
నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాయరావు చెరువు గతంలో కేవలం సాగునీటికి మా త్రమే ఉపయోగించేవారు. తెలంగాణ ప్రభు త్వం ఏర్పడిన తర్వాత మిషన్ కాకతీయతో చెరువుకు కొత్త కళ సంతరించుకున్నది. చెరువులను కేవలం సాగునీటికే కాకుండా పట్టణ వాసులు సేదతీరడానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వం తీర్చిదిద్దింది. రాయరావు చెరువు కట్టపై పట్టణవాసులు, పర్యాటకులను ఆకర్షించడానికి ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజూ ఉదయం పట్టణ వాసులు జాగింగ్ చేసుకోడానికి ఫుట్‌పాత్‌ను నిర్మించారు. బీవీఆర్ఐటీ కళాశాల యాజమాన్యం సహకారంతో చెరువు కట్టపై బెం చీలు, అజయ్ యాదవ్ ట్రస్టు సహకారంతో జిమ్ పరికరాలు, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు అర్బన్ పార్కును చూడడానికి తరలివస్తున్నారు.
అర్బన్ పార్కుకు రాయరావు చెరువు సమీపంలో ఉండడంతో పర్యాటకులు చెరువు అందాలను వీక్షిస్తున్నారు. చెరువు కట్టపై నుంచి పచ్చని పొలాలు, గుట్టలు చూపరులను ఆకర్షిస్తున్నాయి. వీకెండ్లో పట్టణవాసులు, పర్యాటకులు సరదాగా గడుపుతున్నా రు. దైవచింతన కోసం చెరువు కట్టపై కట్టమైసమ్మ, ఎల్లమ్మ ఆలయాలను నిర్మించారు. అర్బన్ పార్కులో గల వాచ్ టవర్ నుంచి చెరువు అందాలను చూడడానికి రెండు కండ్లు సరిపోవు.
పర్యాటక ప్రాంతంగా రాయరావు చెరువు
పట్టణంలోని రాయరావు చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. చెరువులో బోటింగ్ ఏర్పా టు చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాం. కొన్ని కారణాలతో అది సాధ్యపడడం లేదు. త్వరలోనే బోటింగ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. -మదన్‌రెడ్డి, ఎమ్మెల్యే నర్సాపూర్
మరో జిమ్ సెట్ ఏర్పాటు చేస్తాం
రాయరావు చెరువు కట్టపై ఇప్పటికే అజయ్ యాదవ్ ట్రస్టు ఆధ్వర్యంలో జిమ్ పరికరాలు, పిల్లల ఆట సామగ్రి ఏర్పాటు చేశాం. ఇప్పటికే మొక్కలను అజయ్ యాదవ్ ట్రస్ట్ ద్వారా నాటాం. పర్యాటకుల తాకిడి రోజురోజుకూ పెరుగుతుంది. పర్యాటకుల ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం.
-మురళీయాదవ్, మున్సిపల్ చైర్మన్, నర్సాపూర్