
పుల్కల్ రూరల్, సెప్టెంబర్ 6: సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో రెండేండ్ల వరకు సాగు, తాగునీటికి ఢోకా ఉండదని, రైతులు సాగుచేసిన ప్రతిగుంట భూమికి నీరందిస్తామని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. సోమవారం సింగూర్ ప్రాజెక్టు గేట్ల ద్వారా దిగువకు నీటిని ఆయన విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సింగూరు ప్రాజెక్టు నిండడంతో అందోల్, పుల్కల్, మెదక్, టేక్మాల్ మండలాల పరిధిలోని రైతులు నిరభ్యంతరంగా పంటలు సాగుచేసుకోవచ్చని సూచించారు. సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయం పండుగలా మారిందని, రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. త్వరలోనే బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పనుల ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ హాజరు కానున్నట్లు తెలిపారు. ఒకటిన్నర మీటర్ల ఎత్తుతో 11వ గేటు ఎత్తి నీటిని ఎమ్మెల్యే వదిలారు. మంజీరా నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సోమవారం సింగూరులోకి 33వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, ఔట్‌ఫ్లో 8,626 క్యూసెక్కుల ఉందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో నీటి పారుదలశాఖ సీఈ అజయ్‌కుమార్, ఎస్సీ మురళీధర్, ఈఈ మధుసూదన్‌రెడ్డి, జోగిపేట మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, టీఆర్ఎస్ నాయకులు శివకుమార్, జగన్మోహన్రెడ్డి, నారాయణ, విజయభాస్కర్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.