వీడిన బాలిక మౌనిక హత్య కేసు
జహీరాబాద్, ఫిబ్రవరి 16 : జహీరాబాద్ మండలం హుగ్గెల్లిలో హత్యకు గురైన బాలిక మౌనిక(16) హత్య కేసు వీడింది. ప్రేమ వద్దని వారించినా వినకపోవడంతో కన్న తల్లే కడతేర్చిందని డీఎస్పీ శంకర్రాజు తెలిపారు. ఈ మేరకు బుధవారం జహీరాబాద్ రూర ల్ పోలీసు స్టేషన్లో బాలిక హత్య కేసు వివరాలు వెల్లడించారు. జహీరాబాద్ మండలం హుగ్గెల్లి గ్రామానికి చెందిన బుజ్జమ్మ కూతురు మౌనిక పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువున్నది. బాలిక అదే గ్రామానికి చెందిన ఫకీర్ అప్సర్ అనే యువకుడిని ప్రేమిస్తున్నట్లు బుజ్జమ్మకు తెలిసింది. అతడిని ప్రేమించడం మానుకోవాలని తల్లి పలుమార్లు చెప్పినా మౌనిక పట్టించుకోలేదు. దీంతో బాలికను ఎలాగైనా హత్య చేయాలని బుజ్జమ్మ భావించింది. ఇందుకు జహీరాబాద్ మండలం కాశీంపూర్‌కు చెందిన గొల్ల నర్సింహులుతో కలిసి పథకం వేసింది.(బుజ్జమ్మకు నర్సింహులుతో వివాహేతర సంబంధం ఉంది.) అందులో భాగంగా బుజ్జమ్మ, నర్సింహులు కలిసి జహీరాబాద్‌లో మద్యం తాగి, హుగ్గెల్లికి వచ్చారు. బాలికను గ్రామ శివారులోని మామిడి తోటకు తీసుకెళ్లి, యువకుడిని ప్రేమించొద్దని బుజ్జమ్మ బెదిరించింది. అయినా మౌనిక వినకపోవడంతో బాలికపై తల్లి కూర్చోగా, నర్సింహులు చున్నీని మెడకు బిగించి హత్య చేశాడని డీఎస్పీ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో 24 గంటల్లో కేసు ఛేదించిన జహీరాబాద్ పట్టణ సీఐ రాజశేఖర్, జహీరాబాద్ రూరల్, పట్టణ, చిరాగ్పల్లి ఎస్సైలు రవి, శ్రీకాంత్, కాశీనాథ్‌ను డీఎస్పీ అభినందించారు. వీరికి రివార్డు కోసం ఎస్పీకి నివేదిస్తామన్నారు.