పటాన్చెరు/అమీన్‌ఫూర్, జనవరి 25: సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ సూచించారు. శనివారం అమీన్పూర్ మున్సిపాలిటీలోని బాలాజీ ఫంక్షన్హాల్లో సైబర్ నేరాలపై పోలీసులు ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో సైబర్ నేరాలు బాగా పెరిగాయని, ప్రధానంగా అమీన్‌ఫూర్ ప్రాంతంలో ఎక్కువగా జరుగుతున్నట్లు చెప్పారు. సైబర్ నేరగాళ్ల వలలో విద్యావంతులే అధికంగా మోసపోతుండడం బాధాకరమని పేర్కొన్నారు. మల్టీలెవల్ మార్కెటింగ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ఇతర ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిపారు. ఏ పోలీసు అధికారి నేరుగా వాట్సాప్ వీడియోకాల్స్ చేయరని, డిజిటల్ అరెస్టులు అని చేసేకాల్స్ వస్తే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో వెంటనే సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. ప్రజల బలహీనతలే సైబర్ నేరగాళ్ల బలంగా మారిందన్నారు. మారుతున్న టెక్నాలజీ, అందుబాటులోకి వచ్చిన ఏఐ టెక్నాలజీతో మోసగాళ్లు చెలరేగిపోతున్నారని, అప్రమత్తంగా ఉంటేనే నష్టం జరగదన్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో నష్టపోతే తక్షణం 1930లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
గంజాయి సేవనం అన్ని ప్రాంతాల్లో పెరిగిందని ఎస్పీ రూపేశ్ తెలిపారు. డ్రగ్స్, గంజాయి మహమ్మారి బారినపడి యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరదాగా మొదలెట్టిన ఈ వ్యసనాలు ప్రాణాంతకంగా మారుతాయని తెలిపారు. మాదకద్రవ్యాలను వాడుతున్నట్టుగా గుర్తిస్తే సంబంధిత విద్యాసంస్థ నుంచి విద్యార్థిని టెర్మినెట్ చేయిస్తామని ఎస్పీ హెచ్చరించారు. గంజాయిపై పోలీసు శాఖ ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటాని ఎస్పీ హెచ్చరించారు. కార్యక్రమంలో పటాన్చెరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ వేణుగోపాల్‌రెడ్డి, అమీన్పూర్ ఇన్స్పెక్టర్ పి.నరేశ్, ఇన్స్పెక్టర్ రవీందర్‌రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లాలూనాయక్ తదితరులు పాల్గొన్నారు.