చేర్యాల, జూలై 2: సిద్దిపేట జిల్లా చేర్యాల కేంద్రంగా 6420 పైగా యూరియా బస్తాలు పక్కదారి పట్టిన వైనం ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ విషయమై జూన్ 19న ‘నమస్తే తెలంగాణ’లో ‘నిబంధనలు ఉల్లంఘించి యూరియా విక్రయం’ అనే కథనం ప్రచురించింది. అనంతరం సమగ్ర కథనాన్ని ఈనెల 2న యూరియా మాయంపై నమస్తే తెలంగాణలో ప్రచురించింది. దీంతో సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతితో పాటు వ్యవసాయశాఖ అధికారులు స్పందించారు.
6420 బస్తాలు మాయం చేస్తే పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్న ఏవో భోగేశ్వర్ను గురువారం కలెక్టర్ హైమావతి సస్పెండ్ చేశారు. కొన్ని రోజులుగా చేర్యాల ప్రాంతంలో యూరియా బస్తాల విక్రయాలు, అధిక ధరలకు రైతులకు అంటగడుతున్న విషయాలను ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తీసుకొస్తుండడంతో జిల్లావ్యాప్తంగా వ్యవసాయ శాఖాధికారులతో పాటు ఫర్టిలైజర్ షాపుల నిర్వాహకులు ఆందోళనకు గురవుతున్నారు. చేర్యాలోని సాయిశివ డీలర్ సందీప్‌రెడ్డిపై కేసు నమోదు, సిద్దిపేటలోని ఆంజనేయ ట్రేడర్స్, గణేశ్ ట్రేడర్స్ ఫర్టిలైజర్ లైసెన్స్‌లను వ్యవసాయశాఖ రాష్ట్ర డైరెక్టర్ రద్దు చేశారు.
డీలర్లు ఇష్టారాజ్యంగా అధిక ధరలకు విక్రయిస్తున్న విషయం వెలుగులోకి రాగానే వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి విచారణ ప్రారంభించారు. అనంతరం ఏవో పులి భోగేశ్వర్ చేర్యాల పోలీస్‌స్టేషన్‌లో యూరియా బస్తాల విషయమై ఫిర్యాదు చేశారు. వ్యవసాయ శాఖ అధికారులతో పాటు పోలీస్‌శాఖ ప్రత్యేకంగా విచారణ చేపట్టి ఎట్టకేలకు యూరియా మాయం చేసిన డీలర్ల లైసెన్స్‌ను రద్దు చేసి, ఒకరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించారు.
యూరియా బస్తాల మాయం విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పందించి సదరు డీలర్లపై చర్యలు తీసుకుని, కేసు నమోదు చేయించినట్లు ప్రకటించారు. సిద్దిపేట జిల్లాకేంద్రంలో కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా, డివిజన్ స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి చేర్యాలలో జరిగిన యూరియా కుంభకోణంపై ప్రత్యేకంగా సమీక్షించినట్లు తెలిసింది.
చేర్యాలలో ఏడీఏ స్థాయి అధికారి ఉండగా, 6420 పైగా బస్తాలు ఏ విధంగా మాయమయ్యాయనే విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంపై స్థానికంగా చర్చనీయాంశమైంది. జిల్లా స్థాయి అధికారులు కేవలం ఏవోను సస్పెండ్ చేసి చేతులు దులుపుకొన్నారని, యూరియా మాయం చేసిన వారికి ఏడీఏ సహకారం ఉన్నదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏవోగా, ఏడీఏగా చాలా ఏండ్లుగా చేర్యాలలో విధులు నిర్వహిస్తున్నారని, ఒక్కరిద్దరు ఫర్టిలైజర్ షాపుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
సస్పెన్షన్‌కు గురైన ఏవో భోగేశ్వర్ రైతుబీమా కోసం దరఖాస్తు చేసుకునే వారి వద్ద వేలాది రూపాయలు వసూలు చేశాడని, సబ్సిడీ యంత్రాలు, షాపుల నిర్వాహకుల పత్రాలపై సంతకాలు చేయాలంటే డబ్బులు వసూలు చేసే వారని పలువురు బహిరంగంగానే చెబుతున్నారు. చేర్యాలలో జరిగిన యూరియా కుంభకోణంలో చేర్యాల అధికారులతో పాటు సిద్దిపేటకు చెందిన అధికారుల పాత్ర ఉన్నట్లు జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. యూరియా కుంభకోణంలో వచ్చిన డబ్బులను డీలర్ల దగ్గర నుంచి మొదలుకుని అధికారులు పంచుకున్నట్లు పోలీసులకు ఉప్పు అందండంతో ఒక ప్రత్యేక బృందం రహస్యంగా విచారణ ప్రారంభించినట్లు తెలిసింది.
