సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 31: ఆల్ ఇండియా సర్వీసెస్ ట్రైనీ అధికారులకు క్షేత్రస్థాయి అధ్యయనం అత్యంత ఉపయుక్తమవుతున్నదని కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. ఆల్ ఇండియా సర్వీసెస్ ట్రైనీ అధికారులు 19 మంది తమ శిక్షణలో భాగంగా క్షేత్రస్థాయిలో వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు తీరు పరిశీలన కోసం సోమవారం జిల్లాకు వచ్చారు. ట్రైనీ అధికారులు కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ శరత్, ఎస్పీ రమణ కుమార్లను మర్యాద పూర్వకంగా కలిశారు. ట్రైనీ అధికారులతో కూడిన బృందం సోమవారం నుంచి నవంబర్ 5వ తేదీ వరకు జిల్లాలో క్షేత్రస్థాయి అధ్యయనం చేయనున్నది. 19 మంది అధికారులను 4 బృందాలుగా చేసి ఒక్కో బృందానికి క్షేత్రస్థాయి అధ్యాయనం కోసం ఒక్కో గ్రామాన్ని కేటాయించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. ఎస్పీ రమణ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని విధాల శాంతి భద్రతలు పటిష్టంగా అమలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మహిళల రక్షణ కోసం చేపట్టిన చర్యలను వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, అదనపు ఎస్పీ, జెడ్పీ సీఈవో, డీఆర్డీవో, ఏపీడీలు, ట్రైనీ అధికారులు పాల్గొన్నారు.
అనుమతిలేని వాహనాల్లో ప్రజా రవాణా చేయడం, పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్తున్న వాహదారులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టర్ చాంబర్లో అక్రమ రవాణా అరికట్టడంపై ఏర్పాటు చేసిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షతన వహించి మాట్లాడారు. ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణించాలని, ప్రైవేట్ వాహనాల్లో ప్రయా ణించి ప్రమాదాల బారిన పడవద్దని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ రమణ కుమార్, అదనపు ఎస్పీ ఉషా విశ్వనాథ్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ శివలింగయ్య, ఆర్టీసీ ప్రాంతీయ అధికారి సుదర్శన్, ఉప ప్రాంతీయ అధికారి జానకీరాములు పాల్గొన్నారు.