మెదక్, ఏప్రిల్ 20: కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో జిల్లా సహకార శాఖ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో సహకార శాఖ సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొని, సమస్యలు పరిష్కరించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఏదైనా సమస్య ఏర్పడితే వెంటనే పరిష్కరించాలన్నారు. కొనుగోలు కేంద్రాలను నిత్యం సందర్శించాలని ఆదేశించారు. అలసత్వం వహించే అధికారులను ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు ఉంటే పర్యవేక్షణ సిబ్బంది బాధ్యత వహించాలన్నారు.
సీఎంఆర్ డెలివెరీలో పురోగతిపై సమీక్ష..
జిల్లాలో ధాన్యం సేకరణ, వానకాలం, యాసంగి సీఎంఆర్ డెలివెరీలో పురోగతిపై రైస్ మిల్లర్లతో జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. రానున్న 2021-22 సీజన్లో ధాన్యాన్ని వీలైనంత తొందరగా దిగుమతి చేసుకోవాని సూచించారు. ఏ రోజుకు ఆ రోజు కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యం లారీలను వెనువెంటనే దిగుమతి చేసుకుని తిరిగి కొనుగోలు కేంద్రాలకు పంపించాలని తెలిపారు. 2020-21 సీజన్ రబీలో బియ్యం డెలివరీలో జిల్లా చాలా వెనుకబడి ఉన్నందున గడువులోగా సీఎంఆర్ పూర్తి చేయాలని ఆదేశించారు. గోదాంలలో ఉన్న స్థలాభావం దృష్ట్యా కొత్త గోదాంలు సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. ఖాళీ గోనె సంచులను కొనుగోలు కేంద్రాల్లో అప్పగించాలని స్పష్టం చేశారు. సమీక్షలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా మేనేజర్ సాయిరాం, సహకార శాఖ సిబ్బంది, రైస్‌మిల్లుల అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రపాల్, బాయిల్డ్, రైస్ మిల్లుల యజమానులు పాల్గొన్నారు.