అందోల్, సెప్టెంబర్ 15: దళితబంధుతో దళితులు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న రూ.10లక్షల సాయం దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపడమేకాదు స్వతహాగా మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నదని పేర్కొన్నారు. మొదటి విడుత దళితబంధులో వాహనా లు కొన్న లబ్ధిదారులు వాటిపై వచ్చిన ఆదాయంతో మళ్లీ జేసీబీలు, కార్లు, ఇతర వాహనాలు కొని ఎమ్మెల్యే చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
శుక్రవారం వట్పల్లి మండలం పోతులబొగుడలో కొత్త వాహనాలకు పూజలు చేసిన ఎమ్మెల్యే యజమానులను అభినందించి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వట్పల్లి మండలం బుడ్డాయిపల్లిలో మొదటి విడుతగా 44 కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున దళితబంధు ద్వారా ఆర్థికసాయం అందజేశారన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని వివిధ వ్యాపారాలు చేస్తూ ఆర్థికాభివృద్ధి సాధించి మరికొంతమందికి ఉపాధినిచ్చే స్థాయికి వెళ్లారని చెప్పారు. గ్రామానికి చెందిన సదానందం, శ్రీహరి, సంజీవులు జేసీబీ కొనుగోలు చేసి వచ్చిన లాభంతో మరొక జేసీబీ కొనగా, ప్రవీణ్, ప్రమోద్, భూమయ్య సైతం మరొక జేసీబీని కొనుగోలు చేశారన్నారు.
సుశీల్ మరొక ట్రాక్టర్ను యాదయ్య డీజేను.. మరి కొంతమంది ట్యాక్సీ ఆటోలు ఇతర పాడి పరిశ్రమను ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. జేసీబీ, కారు(ట్యాక్సీ) ఆటోలను కొనుగోలు చేసి మరి కొంతమందికి ఉపాధినిచ్చే స్థాయికి ఎదిగారని, ఇదీ సీఎం కేసీఆర్ కోరుకున్న దళిత ఆర్థికాభివృద్ధి అని ఎమ్మెల్యే చెప్పారు. ఇంతటి బృహత్తర పథకాన్ని ప్రవేశపెట్టి బడుగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎంను దళితులు ఎప్పటికీ మరిచిపోరన్నారు. ఈ పథకం ప్రారంభించినప్పుడు ప్రతిపక్షలు ఇది అమలుకు నోచుకోదని, అసలు దాని ప్రతిఫలమే కనబడవని.. ఇలా ఎన్నో అసత్యాలు ప్రచారం చేశారు.
కానీ వారు నోరెళ్లబెట్టేలా దళితబంధు ఫలాలు వెలుగులు జిమ్ముతున్నాయని, విమర్శించిన నోళ్లకు తాళాలు పడ్డాయనన్నారు. రెండో విడుతలో సైతం అసలైన లబ్ధిదారులకే ఈ పథకం అందజేస్తామని పేర్కొన్నారు. అనంతరం కొత్త వాహనాలను కొనుగోలు చేసిన లబ్ధి దారులను అభినందించిన ఎమ్మెల్యే వారికి స్వీట్లు తినిపించారు. అనంతరం జేసీబీని ప్రారంభించి కొద్దిదూరం వరకు డ్రైవింగ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, దళితబంధు లబ్ధిదారులు పాల్గొన్నారు.