
మెదక్, అక్టోబర్ 1 : మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతిఒక్కరూ పర్యాటక ప్రదేశాలను సందర్శించాలని మెదక్ కలెక్టర్ హరీశ్ అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో చారిత్రక ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలు, పుణ్య క్షేత్రాలపై రూపొందించిన కరపత్రాన్ని శుక్రవారం తన చాంబర్లో డీఆర్డీవో, పర్యాటక అధికారి శ్రీనివాస్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లాలో పర్యాటకులను ఆకర్షించడానికి పలు ప్రదేశాలున్నాయన్నారు. వారాం త సెలవుల్లో హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు నర్సాపూర్ అర్బన్ పార్కుకు వస్తున్నారన్నారు. ఏడుపాయల దుర్గభవానీ, మెదక్ చర్చి, ఖిల్లా, పోచారం డ్యాం, అభయారణ్యం సందర్శించేలా ఒక సర్క్యూట్‌ను రూపొందించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో పర్యాటక రంగ అభివృద్ధి చెందడంతోపాటు పలువురికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రాబోయే భావితరాలకు సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రను టూరిజం ద్వారా తెలుపవచ్చన్నారు.
ఓటరు హెల్ప్‌లైన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి
ప్రతిఒక్కరూ తమ మొబైల్లో ఓటరు హెల్ప్‌లైన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఓటరు హెల్ప్‌లైన్ యాప్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ రూపొందించిన గోడ పత్రికను స్వీప్ నోడల్ అధికారి రాజిరెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యాప్ ద్వారా ఓటర్ల వివరాలు, ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతిఒక్కరూ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని ఓటరుకు ఉన్న సదుపాయాలు, సేవలు తెలుసుకొని ఎన్నికల వేళ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో అదనపు డీఆర్డీవో బీమయ్య, డీపీఆర్వో శాంతికుమార్, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ చంద్రశేఖర్, కలెక్టరేట్‌కు చెందిన ఎన్నికల పర్యవేక్షకులు శైలేందర్, మమత పాల్గొన్నారు.