
మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 29 : పురపాలక పరిపాలన శాఖ చేపట్టిన భువన్ అసెస్మెంట్, జియోట్యాగింగ్ మెదక్ మున్సిపాలిటీలో ముమ్మరంగా కొనసాగుతున్నది. పట్టణాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపడుతున్నది. మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో అనుమతులు లేకుండా ఇండ్లు, వాణిజ్య సముదాయాలను చేపట్టడంతో పాటు గతంలో నిర్మించిన గృహ సముదాయాలు, వాణిజ్య సముదాయాలను విస్తరించినప్పటికీ పాత ఆస్తిపన్నునే చెల్లిస్తున్నారు. దీంతో బల్దియాలకు ఏటా లక్షల పన్నును ప్రజలు ఎగకోడుతున్నారు. వీటి అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటా భువన్ సర్వే చేపట్టింది. ఈ సర్వే ఆధారంగా ఇండ్ల కొలతలను భువన్ యాప్‌లో పక్కాగా పొందుపరుస్తున్నారు. ప్రతి ఇంటి నంబర్ ఆధారంగా సెల్‌ఫోన్, ట్యాబ్‌ల్లో ఇంటి ఫొటో తీస్తూ రేఖాంశాల ఆధారంగా యాప్‌లో అప్లోడ్ చేస్తున్నారు. అధికారులు సిబ్బంది చేపట్టిన సర్వేను జియోట్యాగింగ్ ఆధారంగా శాటిలైట్ విధానంతో ఉన్నతాధికారులు ప్రస్తుతం ఉన్న ఇంటి కొలతలు సరైనవో కాదో పర్యవేక్షణ చేస్తున్నారు. దీంతో అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.
50 శాతం పైగా ఇండ్లకు జియో ట్యాగింగ్ పూర్తి..
భువన్ యాప్‌లో ఇండ్లకు సంబంధించిన సమాచారం జియోట్యాగింగ్ చేయడంలో మున్సిపల్ అధికారులు నిమగ్నమయ్యారు. మెదక్ మున్సిపాలిటీలో 11,872 ఇండ్లు(అసెస్మెంట్లు)ఉండగా, ఇప్పటి వరకు 6,500 ఇండ్లకు సంబంధించిన సమాచారాన్ని జియోట్యాగింగ్ పూర్తిచేశారు. మరో 5,372 ఇండ్లకు సంబంధించిన సర్వే కొనసాగుతున్నది.
ప్రతి మున్సిపాలిటీలో ప్రత్యేక టీంలు
జిల్లాలోని మెదక్, తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో ఇండ్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఈనెలఖారుకు వరకు జియోట్యాగింగ్ చేయాలన్నది మున్సిపల్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశం. అందుకు తగ్గట్టుగా మున్సిపాలిటీల్లో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి ఇండ్లకు సంబంధించి సర్వే చేపడుతున్నారు. ఇందులో భాగంగా మున్సిపల్ పరిధిల్లోని ప్రతిఇంటికి సంబంధించిన ఎంత విస్తీరణంలో ఇంటి నిర్మాణం చేపట్టారు, ఎన్ని అంతస్థులు, ఖాళీ స్థలం ఎంత ఉన్నది.. కొలతలు చేసి నమోదు చేయడంతోపాటు భువన్ యాప్‌లో ఆప్‌లోడ్ చేస్తారు. ఇల్లు, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారా, గృహవసరాలకు వినియోగిస్తున్నారా తదితర అం శాలు సైతం పొందుపరుస్తున్నారు. జీపీఎస్ లొకేషన్ సైతం షేర్ చేస్తారు. జియోట్యాగింగ్ ద్వారా భువన్ యాప్‌లో సంబంధిత ఇంటి నంబర్ టైప్ చేస్తే పూర్తి వివరాలు అందులో తెలుస్తాయి. మున్సిపాలిటీ మొదలుకొని రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల వరకు ఈ విషయం తెలుసుకునేందుకు వీలుంటుంది.
30 వరకు గడువు..
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 30 వరకు సర్వేను పూర్తి చేయాలని అధికారులు మున్సిపల్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. గడువులోపు సర్వే పూర్తికానందును సర్వేను పెంచే అవకాశాలు ఉన్నట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.