జహీరాబాద్, జూన్ 29: జహీరాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. సంబంధిత శాఖ అధికారులు పర్యవేక్షణ కొరవడడంతో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా పనులు చేపడుతున్నారు. దీంతో రైల్వే ఉద్యోగులు, సిబ్బంది, ప్రయాణికులకు అసౌకర్యం తప్పడం లేదు. జహీరాబాద్ మీదుగా నిత్యం 18 ప్యాసింజర్, 12 గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. వెయ్యి నుంచి రెండు వేలమందికి పైగానే ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు.
జహీరాబాద్ రైల్వేస్టేషన్‌ను నిజాం పాలనలో నిర్మించారు. అప్పట్లో స్టేషన్లో నిర్మించినా భవనాలు చిన్నవిగా ఉండడంతో పెరిగిన అధికారులు, సిబ్బంది, ప్రయాణికులతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జహీరాబాద్ రైల్వే స్టేషన్‌ను అదర్శ స్టేషన్‌గా అభివృద్ధి చేసి 2010, డిసెంబర్ 4న అప్పటి రైల్వేశాఖ సహాయ మంత్రి కేహెచ్ మునియప్ప ప్రారంభించారు. ఆ తర్వాత కూడా స్టేషన్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీగా పనిచేసిన బీబీపాటిల్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి అప్పట్లో వినతి పత్రాన్ని అందజేశారు. ఆయన విజ్ఞప్తికి స్పందించి కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ పథకం కింద రూ. 24.40 కోట్ల నిధులు మంజూరు చేసింది. 2023, ఆగస్టు 6న దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ల ఆధునీకరణ పనులకు ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.
అమృత్ భారత్ పథకంలో భాగంగా ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి జహీరాబాద్ రైల్వేస్టేషన్లో ఏసీ గదులతో పాటు ఫుట్ఓవర్ బ్రిడ్జి, ప్లాట్‌ఫామ్స్, టాయిలెట్స్ నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. దివ్యాంగులకు అనుకూలమైన సౌకర్యాలు కల్పించాలి. రైల్వేస్టేషన్లో ఆధునిక పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టం, ఎల్ఈడీ డీస్ప్లే స్టేషన్ పేరు బోర్డులు, ప్రయాణికులు అనుకూలమైన సూచికలు ఏర్పాటు వంటి పనులు చేపట్టాల్సి ఉంది. ప్రారంభ దశలో కాంట్రాక్టర్ స్టేషన్లో యుద్ధప్రాతిపదికన ఆధునీకరణ పనులు చేపట్టారు.
గతేడాది పార్లమెంట్ ఎన్నికలు రావడంతో స్టేషన్ ఆధునీకరణ పనులు నెమ్మదించాయి. ప్రస్తుతం రైల్వేస్టేషన్ పరిధిలో కవర్ అఫ్ ప్లాట్‌ఫాం షెడ్ల విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. 1, 2వ ప్ల్లాట్ఫాంలు ఉన్నా.. రైల్వేస్టేషన్లో ఒక్కో వైపు నాలుగు చొప్పున ప్రయాణికుల కోసం నీడనిచ్చే సీవోపీలు నిర్మించారు. 12మీటర్ల వెడల్పుతో ఫుట్ఓవర్ బ్రిడ్జి కమ్ ఎస్కలేటర్‌కు ఫిల్లర్లపై గిర్డర్లను ఏర్పాటు చేశారు.
వీఐపీ లాంజ్, ప్రయాణికుల కోసం తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, అప్రోచ్ రోడ్లు నిర్మాణ పనులతో పాటు ఆధునీకరణతో స్టేషన్ భవనం, ఫ్లోరింగ్ ఆధునిక శైలిలో ప్రవేశ మార్గం, స్టేషన్ కంప్యూటర్స్, రైల్వే కమ్యూనికేషన్, స్టేషన్ మాస్టర్ గదుల నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. స్టేషన్ పరిధిలో పార్కింగ్, పార్కు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ, పనులు పురోగతి లేదు. ప్రస్తుతం స్టేషన్లో ఆటోమేటిక్ టికెట్ వెండర్ మిషన్‌ను అందుబాటులోకి తెచ్చి, ప్ల్లాట్ఫాంపై ఏర్పాటు చేసి ప్రయాణికులకు టికెట్లు జారీచ చేస్త్తున్నారు. ఆయా పనులన్నీ మందకొడిగా కొనసాగుతుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. రైల్వే ఉన్నతాధికారులు స్పందించి వేగంగా ఆధునీకరణ పనులు పూర్తిచేయించాలని ప్రయాణికులు కోరుతున్నారు.