
చిన్నకోడూరు, నవంబర్ 22 : సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే పట్టు రైతులు ఎక్కువగా సంపాదిస్తున్నారు. సాధారణంగా ఏ పంట వేసినా 3 నెలలు లేదా 6 నెలలకో దిగుబడి వస్తుంది. కానీ, నెలలోపే పంట పూర్తయి వేల నుంచి లక్ష రూపాయల వరకు డబ్బును ఆర్జిస్తున్నారు. మార్కెట్లో పట్టుగూళ్లకు మంచి డిమాండ్ ఉండడంతో ఆ దిశగా రైతులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రోత్సహిస్తున్నారు. షెడ్ల నిర్మాణానికి రైతులకు సబ్సిడీ అందించేందుకు మంత్రి హరీశ్‌రావు రూ.2 కోట్లు మంజూరు చేయించారు. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ చొరవతో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని రైతులు లాభాల బాట పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక నీటి వనరులు సమృద్ధిగా పెరగడం, ప్రభుత్వ పరంగా పట్టు రైతులకు ప్రోత్సాహం లభిస్తుండడంతో అధిక మంది రైతులు ‘పట్టు సాగు’కు మొగ్గుచూపుతున్నారు. కిలో పట్టుగూళ్లపై రూ.50 ఇన్సెంటివ్ ఉండగా ప్రభుత్వం దానిని రూ.75 పెంచింది. చంద్లాపూర్‌లో ఇప్పటికే వందల ఎకరాల్లో సాగు చేస్తుండగా గంగాపూర్, మైలారం, గోనెపల్లితో పాటు నారాయణరావుపేట, సిద్దిపేట రూరల్, సిద్దిపేట అర్బన్ మండలాల పరిధిల్లోనూ పలువురు యువరైతులు ముందుకు వచ్చారు. పట్టు పరిశ్రమ శాఖ అధికారులు ఇటీవల మూడు రోజుల పాటు శిక్షణ ఇప్పించి సాగు నుంచి మొదలుకొని పట్టుగూళ్లు అమ్ముకునే వరకు వివిధ అంశాలపై శాస్త్రవేత్తలతో మెళకువలు నేర్పించారు. ప్రభుత్వం, పట్టుపరిశ్రమ శాఖ సూచనల మేరకు వరికి బదులు ప్రత్యామ్నాయంగా పట్టు సాగు చేస్తూ పలువురు రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు.
పట్టుతోట సాగు ఇలా..
తెలంగాణలో పట్టు పురుగుల పెంపకానికి అనుకూల వాతావరణం ఉందని ఇప్పటికే స్పష్టమైంది. ఈ ప్రాంతంలో రంగనాయకసాగర్ రిజర్వాయర్‌ను నిర్మించడంతో మల్బరీ సాగుకు కావాల్సినంత నీరు పుష్కలంగా లభిస్తున్నది. గతంలో నీరు లేకపోవడంతో పట్టు సాగుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం బోరు బావుల్లో భూగర్భ జలాల స్థాయి బాగా పెరగడంతో పట్టు సాగుపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. 2 ఎకరాల్లో మల్బరీ సాగును ఇద్దరు భార్యభర్తలు చేసుకోవచ్చు. ఇందుకు 2 ఎకరాల భూమి సరిపోతుంది. మొదట భూమిని బాగా దున్ని, చదును చేసుకోవాలి. ఆ తరువాత మల్బరీ కట్టెను కటింగ్ చేసి ఉంచుకోవడం లేదా నర్సరీ నుంచి మల్బరీ మొక్కలు తెచ్చుకోవాలి. పొడవు సాళ్లలో మొక్కమొక్కకు 2 ఫీట్లు, అడ్డంలో 4 ఫీట్ల స్థలాన్ని వదిలేసి పెట్టుకోవాలి. ఎకరానికి 5 వేల మొక్కలు అవసరమవుతాయి. 2 ఎకరాలకు 10 వేల మొక్కలు పెట్టాల్సి ఉంటుంది. తరువాత 4 నుంచి 5 నెలల్లో కోతకు వస్తుంది. ఒకసారి పట్టుతోట పెట్టుకున్నట్లయితే 20 సంవత్సరాల వరకు సాగు చేసుకోవచ్చు. కలుపుతీత పనులకు ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. పవర్ ట్రిల్లర్ మిషన్‌తో ఏ ఇబ్బందులు లేకుండా రైతులు కలుపు తీయడంతో పాటు తోట కటింగ్ కూడా చేస్తున్నారు. యంత్రాల వినియోగంతో రైతులకు శ్రమ కూడా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో ఈ పంటల సాగుకు అనుకూల వాతావరణం ఉంది.
