజీవ్ రహదారిని ఆనుకుని నిర్మించిన రైల్వేస్టేషన్ ఎప్పుడు ప్రా రంభమవుతుందోనని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రసిద్ధ కొమురవెల్లి మల్లన్న పుణ్యక్షేత్రానికి ప్రతి ఆదివారం భారీగా భక్తులు తరలివస్తున్నారు. స్వామివారి ఉత్సవాల సమయంలో లక్షల్లో, మిగిలిన రోజుల్లో వేలాదిగా భక్తులు బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో వ్యయప్రయాసాలు పడుతూ కొమురవెల్లికి వస్తున్నారు. దీంతో భక్తుల సౌకర్యార్థం ఆలయానికి సమీపంలో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం భావించి కేంద్రానికి నివేదికలు పంపించింది.
రైల్వేస్టేషన్‌కు సంబంధించిన తమవంతుగా భూసేకరణ చేయించడంతో పాటు నిధులు సైతం కేటాయించింది. 2024 ఫిబ్రవరిలో రైల్వేస్టేషన్ పనులు ప్రారంభించిన సంబంధిత శాఖ అధికారులు ఈ సంవత్సరం స్వామి వారి బ్రహ్మోత్సవాల ప్రారంభంలోనే రైలు ఆగే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. గతంలో పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు పనులు పూర్తయినా ప్రారంభించేందుకు ముందుకు రావడం లేదు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సైతం చర్లపల్లి టెర్మినల్ ప్రారంభం సమయంలో దసరా రోజు కొమురవెల్లి మల్లన్న రైల్వేస్టేషన్ ప్రారంభం అవుతుందని ప్రకటించారు.
అనంతరం స్వామివారి బ్రహ్మోత్సవాల ముందు సంక్రాంతికి ప్రారంభిస్తామని పలుమార్లు వెల్లడించారు. వాయిదాల పర్వం కొనసాగుతుందా లేక ప్రారంభం అవుతుందా అనే విషయంలో భక్తులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కోట్లు ఖర్చు చేసి నిర్మించిన రైల్వేస్టేషన్ ప్రారంభం వాయిదాలు పడడం వల్ల స్టేషన్ నిరుపయోగంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాలో నిర్మించిన పలు రైల్వేస్టేషన్ల పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ హయాంలో భూ సేకరణ పూర్తి చేసి తనవంతు షేర్ అమౌంట్‌ను కేటాయించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం రూ.1,160 కోట్ల అంచనాతో మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి వరకు 151కిలోమీటర్ల దూరం రైల్వేలైన్ నిర్మాణ పనులు చేపట్టింది.ఈ మార్గంలో 15 స్టేషన్లు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. అందులో రూ.4కోట్లు ఖర్చు చేసి కొమురవెల్లి సమీపంలో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2025 జాతర సమయంలో జనవరి 15 నుంచి రైల్వే స్టేష న్ పనులు పూర్తి చేసి రైలు నిలిపేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులు భావించగా, పనులు పూర్తి కాకపోవడంతో దానిని అమలు చేయలేదు. రైల్వేస్టేషన్లో టికెట్ బుకింగ్ కౌంటర్, వెయిటింగ్ హాల్, మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రయాణికులు కూర్చునేందుకు బెంచీలు, రైల్వే సిబ్బంది కార్యాలయ గది పనులు, రైల్వేస్టేషన్ ముఖద్వారం దగ్గర దేవాలయ గోపురం నిర్మాణాలు పూర్తి చేశారు. దీంతో పాటు రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు సీసీ రోడ్డు సైతం నిర్మించారు. అన్ని వసతులు కల్పించి ప్రారంభించలేదు. అధికారులు పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శంచుకుని మొక్కులు చెల్లించుకునేందుకు ఏటా 25లక్షల మందికి పైగా భక్తులు కొమురవెల్లి క్షేత్రానికి వస్తుంటారు. సరైన ప్రయాణ సౌకర్యాలు లేక నానా తిప్పలు పడుతున్నారు.బస్సుల్లో వచ్చే వారంతా రాజీవ్ రహదారి నుంచి 3 కిలోమీటర్ల దూరంలోని కొమురవెల్లికి చేరుకోవడానికి తిరిగి ఇంటికి వెళ్లేందుకు ప్రధాన రహదారిపై గంటల పాటు నిరీక్షించాల్సిందే. రైల్వేస్టేషన్ నిర్మాణంతో మల్లన్న భక్తులతో పాటు చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల ప్రజలకు రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేది. మనోహరాబాద్-కొత్తపల్లి మధ్య రైలు మార్గం పూర్తయితే కొమురవెల్లితో పాటు వేములవాడ రాజరాజేశ్వరస్వామి, కొండగట్టు ఆంజనేయస్వామి, కోటిలింగేశ్వరస్వామి ఆలయాలకు వెళ్లేందుకు ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. దీంతో పాటు ఈ ప్రాంత ప్రజలకు హైదరాబాద్, కరీంనగర్ వరకు ప్రయాణ సౌకర్యం కలుగుతుంది.