సర్కారు బడుల నుంచి క్రీడా మాణిక్యాలు వెలుగులోకి రానున్నాయి.గ్రామీణ విద్యార్థులు ఆటల్లో సత్తా చాటనున్నారు. ప్రభుత్వ బడుల్లో క్రీడాభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వ ‘క్రీడానిధి’ని ఏర్పాటు చేసింది. క్రీడానిధి డబ్బులను నేరుగా పాఠశాలల యాజమాన్య కమిటీ ఖాతాల్లో జమ చేసింది. ఈ నిధులతో క్రీడా సామగ్రి కొనుగోలు చేస్తారు. ప్రాథమిక పాఠశాలలకు రూ.5 వేలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు రూ.10వేల చొప్పున నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. క్రీడానిధులు విడుదల చేయడంతో సర్కారు బడుల్లో క్రీడా సామగ్రి విద్యార్థులకు అందుబాటులోకి వచ్చి ఆటల్లో విద్యార్థులు మెరువనున్నారు.
– సంగారెడ్డి (నమస్తే తెలంగాణ)/ మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 28
సంగారెడ్డి, డిసెంబర్ 28(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాశాఖ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారు. మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా సర్కారు బడులకు కొత్తరూపు తీసుకు వస్తున్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టారు. చదువులతో పాటు విద్యార్థులు క్రీడల్లో రాణించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో ఆటల ఆడించేందుకు వ్యాయామ ఉపాధ్యాయులను నియమిస్తోంది. విద్యార్థులకు అవసరమైన క్రీడా సామగ్రి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ‘క్రీడానిధి’ పేరుతో ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తోంది. ఈ క్రీడా నిధులను నేరుగా పాఠశాలల యాజమాన్య కమిటీ ఖాతాల్లో జమ చేస్తున్నది. ఈ నిధులతో పాఠశాల యాజమాన్య కమిటీలు క్రీడా సామగ్రిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. క్రీడా సామగ్రి కొనుగోలు కోసం ప్రాథమిక పాఠశాలలకు రూ.5 వేలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు రూ.10వేల చొప్పున నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వం క్రీడానిధులు విడుదల చేయటంతో సర్కారు బడుల్లో క్రీడా సామగ్రి విద్యార్థులకు అందుబాటులోకి రానున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు క్రీడల్లో రాణించేలా చర్యలు తీసుకుంటున్నది. క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఆటలు ఆడేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అవసమరైన క్రీడా సామగ్రి కొనుగోలుకు సంగారెడ్డి జిల్లా రూ.82.50 లక్షల నిధులు విడుదల చేసింది. ప్రాథమిక పాఠశాలలకు రూ.5వేల చొప్పున జిల్లాలోని 830 ప్రాథమిక పాఠశాలలకు రూ.41.50 లక్షల నిధులు విడుదల చేసింది. ప్రాథమికోన్నత పాఠశాలలకు అవసరమైన క్రీడా సామగ్రి కొనుగోలుకు ఒక్కో పాఠశాలకు రూ.10,000 నిధులు విడుదల చేసింది. జిల్లాలో 189 పాఠశాలలకు రూ.10వేల చొప్పున రూ.18.90 లక్షల నిధులు విడుదల చేసింది. ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు క్రీడా సామగ్రి కొనుగోలుకు రూ.10వేల చొప్పున నిధులు విడుదల చేసింది. జిల్లాలోని 221 ఉన్నత పాఠశాలలకు రూ.10వేల చొప్పున రూ.22.10 లక్షల నిధులు విడుదల చేసింది. ఈ నిధులను నేరుగా పాఠశాలల యాజమాన్య కమిటీ ఖాతాల్లో జమయ్యాయి. ఈ నిధులతో పాఠశాలల్లోని విద్యార్థులకు అవసరమైన ఫుట్బాల్, వాలీబాల్,
క్రికెట్ కిట్, బాస్కెట్బాల్, షాట్పుట్, స్కిప్పింగ్ రోప్స్, త్రోబాల్, టెన్నిస్ కిట్ తదితర క్రీడా సామగ్రిని కొనుగోలు చేయనున్నారు. జిల్లాలోని 1240 ప్రభుత్వపాఠశాలల్లో విద్యార్థులకు క్రీడా సామగ్రి అందుబాటులోకి రానున్నది. దీంతో విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొని ప్రతిభను చాటుకునే అవకాశం దక్కనున్నది. నిధులు విడుదల చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, పాఠశాలల యాజమాన్య కమిటీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 28: క్రీడలను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు రూ.16.52 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఏయే క్రీడా పరికరాలు కొనాలో మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. మెదక్ జిల్లాలో మొత్తం 898 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 623, ప్రాథమికోన్నత పాఠశాలలు 129, ఉన్నత పాఠశాలలు 146 ఉన్నాయి. నిధులు విడుదల చేయడంతో ఇక సర్కారు బడుల్లో క్రీడలకు మంచి రోజులు రానున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై వ్యాయామ ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలకు ప్రత్యేకంగా క్రీడా సామగ్రి కొనుగోలుకు నిధులు కేటాయించడం శుభపరిణామం. తద్వారా విద్యార్థులు క్రీడల్లోనూ రాణించేందుకు అవకాశం లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు అధిక నిధులు కేటాయించడం ఆనందంగా ఉంది.
-మధుసూదన్, పీఈటీ, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, మెదక్