
అందోల్, సెప్టెంబర్ 21 : టీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్యకారులు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వారికి అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తున్నదని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. మంగళవారం అందోల్ పెద్దచెరువులో రూ.34,05,600 విలువ గల లక్షా 98వేల చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మత్స్యకారుల సంక్షేమంపై దృష్టి పెట్టిందన్నారు. చెరువులు, కుంటలో చేపపిల్లలు వదలడంతో పాటు వాటిని పెంచేందుకు ఉచితంగా దాణా, వలలు అందజేస్తున్నదన్నారు. చేపలను విక్రయించి ఉపాధి పొందేందుకు ద్విచక్రవాహనాలు, ఆటోలు అందజేసిందన్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటల్లో చేప పిల్లలను పెద్ద సంఖ్యలో వదిలేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అనంతరం స్థానిక నేతలు, మత్స్యకార సంఘం సభ్యులతో కలిసి గంగపుత్ర సొసైటీ కమ్యూనిటీహాల్‌కు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి సతీష్, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, వైస్ చైర్మన్ ప్రవీణ్, ఏఎంసీ చైర్మన్ మల్లికార్జున్, ఎంపీపీ బాలయ్య, జడ్పీటీసీ రమేశ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేశం, మాజీ ఎంపీపీ రామాగౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ నాగభూషణం, మున్సిపల్ కౌన్సిలర్లు, మత్స్యకార సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ప్రభుత్వంపై విమర్శలు సరికావు..
దేశవాప్యంగా డ్రగ్స్ విషయంలో చర్చలు జరుగుతున్న తరుణంలో అధికార పార్టీ నేతలపై కాంగ్రెస్ నేతలు నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో జరిగిన ఘటనను గుర్తు చేస్తూ అక్కడి నుంచే కాంగ్రెస్ నేతలు వైట్ ఛాలెంజ్ ప్రారంభించాలని సవాల్ విసిరారు. డ్రగ్స్ వ్యవస్థను రూపుమాపాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని, కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాదకద్రవ్యాలు ఎక్కువగా ఉన్న రాష్ర్టాల్లో మన రాష్ట్రం 18వ స్థానంలో ఉన్నదన్న విషయాన్ని తెలియకుండా మాట్లడడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ నేతలపై కేంద్రమంత్రి సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఆరోపణలు మరిచి పోయారా? అని గుర్తు చేసిన ఎమ్మెల్యే, ఈ విషయంలో రాహుల్‌గాంధీ తప్పు చేయకుంటే వారిని టెస్టులకు తీసుకురావాలని, కేటీఆర్ సైతం ఎక్కడికంటే అక్కడికి వస్తారని దమ్ముంటే తమ ఛాలెంజ్‌కు స్వీకరించాలన్నారు.