చౌటకూర్, జూలై 2: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని శివంపేటలో డీఏపీ ఎరువును అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ రైతులు డీసీఎంఎస్ రైతు సేవా కేంద్రం ఎదుట బైఠాయించారు. గురువారం 500 బస్తాల ఐపీఎల్ డీఏపీ ఎరువుల లోడుతో లారీ వచ్చింది. దీంతో చుట్టుపకల గ్రామాల రైతులు భారీగా తరలివచ్చారు. ఐపీఎల్ డీఏపీ బస్తా రూ.1,350 ఉండగా, రైతు సేవా కేంద్రం నిర్వాహకుడు రూ.1,800లకు విక్రయిస్తున్నాడు.
ఒకో బస్తాపై అదనంగా రూ.450 తీసుకుంటున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. రూ.1,800లకు విక్రయిస్తే రసీదు ఇవ్వాలని కోరగా, రూ.1.350లకే ఇస్తానని నిర్వాహకుడు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది సొంతంగా డబ్బులు చెల్లిస్తే లోడు డీపీఏ బస్తాలను తెప్పించానని, ఇతర రైతులకు అందజేసేదిలేదంటూ నిర్వాహకుడు విజయ్‌కుమా ర్ మొండికేశారు. ప్ర భుత్వ సబ్సిడీ ఎరువులను నిజమైన రైతుల కు అందజేయకుండా, ఇతర ప్రైవేట్ వ్యక్తులకు సరఫరా చేస్తున్నారంటూ ఆరోపించారు.
నిర్వాహకుడు ఇష్టానుసారంగా వ్యవహరిసున్నారని రైతులు నిరసన తెలిపారు. పురుగు మందులు, పత్తి విత్తనాల ప్యాకెట్లు, ఇతర రసాయన ఎరువుల బస్తాలను అధిక ధరలకు విక్రయిస్తూ దోపిడీ చేస్తున్నారంటూ రైతులు గగ్గోలుపెట్టారు. ఎరువుల లోడు లారీని మరో గ్రామంలోని రైతుల కోసం తెప్పించానని, ఆ లారీని ఇకడి నుంచి పంపిస్తానని నిర్వాహకుడు చెప్పడంతో ఆగ్రహం చెందిన రైతులు మూకుమ్మడిగా ఎరువుల దుకాణంలోకి చొరబడి నిర్వాహకుడు విజయ్‌కుమార్‌ను నిలదీస్తూ, లారీకి అడ్డుగా కూర్చుని నిరసన తెలిపారు. కొంతమంది రైతులు ఏవో ప్రవీణకు సమాచారం అందించగా, ఆమె వెంటనే శివంపేటకు చేరుకున్నారు. రైతు సేవాకేంద్రం నిర్వాహకుడితో మాట్లాడి రైతులకు రూ. 1,350లకు ఎకరాకు రెండు బస్తాల చొప్పున ఎరువు పంపిణీ చేయాలని సూచించారు. చేసేది లేక దుకాణ నిర్వాహకుడు ఎంఆర్పీకి బస్తాలను విక్రయించడంతో ఆందోళన విరమించారు.
