సిద్దిపేట, జులై 2 : ప్లాస్టిక్ కవర్లు వాడితే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ రవీందర్‌రెడ్డి హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడంతో ఆదివారం సిద్దిపేట పట్టణంలోని పలు హోటళ్లు, షాపింగ్ మాల్స్, బేకరీల్లో మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముస్తాబాద్ చౌరస్తాలో గల టిఫిన్ సెంటర్‌ను పరిశీలించారు.
రిలయన్స్ మార్ట్‌లో తనిఖీలు నిర్వహించి సింగిల్ యూజ్ కవర్లు వాడుతుండడంతో యాజమాన్యానికి రూ.5 వేల జరిమానా విధించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ హోటళ్ల వద్ద పార్సిల్‌కు స్టీల్ డబ్బాలు తెచ్చుకోవాలని బ్యానర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్లాస్టిక్ రహిత సిద్దిపేట కోసం అందరూ సహకరించాలని కోరారు. కమిషనర్ వెంట అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్, అధికారి ఐలయ్య ఉన్నారు.
హుస్నాబాద్‌టౌన్, జూలై 3 : ప్లాస్టిక్ వస్తువుల నిషేధంపై మున్సిపల్ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ కవర్లను ప్రభు త్వం నిషేధించిన తరుణంలో వాటిని విక్రయించే వారిపై అధికారులు దాడులు నిర్వహించి జరిమానాలు విధిస్తున్నారు.
ఆదివారం పట్టణంలోని మటన్, చికెన్ దుకాణాల్లో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్న శ్రీరాజరాజేశ్వర, ఎంఏ అలీ, ఎండీ ఉస్మాన్ మటన్, చికెన్ దుకాణాల్లో దాడులు నిర్వహించి యజమానులకు రూ.500 చొప్పున జరిమానాలు విధించారు. వారి వెంట మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.