జహీరాబాద్, ఏప్రిల్ 20 : ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశ పెట్టి నిధులు మం జూరు చేసి జోరుగా పనులు చేస్తున్నది. జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని పాత 24వార్డుల్లో ఉన్న ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేసేందుకు ఐడీఎస్ఎంటీ కాలనీ, పశువుల సంత స్థలంలో రెండు చోట్ల ట్యాంకుల నిర్మాణం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగరీథ పథకంలో పనులు చేసేందుకు మున్సిపల్‌కు రూ. 23.11కోట్లు మంజూరు చేసింది. పట్టణంలో 43.50కిలోమీటర్లు పైపులైన్ నిర్మించారు. 4500ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చి తాగునీరు సరఫరా చేసేందుకు సిద్ధం చేశారు. పట్టణంలోని ఐడీఎస్ఎంటీ కాలనీలో 14లక్షల లీటర్లు కెపాసిటీ, పశువుల సంత స్థలంలో 5లక్షల లీటర్ల ట్యాంకును ఏర్పాటు చేస్తున్నారు. పైపులైన్ పనులు పనులు పూర్తి చేశారు. ట్యాంకు నిర్మాణం పనులు పూర్తికావచ్చాయి. ఈ నెలలో తాగునీటి సరఫరాను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు మున్సిపల్ పరిధిలో పర్యటించినప్పుడు ఎమ్మెల్యే మాణిక్‌రావు తాగునీటి సమస్యను పరిష్కారం చేయాలని కోరారు. స్పందించిన మంత్రి నిధులు మంజూరు చేయడంతో పనులు జోరుగా సాగుతున్నాయి.
ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో ఇంజినీరింగ్ అధికారులు టెండర్లు వేసి కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. వేసవిలో ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేయడమే లక్ష్యంగా అధికారులు పనులను యుద్ధప్రతిపాదికన చేయిస్తున్నారు. పైపులైన్ పనులు పూర్తి అయ్యాయి. ట్రయల్ రన్ నిర్వహించి ఎక్కడైనా లీకేజీలు ఉంటే మరమ్మతులు చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలోని ఆదర్శనగర్, దత్తగిరి కాలనీ, ఎన్జీవో కాలనీ, ముసానగర్, చెన్నారెడ్డి కాలనీ, సుభాశ్గంజ్, శాంతినగర్, బాగారెడ్డిపల్లి, హౌసింగ్ బోర్డు కాలనీతో పాటు పలు కాలనీల్లో పనులను పూర్తి చేశారు. ప్రతి రోజు తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ట్యాంకుల నిర్మాణం పూర్తి కావడంతో ఇంజినీరింగ్ అధికారులు పెండింగ్‌లో ఉన్న పైపులైన్ కనెక్షన్లు పూర్తి చేస్తున్నారు.
మిషన్ భగీరథలో ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన అనుమతి కంటే అదనంగా పైపులైన్, నల్లా కనెక్షన్లు ఏర్పా టు చేశారు. పట్టణ ప్రజలకు తాగునీరు సరఫరా చేసేందుకు రెండు ట్యాంకులు నిర్మిస్తున్నాం. పనులు పూర్తయ్యాయి. ఏప్రిల్‌లో మిషన్ భగరీథ తాగునీరు ప్రతి ఇంటికీ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– భరత్‌కుమార్, మిషన్ భగీరథ ఏఈ, జహీరాబాద్