మెదక్, అక్టోబర్ 31(నమస్తే తెలంగాణ): ప్రజల వినతులను సత్వరమే పరిష్కరించాలని మెదక్ డీపీవో తరుణ్‌కుమార్ సూచించారు. డీఎస్వో శ్రీనివాస్‌తో కలిసి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదులను సోమవారం స్వీకరించారు. భూమి పట్టా మార్పిడి, సర్వే, ధరణిలో మార్పులు, పోడు భూముల సమస్యలతో పాటు పింఛన్లు, డబుల్‌బెడ్ రూమ్ ఇండ్ల మంజూరు, అంగన్వాడీ టీచర్ పోస్టు కావాలని 63 దరఖాస్తులు వచ్చాయి.
ఇందులో ఆసరా పింఛన్లకు సంబంధించి 15, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కావాలని 10 దరఖాస్తులు, మిగతావి భూ సమస్యలు, తదితర శాఖలకు సంబంధించినవి ఉన్నాయి. తూప్రాన్ మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన పరశురాములుకు మూడు చక్రాల సైకిల్ అందజేశారు. కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకుడు గంగయ్య, హార్టికల్చర్ ఏడీ నర్సయ్య, ఏడుపాయల ఈవో శ్రీనివాస్, సీపీవో కాసిం, అదనపు డీఆర్డీవో భీమయ్య, నీటిపారుదల శాఖ ఈఈ శ్రీనివాస్‌రావు, డీఎంహెచ్‌వో విజయనిర్మల, అగ్నిమాపక అధికారి అమరనాథ్‌గౌడ్, కలెక్టరేట్ ఏవో యూనూస్, సూపరింటెండెంట్ బలరాం తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 31: ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి 45 అర్జీలు వచ్చాయి. కలెక్టర్ శరత్‌కు అర్జీలు అందజేసి వాటిని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజావాణికి వచ్చే అర్జీలను పరిష్కరించడంపై చొరవ చూపాలని అధికారులకు సూచించారు. అర్జీల్లో ఎక్కువగా పింఛన్, భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు ఉన్నాయి. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి రాధికా రమణి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.