చేర్యాల, డిసెంబర్ 4:సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం వివాదాలకు కేంద్రంగా మారుతోంది. దీంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. కొన్ని నెలలుగా స్వామి ఆలయం నిత్యం ఏదో ఒక ఘటన, సమస్యలతో వార్తల్లోకి ఎక్కుతుండడంతో సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం సైతం ఆలయ అభివృద్ధి, ఉద్యోగుల బదిలీలు, కేటాయింపులు తదితర వాటి పట్ల పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులే దానిని వివాదాలకు నిలయంగా మారుస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నారు.
కొమురవెల్లి మల్లికార్జునస్వామి ధర్మకర్తల మండలి నియామకంపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్నది.14 మందితో నియమించాల్సిన ధర్మకర్తల మండలి విషయంలో ఆలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎనిమిది మంది సభ్యులను ధర్మకర్తలుగా నియమించి, మిగిలిన ఆరుగురు సభ్యుల కోసం ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ నూతనంగా నోటిఫికేషన్ విడుదల చేయడంతో అన్నివర్గాలు ముక్కున వేలేసుకుంటున్నాయి. ఏప్రిల్లోనే ధర్మకర్తల మండలి నియామకం కోసం దేవాదాయ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో 72 మంది సభ్యులు దరఖాస్తు చేసుకున్నారు. ధర్మకర్తల మండలిని నియమించాలంటే ఇందులో నుంచి సభ్యులను నియమించవచ్చు లేదా కొత్తగా ఉత్సవ కమిటీని ఏర్పా టు చేయవచ్చు కానీ వాటికి భిన్నంగా ఎనిమిది మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయడం మిగిలిన సభ్యుల నియామకం కోసం కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
మల్లన్న బ్రహ్మోత్సవాల వరకు బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలకు స్వర్ణ కిరీటాలు చేయించి సమర్పిస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గత బ్రహ్మోత్సవాలతో పాటు ఇటీవల కొమురవెల్లిలో ఆమె పర్యటించిన సందర్భంగా ప్రకటించారు.కానీ ఇప్పటి వరకు స్వర్ణ కిరీటాల విషయంలో ఎలాంటి పురోగతి లేక భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్వామి వారికి భక్తులు మొక్కుల రూపంలో సమర్పించుకున్న మిశ్రమ బంగారాన్ని స్వచ్ఛమైన బంగారంగా మార్చి దానిని కిరీటాలు గా తయారు చేయించే సమయం మంత్రులు, దేవాదాయశాఖ అధికారులకు లేక పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఆలయంలో లడ్డూ, పులిహోర ప్రసాదాలను భక్తులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. మల్లన్న ప్రసాదాల తయారీపై సం బంధిత విభాగం అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ కొరవడడంతో ప్రసాదాలు తయారు చేసే కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా తయారు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ఓ భక్తుడు కొనుగోలు చేసిన పులిహోరలో వెంట్రుకలు, కీటకాల అవశేషాలు సైతం రావడం చర్చనీయాంశంగా మారింది.
భక్తుల వసతుల కోసం ప్రారంభించిన అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రూ.12కోట్లతో నిర్మిస్తున్న క్యూలైన్ల నిర్మాణం నత్తనడకన సాగుతున్నది. స్వామి వారి ఉత్సవాలు సమీపిస్తుండడంతో ఈసారి బ్రహ్మోత్సవాలకు క్యూలైన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. దీనికి తోడు గుట్టపై ప్రారంభించిన త్రిశూలం, ఢమరుకం పనులు వేగవంతం చేసి ఉత్సవాల వరకు దానిని వినియోగంలోకి తీసుకురావాల్సి ఉంది. ఎల్లమ్మ ఆలయం వద్ద బోనాలు సమర్పించే ప్రదేశంలో ఎలాంటి రక్షణ లేక కుక్కలు, కోతులు స్వైరవిహారం చేస్తుండడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
బ్రహ్మోత్సవాల సమయంలోనే కాకుండా ఆది, బుధ వారా లు, శ్రావణ, కార్తిక మాసాలు, ప్రత్యేక రోజుల్లో భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇదే సమయంలో మొక్కులు చెల్లించుకునే క్రమంలో పట్నం వేస్తున్న భక్తుల నుంచి పలువురు ఒగ్గు పూజారులు డిమాండ్ చేసి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఇదేతంతు కొనసాగిస్తుండడంతో మిగిలిన రోజుల్లో సైతం వారి వసూళ్లకు అడ్డూ అదుపు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
కొమురవెల్లి భక్తులకు వసతులు కల్పించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో దేవాదాయ శాఖ మంత్రిగా విధులు నిర్వహించిన పొన్నాల లక్ష్మయ్య ప్రత్యేక శ్రద్ధ వహించి రెండు వీఐపీ సూట్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు శంకుస్థాపన చేశారు. ఆధునిక వసతులతో కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో రెండు వీఐపీ సూట్లు నిర్మాణానికి నోచుకున్నప్పటికీ వాటిని కాస్తా అధికారులు ఒకటి పోలీస్స్టేషన్, మరొకటి ఎంపీడీవో కార్యాలయానికి కేటాయించారు. రోజురోజుకూ పెరుగుతున్న వీఐపీల తాకిడిని గుర్తించి ఆలయ వర్గాలు వీఐపీ సూట్లు ఖాళీ చేసి తమకు అప్పగించాలని కోరడంతో పోలీసులు వీఐపీ సూటు ఖాళీ చేసి వెళ్లిపోయారు. కానీ ఎంపీడీవో కార్యాలయం కొమురవెల్లి మండలం ఏర్పాటు చేసినప్పటి నుంచి అణా పైసా చెల్లించకుం డా మల్లన్న వీఐపీ సూట్లో కొనసాగుతున్నది. భవనం ఖాళీ చేయాలని ఆలయ అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ వాటి ని పట్టించుకోకుండా కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు.
ఆలయంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఐదుగురిని రాష్ట్రంలో అధికార మార్పిడి కాగానే కాంగ్రెస్ పెద్దలు తొలిగించి తమ పార్టీ వారిని నియమించాలని హుకుం జారీ చేశారు. దీంతో ఆలయ అధికారులు వారి పట్ల ఎలాంటి కనికరం లేకుండా తొలిగించడంతో ఐదు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తాము ఎన్నికల సమయంలో, గతంలో ఎప్పుడూ పార్టీల్లో తిరగలేదని సంబంధిత శాఖ మంత్రి కొండా సురేఖతోపాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను కలిసినా వారికి ఎలాంటి న్యాయం జరగలేదు.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో కొనసాగుతున్న అన్నప్రసాద వితరణశాలలో భోజనం భక్తులకు కాకుండా మల్లన్న ఆలయంలో పని చేసే కొందరు ఉద్యోగులు, మల్లన్న క్షేత్రంలో వివిధ కాంట్రాక్టు పనులు చేస్తున్న కార్మికులు, సూపర్వైజర్లు చేస్తున్నారు. వీరే కాకుండా మండలకేంద్రంలోని కొన్ని ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు, కొందరు పోలీస్ సిబ్బంది సైతం అప్పుడప్పుడు అన్నదాన సత్రానికి వచ్చి భోజనం చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.