
నారాయణఖేడ్/అందోల్/చౌటకూర్, నవంబర్ 1: రైతులు ఏ పంట వేసుకున్నా రైతుబంధుకు ఎటువంటి ఢోకా లేదని, కేసీఆర్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం నారాయణఖేడ్ మండలంలోని పలు గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల మేలు కోరి సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ వంటి కార్యక్రమాలను చేపడుతుండగా వీటిని ఓర్వలేని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని, అటువంటి కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఖేడ్ డివిజన్లో మొత్తం 46 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి క్వింటాలుకు రూ.1,960ల మద్దతు ధరతో కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ్రెడ్డి, జడ్పీటీసీ లక్ష్మీబాయి రవీందర్‌నాయక్, ఎంపీపీ ఉపాధ్యక్షుడు సాయిరెడ్డి, ఏడీఏ కరుణాకర్‌రెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్వర్‌రెడ్డి, ఐకేపీ ఏపీఎం టిక్యానాయక్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సత్యపాల్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
రైతుల సౌకర్యార్థమే కొనుగోలు కేంద్రాలు : ఎమ్మెల్యే క్రాంతికిరణ్..
రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసి వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడం కోసమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నదని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. సోమవారం జోగిపేట మార్కెట్ గంజ్, చౌటకూర్ మండలం కోర్పోల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సౌకర్యార్థమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని రైతులు తమ ధాన్యాన్ని ఇక్కడే విక్రయించి మంచి మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులు ధాన్యాన్ని కల్లాల వద్దే పూర్తిగా ఆరబెట్టి తీసుకువస్తే మంచి ధర లభిస్తుందన్నారు. సిబ్బంది వద్ద టోకెన్లు తీసుకుని వరుస క్రమంలో ధాన్యం తీసుకువచ్చి విక్రయించుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మల్లికార్జున్, మాజీ చైర్మన్లు నారాయణ, నాగభూషణం, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, వైస్ చైర్మన్ ప్రవీణ్, ఏడీఏ అరుణ, ఎంపీడీవో మధులత,గ్రామ సర్పంచ్ నర్సింహారెడ్డి, ఉపసర్పంచ్ ముకుందం, ఏవో చైతన్య, టీఆర్ఎస్ మండల ప్రధానకార్యర్శి శ్రీహరి తదితర నాయకులు పాల్గొన్నారు.