మెదక్, (నమస్తే తెలంగాణ)/నర్సాపూర్, అక్టో బర్ 9 : మెదక్ జిల్లా నర్సాపూర్‌లో స్థానిక మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్, ఆయన భార్య ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ రాజమణి పార్టీ లో చేరుతున్న సందర్భంగా బీజేపీ నిర్వహించిన బహిరంగ సభ అట్టర్ ప్లాప్ అయ్యింది. ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభం కావాల్సిన బీ జేపీ ర్యాలీ 3గంటలకు ప్రారంభమైంది. ఆ తర్వాత 3గంటలకు బహిరంగ సభకు రావాల్సిన ముఖ్య అతిథులతో పాటు బీజేపీ రాష్ట్ర నేతలు 5గంటలకు సభాస్థలికి చేరుకున్నారు. ముందుగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర కార్మిక శాఖ, ఉపాధి శాఖ మం త్రి భూపేంద్ర యాదవ్ 5 గంటలకు ప్రసంగం మొ దలు పెట్టగానే సభలో నుంచి జనం వెళ్లిపోయారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రసంగం కొనసాగింది. వీరిద్దరి ప్రసంగాలు ముగిసిన తర్వాత భూపేంద్ర యాదవ్‌తో పాటు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్‌చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సభ నుంచి వెళ్లిపోయారు. అప్పటికే సాయంత్రం ఆరు గంటలు కావస్తున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చీకట్లోనే ప్రసంగించారు. సభ వద్ద లైటింగ్ లేకపోవడంతో ఈటల రాజేందర్ మాట్లాడేది అర్ధం కాక ప్రజలు సభ నుంచి వెనుదిరిగారు. దీంతో బహిరంగ సభ ప్రాంగణం మొత్తం ఖాళీ అయింది.
ఆయా రామ్.. గయా రామ్…
నర్సాపూర్ బీజేపీ బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర నేతల ప్రసంగం ఆయా రామ్.. గయా రామ్ అన్నట్టుగా సాగింది. వచ్చింది ఎక్కువ.. మాట్లాడింది తక్కువ అన్నట్టు అయ్యింది. ముఖ్య అతిథిగా ప్రసంగించిన కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి భూపేంద్రయాదవ్ హిందీలో ప్రసంగించడంతో ప్రజలకు అర్థం కాపోవడంతో సభ నుంచి వెళ్లిపోయారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్‌చుగ్ అసలు ప్రసంగించకుండానే వెళ్లిపోయారు.
సభలో ఖాళీ కుర్చీలే దర్శనం… రోడ్లపైనే జనం
నర్సాపూర్ సమీపంలోని వెల్దుర్తి రోడ్డులో బీజేపీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభం కావాల్సిన సభ సాయం త్రం 5గంటలకు ప్రారంభమైంది.
సభలో బీజేపీ నేతలు ప్రసంగిస్తుండగానే జనం వెనుదిరిగి పోయా రు. దీంతో సభా ప్రాంగణంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. కొంతమంది జనం రోడ్లపైనే ఉండిపోయారు. టీఆర్ఎస్ నుంచి భారీగా చేరికలు ఉంటాయని బీజేపీ నేతలు కొద్దిరోజులుగా చెప్పకుంటూ వచ్చారు. కానీ, నర్సాపూర్ నియోజకవర్గంలోని మండలాల నుంచి టీఆర్ఎస్ జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఏ ఒక్కరూ కూడా బీజేపీలో చేరలేదని టీఆర్ఎస్ నేతలు అన్నారు.