షెడ్డు నిర్మాణం తప్పనిసరి..
ఈ ప్రక్రియలో ఎక్కువ ఖర్చు అయ్యేది షెడ్డు నిర్మాణానికే. ఒక్కసారి పెట్టుబడి పెడితే ఆ తరువాత ఎక్కువ ఖర్చేమీ ఉండదు. షెడ్డుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. సుమారు రూ.6 లక్షల వరకు ఖర్చైతే వివిధ రకాలుగా రూ.3 లక్షల వరకు సబ్సిడీ వస్తుంది. 20 ఫీట్ల వెడల్పు, 50 ఫీట్ల పొడవుతో గోడలు కట్టాలి. రెండు వైపులా 12 ఫీట్ల ఎత్తు.. మధ్యలో 15 ఫీట్ల ఎత్తుతో తూర్పు పడమర దిశలో షెడ్డును నిర్మించాలి. అన్ని వైపులా కిటికీలు ఏర్పాటు చేసుకోవాలి. వీలైనంత గాలి వచ్చి వెళ్లేలా చూసుకోవాలి. దీంతో పురుగులకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
తేలిక పంట.. నెలలో 21 రోజులే రైతులకు పనిపట్టుతోట పెరిగి కోత దశకు రాగానే ముందుగా గుడ్లను బుక్ చేసుకోవాలి. 100 గుడ్లకు రూ.800 ఖర్చవుతుంది. ఇవి బెంగళూర్ నుంచి వస్తాయి. తెచ్చిన గుడ్ల్లపై నల్లని బట్ట కప్పి ఉంచాలి. అవి పగిలాయో లేదో తెలుసుకునేందుకు శాంపిల్‌గా కొన్ని గుడ్లను అగ్గిపెట్టెలో వేసి పరిశీలిస్తూ ఉండాలి. ఇందులో 50 శాతం వరకు పిల్లలు బయటకు వచ్చినప్పుడే నల్లటి బట్ట తీసి మొత్తం గుడ్లను లైట్ వెలుతురులో పెట్టాలి. అలా చేస్తే మొత్తం 90 శాతం పురుగులు బయటకు వస్తాయి. వాటిని చిన్న ట్రేలో వేసి వాటిపై నైలాన్ నెట్ కప్పి లేత ఆకులు చిన్నగా తరిగి నెట్‌పై వేయాలి. దీంతో పురుగులు నెట్పైన ఆకును ఆహారంగా తీసుకుంటాయి. ఇలా 3 నుంచి 4 రోజులు ఆహారం తీసుకొని మొదటి దశకి వస్తాయి. అంటే 24 గంటల పాటు నిద్రావస్థలో ఉంటాయి. ఈ సమయంలో ఏమి తినలేవు, కదలలేవు. నిద్ర నుంచి లేవగానే విజేత పౌడర్ చల్లి అరగంట తరువాత లేత ఆకులు మాత్రమే వేయాలి. మరో 2 నుంచి 3 రోజుల వరకు రెండో దశలోకి వెళ్తాయి. ఇదే పద్ధతిలో మూడు, నాల్గవ దశల్లోకి వస్తాయి. ఇలా 6, 7 రోజుల వరకు ఆహారం తీసుకుంటాయి. ఆ తరువాత పురుగులన్నీ పట్టుగూళ్లు అల్లుకోవడానికి సిద్ధమవుతాయి. ఈ సమయంలో ఆకు వేయడం ఆపేసి పురుగులపై చంద్రికలు వేయాలి. 2,3 రోజుల వరకు గూళ్లు తయారవుతాయి. 5,6 రోజుల వరకు చంద్రికల నుంచి వేరు చేసి శుద్ధి చేయా లి. 7 లేదా 8 వ రోజున మార్కెట్లో విక్రయించుకోవాలి. పురుగులు పెరిగినా కొద్ది విశాలంగా ఉండేలా ఒక ట్రే నుంచి రెండు ట్రేలు ఇలా పెంచుకుంటూ పోవాలి. ఈ ప్రక్రియ అంతా నెలలోపు పూర్తవుతుంది. నెల పంట అయినప్పటికీ ఇందులో 4 సార్లు నిద్రావస్థ, గూడు అల్లుకునే సమయంలో 5 రోజులు రైతులకు ఎలాంటి పని ఉండదు. అంటే కేవలం రైతులు 21 రోజులే పనిచేయాల్సి ఉంటుంది.
