మెదక్‌రూరల్,సెప్టెంబర్12: సమతుల్యమైన ఆహారాన్ని అందించినప్పుడే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని మెదక్ కలెక్టర్ హరీశ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సీడీపీవోలు, అంగన్వాడీ సూపర్వైజర్లకు పోషణ్ అభియాన్‌పై కార్యాక్రమాన్ని ఏర్పాటుచేశారు. అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా మహిళా సంక్షేమా అధికారి బ్రహ్మజీతో కలిసి పోషణ్ అభియాన్ గోడ పత్రికను సోమవారం ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారుల్లో ఎదుగుదల లేకపోవడం, పోషకాహారలేమితో తక్కువ బరువు ఉన్న శిశువు జన్మిస్తారన్నారు. గర్బిణులు, బాలింతలు, బాలికల్లో రక్తహీనత లోపం తగ్గించడమే లక్ష్యంగా జాతీయ పోషకాహార కార్యక్రమాన్ని పోషణ్ అభియాన్ చేపట్టబడిందన్నారు. సెప్టెంబర్‌ను పోషణ్ మాసంగా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో 5 ఏండ్లలోపు 52,300మంది చిన్నారులు ఉన్నారని, అందులో తీవ్ర లోప పోషణతో 2,344 మంది, 5.32 శాతం, అతి తీవ్ర పోషణ లోపంతో 215 మంది 1.85 శాతం ఉండడం బాధకరమన్నారు.
అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు కష్టపడి పని చేయాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి నెలా అంగన్వాడీ టీచర్లతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని వారి పరిధిలోని గృహిణులను సందర్శించి, రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలు, కిశోర బాలికలు, నవజాత శిశువులను గుర్తించాలన్నారు. వారు సంతులిత ఆహారం తీసుకునేలా ప్రత్యేక కార్యాచరణ అమలుచేయాలన్నారు. కేంద్రాల్లో గుడ్లు, పాలు, బాలామృతం, మధ్యాహ్న భోజనం, చిరుతిళ్లు అందిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నా, కొంతమంది పోషకాహార లోపంతో ఇబ్బందులు పడుతున్నారు. కిశోర బాలికలకు ఆరోగ్య సంబంధ అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రం చుట్టూ 6 చెట్లు నాటాలన్నారు. సీడీపీవోలు హేమభార్గవి, అంగన్వాడీ సూపర్వైజర్లు, పోషణ్ అభియాన్ సిబ్బంది పాల్గొన్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 12: పోషణ మాసం సందర్భంగా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో షెడ్యూలు ప్రకారం అవగాహన కార్యక్రమం నిర్వహించాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ స్పష్టంచేశారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పోషణ మాసం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అంగన్వాడీ కేంద్రంలో జామ, నిమ్మ, బత్తాయి, మామిడి, బొప్పాయి వంటి పండ్లు, కూరగాయల మొక్కలు నాటాలన్నారు. స్పెషల్ గ్రోత్ డ్రైవ్ నిర్వహించి జిల్లాలోని అతి తీవ్రలోపం పోషణ గల పిల్లలను గుర్తించి, వారిని సాధారణ స్థితిలోకి తీసుకొచేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీడబ్ల్యూవో పద్మావతి, డీఎం అండ్ హెచ్‌వో గాయత్రీదేవి పాల్గొన్నారు.