చేర్యాల, జూలై 2: యూరియా కుంభకోణంలో లోతుగా విచారణ చేస్తున్నామని, ఇందులో ప్రమేయం ఉన్నవారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిద్దిపేట కలెక్టర్ కె.హైమావతి ప్రకటించారు. గురువారం కలెక్టరేట్లో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో యూరి యా పంపిణీలో అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చేర్యాలలోని శ్రీసాయిశివ ఫర్టిలైజర్ షాపులో యూరియా సరఫరాలో అక్రమాలు జరిగినట్లు తన దృష్టికి వచ్చిందని, వెంటనే విచారణ చేయించినట్లు తెలిపారు.
ప్రాథమిక విచారణలో శ్రీ సాయి శివ ఫర్టిలైజర్ షాప్ నిర్వాహకుడు సందీప్‌రెడ్డి ఈ-పాస్ మిషన్ ద్వారా హోల్‌సేల్ డీలర్స్ నుంచి 6429 బ్యాగు ల యూరియాను తీసుకుని దాన్ని కన్ఫర్మేషన్ చేయకుండా, అతనే రైతుల పేర్లను రైతుల ఆధార్‌కార్డు ఆధారంగా సేల్ చేసినట్లు చూపించి అక్రమాలకు పాల్పడినట్లు తెలిసిందన్నారు. ఆతనిపై ఎంక్వయిరీ చేయించి, పోలీస్ కేసు నమోదు చేయడంతో పాటు అరెస్టు చేసినట్లు తెలిపారు. అతని లైసెన్స్ రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
సిద్దిపేట అర్బన్ మండలంలోని ఆంజనేయ ఫర్టిలైజర్స్, గణేశ్ ట్రేడర్స్ నుంచి ఇతనికి యూరియా బ్యాగులు సరఫరా జరిగిందన్నారు. యూరియా డైవర్షన్, అక్రమాలు జరుగుతున్న పర్యవేక్షణ చేయని ఏవో భోగేశ్వర్ స్వామి వెంటనే విధుల్లో నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. రైతులకు యూరి యా సబ్సిడీతో పంపిణీ చేసేందుకు వస్తుందని, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ప్రకారం అక్రమాలకు ఎవరు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
గజ్వేల్, జూలై2: యూరియాను యాప్ ద్వారానే బుక్ చేసుకోవాలని ప్రభు త్వం చెబుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంత రైతులకు మొబైల్ ఆపరేటింగ్ తెలియకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. యాప్‌లో బుక్ చేసుకున్న రైతులకు యూరియా ఇవ్వకుండా ఏదో కుంటి సాకులు చెబుతు ట్రేడర్స్ నిర్వాహకులు తప్పించుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని రిమ్మనగూడకు చెందిన రైతు బిందే బాల్‌రాజు యాప్ ద్వారా యూ రియా బుక్ చేసుకున్నా, గంటల వ్యవధిలోనే తనకు వచ్చిన మెసేజ్ ప్రకారం గజ్వేల్‌లోని శ్రీనివాస్ ఆగ్రో ట్రెడర్స్ వద్దకు వెళ్లాడు.
తమ వద్ద యూరియా లేదంటూ ట్రేడర్స్ నిర్వాహకులు సమాధానం చెప్పారు. మరోసారి యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని చెప్పి తప్పించుకున్నారు. దుకాణంలో యూరియా ఉంటేనే యాప్‌లో చూపిస్తుందని అధికారులు చెప్పుతుండగా, దుకాణాదారులు మాత్రం తమ వద్ద లేదంటూ చేతులు ఎత్తేస్తున్నారు. యూరియా పంపిణీలో నిర్లక్ష్యపు సమాధానం చెబుతూ తప్పించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నా యి. యాప్‌తో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. వ్యాపారులు అధిక ధరలకు యూరియాను విక్రయి స్తూ, సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.