సబ్సిడీ ఇలా..
షెడ్డు నిర్మాణం పూర్తయిన తరువాత ఓసీ, బీసీలైతే రూ.2లక్షల వరకు సబ్సిడీ వస్తుంది. మొక్కల పెంపకానికి రూ.25 వేలు వస్తుంది. అదే ఎస్సీ, ఎస్టీలైతే షెడ్డుకు రూ.2.60 లక్షలు, మొక్కల పెంపకానికి రూ.32,500 వస్తాయి. అలాగే, 300 చంద్రికలు, 10 ట్రేలకు 50 శాతం రాయితీ వర్తిస్తుంది. ఏడాది ఒకసారి విజేత, అస్రా, బ్లీచింగ్, సున్నానికి రాయితీ లభిస్తుంది. ఉపాధిహామీ నుంచి అయితే షెడ్డుకు రూ.90 వేలు వస్తాయి. 2 ఎకరాల్లో మొక్కల మెయింటెనెన్స్‌కు రూ.40 వేలు అందుతాయి.
ఫలితమిచ్చిన శిక్షణ..
పట్టు సాగులో పాటించాల్సిన మెళకువలపై ఇటీవల చంద్లాపూర్ రైతువేదికలో పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో సుమారు 40 మంది రైతులను బస్సులో హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వ విద్యాలయానికి తీసుకెళ్లి నైపుణ్య శిక్షణ ఇప్పించారు. తక్కువ ఖర్చు తో షెడ్డు ఎలా నిర్మించాలి, పట్టు తోట పెంపకంతో పాటు ఎరువులను ఎలా తయారు చేసుకోవాలి తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సెంట్రల్ సిల్క్ బోర్డు, ప్రాంతీయ పట్టు పరిశోధనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త ప్రవీణ్‌కుమార్ రైతులకు సులభంగా అర్థమయ్యే విధంగా శిక్షణ ఇచ్చారు. అలాగే శాస్త్రవేత్తలు రాజు, వినోద్, ఉమ్మడి జిల్లా ఏడీ ఇంద్రసేనారెడ్డి (ఎఫ్ఎస్సీ), ఎస్వో శర్మ, ఏఎస్వో లింగ ం, ఏఈవో ప్రవీణ్ రైతులకు మూడు రోజుల పాటు శిక్షణ ఇప్పించి ‘పట్టు పరిశ్రమ సాంకేతిక విజ్ఞాన దీపిక’ అనే పుస్తకంతో పాటు టెంపరేచర్ మిషన్, ఒక బ్యాగు, సర్టిఫికెట్లను రైతులకు అందించారు.
ఈ రైతులు ఆదర్శం
రైతులు పెద్దోల్ల నర్సింహులు, పెద్దోల్ల ఐలయ్య పట్టు పురుగుల సాగులో అపార అనుభవం పొందారు. ఇప్పటికే మంచి దిగుబడులు సాధించి నెలకు లక్ష రూపాయల ఆదాయం ఆర్జించారు. వారి అనుభవాలను తోటి రైతులకు వివరిస్తూ కొత్త వారిని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో అవార్డు తీసుకున్నారు. వారి వద్దకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి పట్టు పురుగుల పెంపకంపై మెళకువలు నేర్చుకొని వెళ్తున్నారు. మొత్తంగా ఈ రైతులు విజయం సాధించి ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. పట్టు పురుగుల పెంపకంలో ఏ సహకారం కావాలన్నా 9959278738, 9959278716 నంబర్లలో సంప్రదించవచ్చు.
పట్టు సాగు గణనీయంగా పెరిగింది..
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పట్టు సాగు రైతులను బాగా ప్రోత్సహిస్తున్నారు. మంత్రి చొరవతో రూ.2కోట్లు మంజూరయ్యాయి. షెడ్డు నిర్మాణం చేసుకున్న రైతులకు వెంటనే రూ.2 లక్షల వరకు అందిస్తున్నాం. జడ్పీ చైర్పర్సన్ రోజారాధాకృష్ణశర్మ సహకారంతో చంద్లాపూర్‌లో చాలా మంది రైతులు ముందుకు వచ్చి వందల ఎకరాల్లో సాగు చేపట్టారు. కొత్త రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అన్ని సలహాలు, సూచనలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నాం. ఎంత మంది రైతులు ముందుకు వచ్చినా పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం.