హుస్నాబాద్ టౌన్, నవంబర్ 4: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ పరిధిలోని ఆరపల్లిలో సింగిల్విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఈ కొనుగోలు కేంద్రంలో పది రోజులకు ముందు నుంచే రైతులు వడ్లు తెచ్చి ఆరబెట్టుకున్నారు. మంగళవారం కురిసిన అకాల వర్షానికి ఈ కేంద్రంలో వందలాది క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది. కొందరి రైతుల వడ్లు కొట్టుకుపోయాయి. తడిసిన ధాన్యం కొంటామని హామీ ఇచ్చిన అధికారులు బస్తాలు సైతం అందజేసి చేతులు దులుపుకొన్నారు. గత శనివారం తూకాలు పెట్టినప్పటికీ ధాన్యం తరలించేందుకు వాహనాలను సమకూర్చలేదు. దీంతో ఆరపల్లిలోని కల్లూరి భూమయ్య, నమిలికొండ రాజయ్య, కాశబోయిన శ్రీధర్, గడిపె లక్ష్మణ్ తదితర రైతులకు చెందిన 600 వందలకు పైగా వడ్ల బస్తాలు రోడ్డుపైనే ఉండిపోయాయి. వర్షానికి తడుస్తూ మొలకలు వస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం తరలింపునకు వాహనాలు సమకూర్చాలని అధికారులను వేడుకున్నా స్పందన కరువైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వానలతో తవ వడ్లు తడిసి దెబ్బతింటున్నాయని రైతులు వాపోయారు. వారం రోజులుగా ప్యాడీ క్లీనర్ రిపేర్ చేయించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈడ సార్లు ఎవ్వలు వత్తలేరు. రెండు ట్రాక్టర్ల వడ్లుపోసి పదిరోజులు అవుతుంది. మమ్మల్ని అడిగినోళ్లులేరు. పట్టించుకునేటోల్లు లేరు. పోసిన వడ్లకింది కెల్లి నీల్లుపోబట్టే.. ఇటు అటు బొర్రిస్తున్నం. మా పరేషాన్ మేమే అవుతున్నం. ఆడిగినోళ్లు కూడా లేరు. పొద్దుగాల, సాయంత్రం వచ్చిచూసుకోని పోవడయితంది.
– దొంతరబోయిన వెంకటమల్లు, రైతు, హుస్నాబాద్
మద్దూరు(ధూళిమిట్ట), నవంబర్ 4: సిద్దిపేట జిల్లా మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో కురుస్తన్న వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. పంటలు చేతికందే సమయంలో వర్షాలు కురుస్తుండడంతో నష్ట జరిగి రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వరి పంట నేలకొరగగా, పత్తి పంట మొలకెత్తుతున్నది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిముద్దవుతున్నది. మద్దూరు మండల కేంద్రంలోని ఐకేపీ సెంటర్లో సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో పలువురు రైతులు కొనుగోలు కేంద్రం నుంచి ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నారు. రేబర్తి గ్రామానికి చెందిన నల్ల బాల్రెడ్డి అనే రైతు తన ధాన్యాన్ని రేబర్తి-వంగపల్లి గ్రామాల మధ్యలో ఓ కల్వర్టుపైన ఆరబెట్టగా మంగళవారం వర్షానికి ధాన్యం కల్వర్టులో కొట్టుకుపోయింది.
వరికోసిన తర్వాత ధాన్యాన్ని ఆరబెట్టేందుకు కల్లాలు లేక ఓ కల్వర్టు వద్ద ధాన్యాన్ని ఆరబెట్టిన. ఒక్కసారిగా వర్షం రావడంతో రెండు ట్రాక్టర్ల ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకు పోయింది. ధాన్యం వర్షానికి కొట్టుకుపోవ డంతో నాకు సుమారు రూ. 60వేల నష్టం వాటిల్లింది. పంట నీటిపాలై నష్టపోయిన తనను ప్రభుత్వం ఆదుకోవాలి.
– నల్ల బాల్రెడ్డి, రైతు, రేబర్తి, మద్దూరు (సిద్దిపేట జిల్లా)